ETV Bharat / bharat

మహారాష్ట్రలో వింత రాజకీయం- బీజేపీ, కాంగ్రెస్‌ పొత్తు - నేతలకు సీఎం ​వార్నింగ్

మున్సిపల్ ఎన్నికల్లో జట్టు కట్టిన బీజేపీ, కాంగ్రెస్- పొత్తుపై సీఎం ఆగ్రహం

BJP Congress Alliance
BJP Congress Alliance (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 2:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

BJP Congress Alliance : మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ- కాంగ్రెస్​ కలిసిపోయాయి. అంబర్‌నాథ్‌ ప్రాంతానికి మేయర్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు జట్టుకట్టాయి. ఉపముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే నేతృత్వంలోని శివ​సేనకు అధికారం దక్కకుండా ఉండేందుకు ఈ అరుదైన కూటమి ఏర్పాటయ్యింది. దీంతో పాటు అకోట్​ మున్సిపల్ స్థానం కోసం మజ్లిస్​తోనూ పొత్తు పెట్టుకుంది బీజేపీ. అయితే, బీజేపీ- కాంగ్రెస్​ పొత్తుపై మహారష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

బీజేపీ ఎప్పుడూ కాంగ్రెస్​, ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకోదు. ఇలాంటి కూటములు ఆమోదనీయం కాదు. పార్టీ కూడా దీనిని సహించదు. ఒకవేళ ఏవరైనా స్థానిక బీజేపీ నేతలు అధిష్ఠానం ఆమోదం లేకుండా ఈ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. స్థానిక నాయకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం పార్టీ నిబంధనలను ఉల్లంఘించమే అవుతుంది. వీరిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.

--దేవేంద్ర ఫడణవీస్​, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

బీజేపీ- కాంగ్రెస్​ కూటమిలోని 32 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీకి చెందిన తేజశ్రీ కరంజులే ఇక్కడ మేయర్‌ పదవిని చేజిక్కించుకున్నారు. వీరిలో 16 మంది బీజేపీ, 12 మంది కాంగ్రెస్‌, నలుగురు ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం)కి చెందిన వారు ఉన్నారు. అయితే, మేయర్ పదవి కోసం కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలపడంపై శిందే వర్గానికి చెందిన శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ, ఇప్పుడు పొత్తు పెట్టుకోవడాన్ని శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికార్ ప్రశ్నించారు. ఇది తమకు వెన్నుపోటు పొడవడమేనని విమర్శించారు. అయితే, ఈ విమర్శలను బీజేపీ ఉపాధ్యక్షుడు గులాబ్రావ్‌ కరంజుల్‌ పాటిల్‌ కొట్టిపారేశారు. అంబర్‌నాథ్‌లో శివసేనతో పొత్తుకు తమ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసినా, దానినుంచి సానుకూలమైన స్పందన రాలేదన్నారు. ఈ సందర్భంగా శిందే పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్, మజ్లిస్​తో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న క్రమంలో బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు శివసేన ఉద్ధవ్​ వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్​. బీజేపీని డబుల్​ స్టాండర్డ్స్​ పార్టీగా అభివర్ణించారు. కాంగ్రెస్​ రహిత భారత్​ కావాలని నినాదాలు ఇస్తున్న బీజేపీ తిరిగి వారితోనే ఎన్నికల కోసం పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. వీర్​ సావర్కర్​ సిద్ధాంతంపై నమ్మకం లేని అజిత్ పవార్​ పార్టీ ఎన్​సీపీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకుందని విమర్శించారు.

"బీజేపీ ఒక డబుల్​ స్టాండర్డ్స్​ పార్టీ. వారు మజ్లిస్​తో పాటు కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ రహిత భారత్ కావాలని ప్రధాని మోదీ నినాదాలు ఇస్తున్నారు. కానీ అదే బీజేపీ నేతలు కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి ద్వంద్వ విధానాలు ఉన్న పార్టీని నమ్మకండి. వీర్​ సావర్కర్​ సిద్ధాంతాన్ని నమ్మని అజిత్​ పవార్​ నేతృత్వంలోని ఎన్​సీపీతోను పొత్తు పెట్టుకున్నారు. ఒకవేళ మీకు సావర్కర్​ అంటే ఇష్టం ఉంటే ఎన్​సీపీని కూటమి నుంచి బయటకు పంపండి."

--సంజయ్ రౌత్​, శివసేన ఉద్ధవ్ వర్గం నేత

కాగా, అంతకుముందు పింప్రి- చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో విడిపోయిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), తన బంధువు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు అజిత్ పవార్ అధికారికంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు
కాగా, ముంబయి (బీఎంసీ)తో సహా 29 మున్సిపల్​ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల వివాదం కారణంగా, సుమారు నాలుగేళ్లుగా ఈ ఎన్నికలు పెండింగ్​లో ఉన్నాయి. అయితే, ఇటివలె సుప్రీంకోర్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను 2026 డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. అటు రిజర్వేషన్లు కూడా 50 శాతానికి మించకూడదని స్పష్టం చేయడంతో ఎన్నికలను నిర్వహిస్తున్నారు.

నామినేషన్ల దాఖలు : 2025 డిసెంబర్​ 23 - 30 వరకు

నామినేషన్ల పరిశీలన : 2025 డిసెంబర్​ 31

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : 2026 జనవరి 2

పోలింగ్ తేదీ : 2026 జనవరి 15

కౌంటింగ్​, ఫలితాల ప్రకటన : 2026 జనవరి 16

ముంబయి (బీఎంసీ)లోని 227 వార్డులతో పాటు పుణె (పీఎంసీ)లోని 165 సీట్లకు కూడా ఎలక్షన్స్ జరగనున్నాయి. థానే, నాగ్​పుర్​, నవీ ముంబయి, నాసిక్​, కల్యాణ్​-డోంబివాలి, ఛత్రపతి శంభాజీనగర్​, కొల్హాపుర్​ లాంటి మొత్తం 29 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు​ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం శివసేన రెండు పార్టీలు కలిసిపోయాయి.