ETV Bharat / bharat

'మొరిగే కుక్కలు కరవవు- ముందు మీ పార్టీ పగ్గాలు ఇచ్చి మాట్లాడండి'- ఒవైసీపై బీజేపీ ఫైర్​

బురఖా వేసుకున్న మహిళ ప్రధాని అయితే ఇంట్లో పూజలు కూడా చేసుకోలేమంటున్న బీజేపీ నేతలు- ఒవైసీవి పగటి కలలే అంటున్న కాంగ్రెస్

Nitesh Rane Slams Owaisi Hijab
Nitesh Rane Slams Owaisi Hijab (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 11, 2026 at 9:51 AM IST

3 Min Read
Choose ETV Bharat

Nitesh Rane Slams Owaisi Hijab : "మొరిగే కుక్కలు ఎప్పుడూ కరవవు, బురఖా వేసుకున్న మహిళ ఈ దేశానికి ప్రధాని అయితే, భారత్ ఒక 'ఇస్లామిక్ స్టేట్'గా మారిపోతుంది" అంటూ బీజేపీ సీనియర్ నేత నితేశ్ రాణే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై నిప్పులు చెరిగారు. ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతుందన్న ఒవైసీ వ్యాఖ్యలపై రాణే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒవైసీ వ్యాఖ్యలు దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చే కుట్రలో భాగమేనని, హిందువులను భయపెట్టడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తారు, రాణే హెచ్చరిక
ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ నితేష్ రాణే కీలక ఆరోపణలు చేశారు. "ఒవైసీ మనల్ని బెదిరించాలని చూస్తున్నారు. హిందువులను భయభ్రాంతులకు గురిచేయడమే ఆయన లక్ష్యం. రేపు పొద్దున బురఖా వేసుకున్న మహిళ ప్రధాని అయితే, దేశంలో పరిస్థితి దారుణంగా మారుతుంది. బలవంతపు మత మార్పిడిలు జరుగుతాయి. అందరినీ ఇస్లాంలోకి మారుస్తారు. ఈ హిందూ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తారు. అప్పుడు మనం మన ఇళ్లలో కనీసం పూజలు కూడా చేసుకోలేం. బయటకొచ్చి 'జై శ్రీరామ్' అని గట్టిగా నినదించలేం. 'ఐ లవ్ మహదేవ్' అని బ్యానర్లు కట్టుకోలేం. హిందువుల అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుంది. అందుకే ఒవైసీ కలలను సాగనివ్వకూడదు" అని రాణే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఒవైసీ ఏమన్నారు?
మహారాష్ట్రలోని షోలాపుర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఒవైసీ ప్రసంగించారు. "పాకిస్థాన్ రాజ్యాంగం వేరు, మన బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం వేరు. పాకిస్థాన్‌లో ఒక్క మతానికి చెందిన వారే ప్రధాని కాగలరు. అక్కడ వేరే మతస్థులకు అవకాశం లేదు. కానీ మన భారత రాజ్యాంగం గొప్పది. ఇక్కడ ఎవరైనా ప్రధాని, సీఎం లేదా మేయర్ కావచ్చు. అందుకే ఏదో ఒక రోజు హిజాబ్ కట్టుకున్న మా ఆడబిడ్డ ఈ దేశానికి ప్రధాని అవుతుంది. ఇది నా కల. ఆ రోజు కచ్చితంగా వస్తుంది" అని ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ముందు మీ పార్టీ పగ్గాలు ఇవ్వండి - పూనావాలా
ఒవైసీ వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కౌంటర్ ఇచ్చారు. "ఒవైసీ, రాజ్యాంగం ఎవరినీ అడ్డుకోదు. ఎవరైనా కలలు కనొచ్చు. కానీ ఇతరులకు చెప్పే ముందు, మీరు ఆ పని చేసి చూపించండి. మీ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఒక హిజాబ్ లేదా బురఖా ధరించిన మహిళను నియమించండి. పోనీ ఒక 'పస్మాండా' ముస్లింనైనా ఆ పదవిలో కూర్చోబెట్టండి. మీరేమో మహిళలను అధ్యక్షురాలిని చేయరు, కానీ దేశానికి మాత్రం మహిళా ప్రధాని కావాలా? మీ పార్టీ పేరులోనే 'ముస్లిమీన్' అని పెట్టుకుని, ఇతరులకు లౌకికవాదం గురించి పాఠాలు చెప్పకండి" అని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు.

అసోం సీఎం హిమంత కౌంటర్
ఈ వివాదంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా జోక్యం చేసుకున్నారు. "రాజ్యాంగపరంగా ఎవరైనా ప్రధాని కావచ్చనేది నిజమే. అందులో సందేహం లేదు. కానీ భారత్ ఒక హిందూ దేశం. ఇదొక సనాతన హిందూ నాగరికత. అందుకే భారత ప్రధానమంత్రి ఎప్పుడూ ఒక హిందువే అయి ఉంటారు. భవిష్యత్తులో కూడా హిందువే ఈ దేశాన్ని పాలిస్తారు. దీనిపై మాకు, ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది" అని తేల్చిచెప్పారు.

పగటి కలలు కంటున్నారు - కాంగ్రెస్
కేవలం బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ కూడా ఒవైసీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. "ఒవైసీ పగటిపూట చుక్కలు చూస్తున్నారు. ఆయన అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇది జరిగే పని కాదు. అనవసరంగా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. హిజాబ్ వేసుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కులు ఉంటాయి. కానీ ఇలాంటి ఊహలు అనవసరం" అని కొట్టిపారేశారు.