పెళ్లి వేడుకలో విషాదం- వధువుపై తుపాకితో కాల్పులు- పరిస్థితి విషమం- ప్రేమ వ్యవహారమే కారణమా?
బిహార్లో విషాద ఘటన- వధువుపై కాల్పులు జరిపిన యువకుడు- ఆస్పత్రికి తరలించిన స్థానికులు- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

Published : February 25, 2026 at 6:48 PM IST
Lover Shot Bride With A Gun : వివాహ వేదికపై ఉన్న వధువుపై కాల్పులు జరిపాడు ఓ కిరాతకుడు. దీంతో పెళ్లి మండపమంతా రక్తసిక్తమైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, దాడి చేసిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన వివాహ అతిథులు, స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటన బిహార్లో జరిగింది.
అసలేం జరిగింది?
"బక్సర్ జిల్లా చౌసా నగర్ పంచాయతీ పరిధిలోని మల్లా టోలిలో ఈ ఘటన జరిగింది. వధువు ఆర్తి కుమారి తన కాబోయే భర్తతో పెళ్లి మండపంపై ఉంది. ఆ సమయంలో వివాహ మండపమంతా బంధుమిత్రుల కోలాహలంగా సందడిగా ఉంది. అయితే వివాహ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి వధువు ఆర్తి కుమారిపై తుపాకితో కాల్పులు జరిపాడు. బుల్లెట్ వధువు శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆర్తి కుమారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారాణాసి ట్రామా సెంటర్‌కు పంపించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు" అని పోలీసులు పేర్కొన్నారు.
గతంలో జైలుకు వెళ్లొచ్చిన నిందితుడు
ఇదిలా ఉండగా, విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వధువుపై కాల్పులు జరిపిన వ్యక్తిని దీనబంధుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అయితే, ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో దీనబంధు కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు గతంలో మద్యం కేసులో జైలుకు వెళ్లొచ్చాడని తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. మరోవైపు, ఈ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందా లేదా క్షణికావేశంతో జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ అధికారి చెప్పారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతంరం తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో నిందితుడిని అరెస్టు చేస్తామని చెప్పారు.
"వర్మల (వధూవరులు పూలమాలలు మార్చుకునే ఆచారం) వేడుక తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు పెళ్లికూతురుపై కాల్పులు జరిగాయి. నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి."
- గౌరవ్ పాండే, డీఎస్పీ, బక్సర్
ప్రేమ వ్యవహారమే కారణమా?
అయితే ఈ దాడి వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. నిందితుడికి, వధువుకు మధ్య గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఈ విషయంపై గ్రామంలో కొద్దిరోజులుగా చర్చ నడుస్తోందని చెబుతున్నారు. అయితే, వధువు వివాహ విషయం తెలిసి నిందితుడు కలత చెందాడని, ఈ క్రమంలో ఆమెపై ద్వేషం పెంచుకున్నట్లుగా గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం!
మరోవైపు, వధువుపై జరిగిన దాడికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది. అందరూ చూస్తుండగానే నిందితుడు ఆమెపై కాల్పులు జరపడాన్ని అక్కడి గ్రామస్థులు తీవ్రంగా ఖండించారు. గ్రామంలో నెలకొన్న శాంతిభద్రతల గురించి పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు, బాధిత కుటుంబం కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అయితే, ఎట్టిపరిస్థితుల్లో నిందితుడిని వదిలిపెట్టబోమని, అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో అంతా శాంతించారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి- మర్డరా? బలవన్మరణమా?
నీట్ పరీక్ష కోసం ఒత్తిడి- తండ్రిని చంపి ముక్కలు చేసిన కుమారుడు- ఆపై డ్రమ్ములో దాచిపెట్టి!

