'తత్కాల్ టికెట్ రద్దు చేస్తే డబ్బులు ఇవ్వరా?'- నో రీఫండ్ విధానాన్ని సవాల్ చేస్తూ రైల్వేలపై హైకోర్టులో పిటిషన్
నో రీఫండ్ పాలసీ పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్న వైనం- అదే సీటును మరో వ్యక్తికి అమ్మి రెండు రెట్ల లాభం పొందుతున్న రైల్వేలు- ఇది రాజ్యాంగ విరుద్ధం అంటున్న న్యాయవాది

Published : January 10, 2026 at 8:57 PM IST
PIL Against Railway Tatkal: "ప్రయాణికుల అత్యవసరాన్ని ఆసరాగా చేసుకుని భారతీయ రైల్వేలు 'తత్కాల్' పేరుతో భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఎవరైనా ప్రయాణికుడు అనివార్య కారణాల వల్ల తత్కాల్ టికెట్‌ను రద్దు చేసుకుంటే, వారికి నయా పైసా కూడా వెనక్కి ఇవ్వకుండా రైల్వే శాఖ మొండిచెయ్యి చూపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రద్దు అయిన ఆ సీటు ఖాళీగా ఉండదు. వెయిటింగ్ లిస్టులో ఉన్న మరో ప్రయాణికుడికి అదే రేటుకు ఆ సీటును అమ్ముతారు. అంటే ఒకే సీటుపై ఇద్దరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ రైల్వేలు 'డబుల్ ప్రాఫిట్' కొట్టేస్తున్నాయి" అని 'నో రీఫండ్' విధానాన్ని సవాల్ చేస్తూ తాజాగా ముంబయి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రైల్వేల తీరును తీవ్రంగా తప్పుపడుతూ న్యాయవాది సచిన్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
అసలు పిటిషన్‌లో ఏముంది?
"సాధారణ ప్రయాణికులను రైల్వేలు నిలువునా మోసం చేస్తున్నాయి. తత్కాల్ బుకింగ్ సేవలో ఉన్న 'రీఫండ్ ఇవ్వకూడదు' అనే నిబంధన చట్టవిరుద్ధం, ఏకపక్షం. ఒక ప్రయాణికుడు ఏదో అత్యవసర పరిస్థితి వల్లే టికెట్ రద్దు చేసుకుంటాడు. అలాంటప్పుడు ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వకపోవడం అన్యాయం. ఒక వైపు మొదటి ప్రయాణికుడి డబ్బులు ఉంచుకుంటున్నారు. మరోవైపు అదే సీటును వేరొకరికి అమ్మి వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇది కచ్చితంగా ప్రయాణికులను దోచుకోవడమే" అని పిటిషనర్ ఆరోపించారు.
ఆర్టీఐ ద్వారా షాకింగ్ నిజాలు
సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని సచిన్ అన్నారు. కేవలం రద్దయిన టికెట్ల ద్వారానే రైల్వేలు వందల కోట్లు వెనకేసుకున్నాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు)లకు ఈ విధానం విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టీఐ సమాచారం ప్రకారం, 2022 సంవత్సరంలో కేవలం వెయిటింగ్ లిస్ట్ టికెట్ల రద్దు ద్వారానే రైల్వేలు రూ.887 కోట్లు ఆర్జించాయని వెల్లడించారు. ఇక 2023 నాటికి ఈ మొత్తం మరింత పెరిగిందని, ఏకంగా రూ.1,042 కోట్లు దాటిందని ఆరోపించారు. ప్రజల సొమ్మును ఇలా నిబంధనల పేరుతో కాజేయడం ఎంతవరకు సమంజసం అని పిటిషనర్ ప్రశ్నించారు.
ప్రధాన డిమాండ్లు ఇవే!
రైల్వేల ఏకపక్ష ధోరణికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ పిటిషన్‌లో పలు కీలక డిమాండ్లు చేశారు. రైల్వేలు రద్దయిన టికెట్‌ను వేరొకరికి అమ్మినప్పుడు, మొదటిసారి కొనుగోలు చేసిన వ్యక్తికి కనీసం కొంత మొత్తమైనా వెనక్కి ఇవ్వాలి. ఆ సీటు ద్వారా రైల్వేలకు నష్టం రానప్పుడు, ప్రయాణికుడికి ఎందుకు నష్టం చేయాలి? కుటుంబంలో ఎవరైనా మరణించినా, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, అలాంటి సమయాల్లో టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి డబ్బును వాపసు ఇవ్వాలి. రద్దయిన తత్కాల్ టికెట్ల ద్వారా రైల్వేలు ఎంత లాభం పొందాయో ఆ వివరాలను బహిరంగపరచాలి. ప్రజలకు పారదర్శకమైన సమాచారం ఇవ్వాలి.
తత్కాల్‌లో ప్రయాణికులు హడావుడిగా, తప్పనిసరి పరిస్థితుల్లోనే టికెట్లు బుక్ చేసుకుంటారు. అలాంటి వారిని ఆదుకోవాల్సింది పోయి, ఇలా నిబంధనల పేరుతో దోచుకోవడం సరికాదని న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైల్వే ప్రయాణికులకు సంబంధించిన అంశం కావడంతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, జనవరి 2026 నుంచి రైల్వే శాఖ 'డేట్ చేంజ్' సదుపాయాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా కన్ఫర్మ్ అయిన టికెట్ల ప్రయాణ తేదీని రద్దు రుసుము లేకుండా మార్చుకోవచ్చు. అయితే తత్కాల్ 'నో రీఫండ్' వివాదంపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

