ETV Bharat / bharat

'కాంగ్రెస్‌ చరిత్రను, మనస్థత్వాన్ని ప్రతిబింబించేలా రాహుల్‌ వ్యాఖ్యలు'- మోదీపై కామెంట్స్​ను తిప్పికొట్టిన బీజేపీ

కాంగ్రెస్‌ పార్టీలోనే అసలైన అత్యవసర పరిస్థితి ఉంది- వారే ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు- కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోనే తిరుగుబాటు ఎదుర్కొంటోంది- బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా వ్యాఖ్యలు

BJP national spokesperson Shehzad Poonawalla
BJP national spokesperson Shehzad Poonawalla (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 4, 2026 at 12:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

BJP Slams Rahul Remarks Modi : ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్​డీఏ సర్కార్‌ ఏడాదిలోపు కూలిపోతుందంటూ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఏడాదిలోపు మోదీ ప్రధానిగా ఉండరని, ఆయన నియంత్రణలో ఉన్న వ్యవస్థ ఇప్పుడు కుదుపులకు గురై అంతర్గతంగా కుప్పకూలిపోతోందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను అణిచివేసేందుకు దేశంలో అత్యవసర పరిస్థితి విధించే ప్రమాదం కూడా ఉందన్నారు.

'కాంగ్రెస్‌ పార్టీలోనే అసలైన అత్యవసర పరిస్థితి ఉంది'
అయితే ఈ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా గట్టి బదులిచ్చారు. రాహుల్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ చరిత్రను, మనస్థత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలోనే అసలైన అత్యవసర పరిస్థితి ఉందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలోనే సంస్థాగత పతనం, తిరుగుబాటు ఉందని, ఆ పార్టీ నేతలే ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోనే తిరుగుబాటు ఎదుర్కొంటోందన్నారు.

"రాహుల్ గాంధీ ఎమర్జెన్సీ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అందుకే ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ విధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన నమ్ముతున్నారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని ఒక్కసారి మాత్రమే ఉల్లంఘించారు, అది కూడా ఇందిరా గాంధీ చేశారు. ఆమె రాజ్యాంగ సంస్థలను ఎలా బలహీనపరిచి, వాటి పనిలో జోక్యం చేసుకున్నారో అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్యం కంటే వంశపారంపర్య పాలనకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే రాహుల్ గాంధీ, ఈనాటికీ ప్రతిచోటా ఎమర్జెన్సీనే చూస్తున్నారు. వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ తిరుగుబాటును ఎదుర్కొంటోంది" అని పూనావాలా ఒక వీడియో ప్రకటనలో అన్నారు.

'పదే పదే ఆరోపణలతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు'
ఇక, భారత సంస్థలపై రాహుల్​ పదేపదే ఆరోపణలు చేస్తూ, విదేశాల్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని షెహజాద్​ పూనావాలా ఆరోపించారు. "మీరు ప్రతిపక్ష నాయకుడు. అబద్ధాలు ప్రచారం చేయడం, భయాందోళనలు సృష్టించడం, లాభార్జన చేయడం, ఇదే మీ పద్ధతి. మీరు విదేశాల్లో భారతదేశ ప్రజాస్వామ్య సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అంతర్జాతీయంగా భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేసే ఎజెండాను ఎవరైనా చేపట్టారంటే అది మీరే" అని వ్యాఖ్యానించారు.

అలాగే, ఆర్థిక వ్యవస్థ, కోవిడ్ వ్యాక్సిన్ నుంచి జాతీయ భద్రత వంటి విషయాల వరకు పలు అంశాలపై రాహుల్​ గతంలో అసత్య ప్రకటనలు చేశారని షెహజాద్​ పూనావాలా ఆరోపించారు. "భారత్​ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని రాహుల్​ పదేపదే చెప్పారు. అంతేకాదు, భారత వ్యాక్సిన్‌లకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్‌కు, గాల్వాన్‌లో భారత్​ తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా మీరు భారత సాయుధ దళాల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా గతంలో మిమ్మల్ని మందలించింది. ఇప్పటికైనా ప్రజల్లో భయాందోళన కలిగించే రాజకీయాలను ఆపండి" అని విమర్శించారు.

అసలేం జరిగింది?
బుధవారం ఇందిరా భవన్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో దేశంలో ఆర్థిక సునామీ రాబోతోందని హెచ్చరించారు. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆరంభం మాత్రమేనని, మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం రాబోతోందని, దాన్ని ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిణామాల ప్రభావం నుంచి దేశాన్ని రక్షించే వ్యవస్థలను అధికార బీజేపీ బలహీనపరిచిందని తెలిపారు. అంతేకాదు, ఎన్నికల సంఘం సహా పలు వ్యవస్థల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉన్నట్లు తనకు సమాచారం అందుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకతను అణచివేయటానికి ఎమర్జెన్సీని విధించినా విధించొచ్చునని అన్నారు.

దిల్లీలో హోటల్ అగ్నిప్రమాదం- యజమానిపై హత్య కేసు- మేనేజర్ కోసం గాలింపు

గుడ్ న్యూస్: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు- తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం ఎప్పుడంటే?