కోర్టు ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీలు- హైకోర్టు సీరియస్- మున్సిపల్ కమిషనర్ ఏం చెప్పారంటే?
మున్సిపల్ ఎన్నికల డ్యూటీకి కోర్టు ఉద్యోగులకు కేటాయించడంతో తీవ్ర విమర్శలు- సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు- విచారణకు మున్సిపల్ కమిషనర్ హాజరు

Published : January 6, 2026 at 12:13 PM IST
Court employees Election Duty : మహారాష్ట్రలో మరికొద్ది రోజుల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల డ్యూటీ కోర్టు ఉద్యోగులకు కూడా కేటాయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనేక మంది కోర్టు ఉద్యోగులు స్పందించి, విధులు కేటాయించడంపై మండిపడ్డారు. దీంతో ఆ వ్యవహారం తీవ్రంగా మారడంతో బాంబే హైకోర్టు సుమోటోగా పిటిషన్ నమోదు చేసింది. సోమవారం విచారణ చేపట్టగా, మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగరాణి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.
అయితే ఏర్పాట్లలో భాగంగా కోర్టు ఉద్యోగులకు పొరపాటున ఎన్నికల డ్యూటీ కేటాయించినట్లు ముంబయి మున్సిపల్ కమిషనర్, జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి భూషణ్ గగరాణి బాంబే హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే ఆ వివరణను హైకోర్టు అంగీకరించలేదు. ఈ అంశంపై ఎలాంటి తాత్కాలిక ఉపశమనం ఇవ్వకుండా కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు భూషణ్ గగరాణి తన వ్యక్తిగత అఫిడవిట్‌ను న్యాయవాది ద్వారా కోర్టుకు సమర్పించారు. ఇందులో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తనకు స్పష్టమైన అవగాహన లేకపోవడంతోనే అనుకోకుండా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ఇది తన పొరపాటేనని అంగీకరించారు. అయితే ఈ అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.
అసలు ఏం జరిగింది?
ముంబయిలో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగరాణి. నగరంలోని అన్ని లోయర్ కోర్టుల ఉద్యోగులను ఎన్నికల విధులకు హాజరుకావాలని ఆదేశిస్తూ డిసెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని దిగువ న్యాయస్థానాలకు లేఖలు పంపించారు. అయితే ఈ లేఖపై ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఉద్యోగుల విషయంలో ఇప్పటికే హైకోర్టు ఒక పరిపాలనా నిర్ణయం తీసుకుందని, న్యాయస్థాన సిబ్బందికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌లను కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
అయినప్పటికీ, డిసెంబర్ 29న మున్సిపల్ కమిషనర్ మరో లేఖ రాసి కోర్టు ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత తీవ్రమైంది. ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు, అదే రోజు రాత్రి 8 గంటలకు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి మలబార్ హిల్‌లోని అధికార నివాసంలో మరో న్యాయమూర్తిని పిలిపించి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి అత్యవసరంగా విచారణ చేపట్టింది.
ఈ విచారణలో మున్సిపల్ కమిషనర్ అధికార పరిధిపై నేరుగా ప్రశ్నలు సంధించింది. కోర్టు ఉద్యోగులను ఎన్నికల విధులకు పిలవడానికి ఎలాంటి అధికారం ఉందని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు, కమిషనర్ జారీ చేసిన లేఖను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న మున్సిపల్ కమిషనర్ వ్యక్తిగతంగా అఫిడవిట్ దాఖలు చేసి తన అధికార పరిధిని వివరించాలని ఆదేశించింది.
హైకోర్టు కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 2008లో ఇచ్చిన ఒక కీలక తీర్పును ఉదాహరిస్తూ, డిసెంబర్ 22న కోర్టు ఉద్యోగులను ఎన్నికల విధులకు పిలుస్తూ జారీ చేసిన లేఖపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. మున్సిపల్ కమిషనర్‌ను తీవ్రంగా మందలించిన కోర్టు, ఏ అధికారంతో ఈ నోటీసులు జారీ చేశారు? అంటూ నేరుగా ప్రశ్నించింది. ఆ రాత్రి జరిగిన విచారణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉప కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై కీలక సమాచారం ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఎప్పుడూ కోర్టు ఉద్యోగులను ఎన్నికల విధులకు పిలవదని స్పష్టం చేశారు.

