ETV Bharat / bharat

జవాబుదారీతనం అనే పరీక్షలో బీజేపీ ఫెయిల్​- ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాల్సిందే: ఖర్గే

టెలిగ్రామ్​ను బ్లాక్ చేయడం కాదు- కోట్లాది మంది యువత భవిష్యత్తును బ్లాక్ చేసిన మంత్రిని తొలగించండి- మోదీ ప్రభుత్వంపై ఖర్గే తీవ్ర విమర్శలు

Congress President Mallikarjun Kharge
Congress President Mallikarjun Kharge (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 16, 2026 at 4:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kharge Slams Modi Govt : పేపర్ల లీకేజీ, పరీక్షల అక్రమాలు జరిగినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా చేయకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. సదరు మంత్రిని రాజీనామా చేయమని కోరకపోవడం ద్వారా మోదీ సర్కార్​ జవాబుదారీతనం అనే పరీక్షలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జూన్​ 21న జరగనున్న నీట్​-యూజీ 2026 రీ-ఎగ్జామ్​కు ముందు టెలిగ్రామ్​ మెసేజింగ్ యాప్​పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని కూడా ఆయన ఎక్స్​ వేదికగా తప్పుపట్టారు.

"నీట్ రీ-టెస్ట్ కోసం మోదీ సర్కార్​ టెలిగ్రామ్ యాప్​ను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. కానీ కోట్లాది మంది యువత భవిష్యత్తును బ్లాక్ చేసిన తమ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ని​ రాజీనామాను ప్రధాని మోదీ కోరాలి. దేశంలోని చైతన్యవంతులైన యువత కేవలం ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇది జవాబుదారీతనానికి మొదటి పరీక్షగా మారింది. దురదృష్టవశాత్తు బీజేపీ ఈ పరీక్షలో పూర్తిగా విఫలమైంది."
- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

మాఫియాను రక్షించే ప్రయత్నం!
"భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించడం, టెలిగ్రామ్​ను బ్లాక్ చేయడం లేదా పేపర్ లీక్​ మాఫియాను రక్షించేందుకు చిన్న చేపలను పట్టుకోవడం- ఇవన్నీ మోదీ ప్రభుత్వం చేయాల్సి వస్తోంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో 90 పేపర్ లీక్​లు జరిగాయి. ఈ మోసం, అవినీతి వల్ల 9 కోట్ల మంది యువత నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం తన వైఫల్యాలను ఇంకెంత కాలం కప్పిపుచ్చుకుంటుంది" అని ఖర్గే ప్రశ్నించారు.

యువత ప్రాణాలు పోతున్నాయ్​
పరీక్షల్లో జరిగిన అక్రమాల వల్ల దాదాపు అరడజను మంది యువకులు ప్రాణాలు తీసుకున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. "మోదీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. తమ పిల్లలను రిక్రూట్​మెంట్ పరీక్షలకు సిద్ధం చేసేందుకు భారీగా అప్పులు చేసిన ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. తీరా చూస్తే, ఒకదాని తర్వాత ఒకటిగా నీట్​, ఎస్​ఎస్​సీ, యూజీసీ-నెట్​, సీయూఈటీ, ఇతర పరీక్షల పేపర్లు లీక్​ అవుతున్నాయి" అని ఖర్గే విమర్శించారు. "పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే, సీబీఎస్​ఈ ఫలితాల్లో ఎంత మోసం జరిగిందంటే, ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ ప్రభుత్వ తీరును బట్టబయలు చేశారు. ఇక ఇప్పుడు అత్యంత విశ్వసనీయతకు చిహ్నంగా భావించే యూపీఎస్​సీ పరీక్ష కూడా ఆరోపణల పరిధిలోకి వచ్చింది" అని ఖర్గే ఆరోపించారు.

రాహుల్ గాంధీ విద్యార్థి సదస్సులు
పేపర్ లీకేజీ, పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేసే ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూన్​ 17 నుంచి రాజస్థాన్​లోని కోటా నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థి సదస్సులు నిర్వహించనున్నారు.

ప్రతి ఒక్కరూ విద్యార్థులకు అండగా నిలవాలి: ప్రియాంక గాంధీ
పేపర్ లీకేజ్​, పరీక్షల అక్రమాల వల్ల నష్టపోయిన విద్యార్థులకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తన సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను, ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు.

"ప్రజా బాధ్యత కలిగిన మనమందరం విద్యార్థులకు అండగా నిలబడాలి. వారు ఎలాంటి ఇబ్బందులు, బాధలు అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి పేపరూ లీక్​ అవుతోంది. వారి తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఈ సమస్య ఏదో ఒక చోట, ఒకరికి మాత్రమే జరిగింది కాదు. ఇది తక్షణం పరిష్కరించాల్సిన ఒక లోతైన వ్యవస్థాగత సమస్య. మనం కచ్చితంగా మార్పు తీసుకురావాలి."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు

విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి, పదేపదే జరుగుతున్న పరీక్షల అక్రమాలు, లీకేజీల వల్ల వారి తల్లిదండ్రుల కష్టార్జితం వృథా కాకుండా చూడడానికి పరీక్షల విధానంలో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ నొక్కిచెప్పారు.

ఆధార్​ను కేవలం గుర్తింపు కార్డుగానే ఉపయోగించాలా? కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

మమత వర్గంతో చర్చించాకే- టీఎంసీ రెబల్​ ఎంపీల విలీనంపై స్పీకర్ నిర్ణయం!