బంగాల్, అసోం ఎన్నికల్లో- SC, ST రిజర్వ్‌డ్ స్థానాలను స్వీప్ చేసిన బీజేపీ- ఎలా అంటే?
అసోం, బంగాల్ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కమలం పార్టీ- ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో సత్తా చాటిన బీజేపీ- మే9న కొలువుదీరనున్న బంగాల్ కొత్త ప్రభుత్వం- ప్రమాణ స్వీకారానికి మోదీ, షా

Published : May 6, 2026 at 6:56 PM IST
BJP Sweeps SC ST Seats : మే 4న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బంగాల్, అసోంలోని ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో బీజేపీ స్వీప్ చేసింది. ఆ రెండు రాష్ట్రాల్లో రిజర్వ్‌డ్ సీట్లలో మెజారిటీ స్థానాలను కాషాయదళం దక్కించుకుంది. ఈ క్రమంలో రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో కమలం పార్టీ పట్టు నిలుపుకుంది. అలాగే తమిళనాడు, పుదుచ్చేరిలో ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వ్ స్థానాల్లోనూ బీజేపీ మిత్రపక్షాలు మంచి ఫలితాలను సాధించాయి.
ఆ సీట్లలో బీజేపీకి మెరుగైన ఫలితాలు
బంగాల్‌లో ఎస్‌సీ రిజర్వ్ స్థానాల్లో 75 శాతం సీట్లను కమలం పార్టీ గెల్చుకుంది. అలాగే ఎస్‌టీ రిజర్వ్‌డ్ సీట్లలో 100 శాతం స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అంటే 16 ఎస్‌టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో కాషాయదళం విడయఢంకా మోగించింది. మరోవైపు, 126 నియోజకవర్గాలు ఉన్న అసోంలో తొమ్మిది సీట్లు ఎస్‌సీలకు, 19 సీట్లు ఎస్‌టీలకు రిజర్వ్‌డ్ అయ్యాయి. 9 ఎస్‌సీ సీట్లలో ఎన్‌డీఏ కూటమి 8 స్థానాల్లో (బీజేపీ ఒక్కటే 5 చోట్ల) విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక స్థానానికే పరిమితమైంది. 19 ఎస్‌టీ రిజర్వ్‌డ్ సీట్లలో ఎన్‌డీఏ క్వీన్‌స్వీప్ చేసింది. బీజేపీ ఒక్కటే 13 స్థానాల్లో గెలుపొందింది. తమిళనాడులో ఎన్‌డీఏ 46 ఎస్‌సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో 9 గెలుచుకుంది. రెండు ఎస్‌టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఒకదాంట్లో విజయం సాధించింది. పుదుచ్చేరిలో ఐదు ఎస్ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో రెండింటిని ఎన్‌డీఏ గెలుచుకుంది.
ఎన్‌డీఏ వైపు ఎస్‌సీ, ఎస్‌టీ ఓటర్లు
ఈ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ వైపు ఎస్‌సీ, ఎస్‌టీ ఓటర్లు స్పష్టంగా ఏకీకృతం అవుతున్నట్లు తెలియజేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఎన్‌డీఏకి అధికార స్తంభంగా మారాయని అన్నారు. అసోంలో రిజర్వ్‌డ్ సీట్లలో ఎన్‌డీఏ జయకేతనం ఎగురవేయడానికి నియోజకవర్గాల పునర్విభజన ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. ఈ డీలిమిటేషన్ వల్ల ఎస్‌టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు 16 నుంచి 19కి, ఎస్‌టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల సంఖ్య 8 నుంచి 9కి పెరిగాయని స్పష్టం చేశారు. ఎగువ అసోం, కొండ ప్రాంతాల్లో బీజేపీ విస్తరణ, బీపీఎఫ్‌తో పొత్తు ఎస్‌టీ సీట్లలో ఎన్‌డీఏ పాగా వేయడానికి బాగా ఉపయోగపడిందని అంచనా వేశారు. అలాగే బంగాల్‌లోని 68 ఎస్‌సీ రిజర్వ్‌డ్ సీట్లలో బీజేపీ 51 స్థానాలను గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైందని చెప్పారు. ఈ ఫలితాలు దళితుల మద్దతు స్పష్టంగా బీజేపీకి దక్కడాన్ని తెలియజేస్తున్నాయన్నారు. ఉత్తర బంగాల్, జంగల్‌మహల్ వంటి గిరిజన ప్రాంతాల్లో బీజేపీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం ఓటర్ల ఏకరీతి తీర్పును సూచిస్తోందని తెలిపారు.
కాగా, బంగాల్‌లో మొత్తం 84 ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నాయి. అందులో ఏకంగా బీజేపీ 67 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో టీఎంసీ 17కి పరిమితమైంది. బంగాల్‌లోని రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో కమళం పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది. బీజేపీ తన సంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటూనే బలహీన వర్గాల ఓట్లను కూడా బంగాల్‌లో కొల్లగొట్టింది. బంగాల్ సరిహద్దు ప్రాంతాల్లోని ఉన్న మతువా వర్గం కూడా బీజేపీకే తమ మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తోంది.
మే9న బంగాల్‌లో కొత్త సర్కార్
బంగాల్‌లో మే 9న బీజేపీ కొత్త సర్కార్ కొలువుదీరనుంది. బంగాల్‌లో తొలి బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ విషయాన్ని బంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య బుధవారం వెల్లడించారు. మే 9న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశం మే 8వ తేదీ సాయంత్రం జరగనుందని పేర్కొన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్ చరిత్రలోనే ఉంది : బీజేపీ
మమతా బెనర్జీ సీఎంగా కొనసాగవచ్చా? రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారు?

