రామమందిర విరాళాల దోపిడీకి BJP-RSSలే బాధ్యత వహించాలి: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
రామాలయ విరాళాల చోరీపై మండిపడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే- ఈ దోపిడీకి బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లే బాధ్యత వహించాలని డిమాండ్- రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటుందని మండిపాటు

Published : July 5, 2026 at 7:14 PM IST
Kharge On Ram Temple Donation Issue : అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అధికారాన్ని నిలుపుకోవడానికి ఎస్ఐఆర్, డీలిమిటేషన్‌ను వాడుకుంటూ బీజేపీ సర్కార్ 'ఓట్ చోరీ' చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడమే కాకుండా, ఎన్నికల అవకతవకల ద్వారా ప్రజాస్వామ్య సంస్థలను కూడా బలహీనపరుస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మల్లికార్జున ఖర్గే ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్రంలోని అధికార ఎన్‌డీఏ సర్కార్‌పై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు.
"అయోధ్యలో దేవుడి పేరుతో ఎంత దోపిడీ జరుగుతోందో మీరు చూశారు. అయోధ్యలో ఏం జరిగింది? పేదవాళ్లు విరాళాలను దుర్వినియోగం చేశారా? దళితులు చేశారా? రైతులు చేశారా? ఎవరూ కాదు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలతో సంబంధం ఉన్నవారే ఈ దోపిడీ చేశారు. అయోధ్య రామ మందిరంలో సుమారు రూ. 20,000 కోట్ల విలువైన ఆస్తులను దోచుకున్నారు. రామ మందిరానికి విరాళంగా ఇచ్చిన బంగారం, వెండి, చివరికి ఇటుకలను కూడా దోచుకున్నారు. ప్రతిరోజూ దేవుడి నామం జపిస్తారు. కానీ దేవుడి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. "
-- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
పాలనపై కాకుండా ఎన్నికలపైనే బీజేపీ దృష్టి : ఖర్గే
బంగాల్, మహారాష్ట్ర, హరియాణా, అసోం వంటి రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ 'ఓట్ చోరీ'కి పాల్పడిందని ఖర్గే ఆరోపించారు. అధికారంలో కొనసాగడానికి కమలం పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్ ఓట్లను చోరీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. దేవుడి సంపదను దోచుకుంటున్నాయని విమర్శించారు. ఇటువంటి దుర్వినియోగాన్ని నివారించడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, ఒకే దేశం- ఒకే ఎన్నిక బిల్లు వంటి వాటిని సభ ముందుకు తీసుకురావాలని బీజేపీ చూస్తోందన్నారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఆహార భద్రతా చట్టం వంటి సంక్షేమ చర్యలను ఎన్‌డీఏ సర్కార్ బలహీనపరుస్తోందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం పరిపాలనపై కాకుండా కేవలం ఎన్నికలపైనే దృష్టి సారిస్తోందని ఎద్దేవా చేశారు.
"రాబోయే వర్షాకాల సమావేశాల్లో బీజేపీ డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలనుకుంటోంది. డీలిమిటేషన్ ద్వారా తమకు అనుకూలమైన రీతిలో పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలను మార్చాలనుకుంటోంది. బీజేపీ ఇప్పటికే అసోంలో డీలిమిటేషన్ చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ ఒకసారి దీనిని వ్యతిరేకించి, దానిని ఉపసంహరించుకునేలా బీజేపీని ఒత్తిడి చేసింది. అంబేడ్కర్ ఆధునిక భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు రూపశిల్పి. బాబాసాహెబ్ అంబేడ్కర్ 140 కోట్ల మంది భారతీయుల తలరాతను రాశారు. ఆయన లేకపోయి ఉంటే దళితులకు రాజకీయ హక్కులు, విద్య, ప్రాతినిధ్యం లభించేవి కావు. అంబేడ్కర్ వల్లే ప్రతి భారతీయుడికి ఓటు హక్కు లభించింది. రాజ్యాంగ విలువలు బలహీనపడితే ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం ప్రమాదంలో పడుతుంది. రాజ్యాంగాన్ని ప్రజలు పరిరక్షించాలి. ఏ పేదవాడూ ఆకలితో ఉండకూడదనేది మన లక్ష్యం కావాలి. ప్రజలకు పని, ఆహారం, గౌరవం ఇవ్వాలి. కానీ బీజేపీ కేవలం ఓట్ల గురించే ఆలోచిస్తోంది"
-- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ చీఫ్
విరాళాల చోరీపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు : మాణికం ఠాగూర్
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ ప్రశ్నించారు. రామమందిర విరాళాలకు సంబంధించి ఆర్థిక కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఆలయాలను ఉపయోగించి నిధులు సేకరిస్తున్నాయని విమర్శించారు.
వీహెచ్‌పీది రాజకీయ ప్రేరేపిత లేఖ : ఆప్
రామ మందిరంలో విరాళాల చోరీ గురించి ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను కూడా పరిశీలించాలని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అయోధ్య పోలీసులకు లేఖ రాయడంపై ఆప్ స్పందించింది. ఈ లేఖను రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణించింది. శ్రీరాముడికి సంబంధించిన విషయాల్లో కూడా వివక్ష ఎందుకు? అని ప్రశ్నించింది. ఈ మేరకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
బీజేపీపై ఉద్ధవ్ ఫైర్
అయోధ్య రామ మందిరంలో విరాళాల దుర్వినియోగంపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం 'రామ రక్ష' ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికార బీజేపీయే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దోపిడీకి పాల్పడే హిందువులే అధికారంలో ఉన్నారని కాషాయపార్టీని ఉద్దేశించి ఆరోపించారు. రామాలయ విరాళాల చోరీపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హిందుత్వను దుర్వినియోగం చేసి ఎవరైనా ఆలయాన్ని దోచుకుంటే, హిందువులు వారిని వదిలిపెట్టరని హెచ్చరించారు. "దోపిడీకి పాల్పడే హిందువులు దేశంలో అధికారంలో ఉండటం దురదృష్టకరం. ఒక దొంగను తన దోపిడీ గురించి విచారణ జరపమని అడగలేం. అయోధ్యలో విరాళాల చోరీ ట్రైలర్ మాత్రమే. కాశీ, మధుర ఇంకా చాలా మిగిలే ఉన్నాయి. కాశీ, మధురలో ఏం జరుగుతుందోనని నేను ఆందోళన చెందుతున్నాను. మేము ధైర్యవంతులం. దేశాన్ని ప్రేమించే హిందువులం, కానీ మూర్ఖులం కాదు" అని ఉద్ధవ్ పేర్కొన్నారు.
'విద్యార్థులను ఉగ్రవాదులంటారా? వెంటనే రాజీనామా చేయాల్సిందే'- ధర్మేంద్ర ప్రధాన్‌పై ఖర్గే ఫైర్
జవాబుదారీతనం అనే పరీక్షలో బీజేపీ ఫెయిల్- ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాల్సిందే: ఖర్గే

