ETV Bharat / bharat

ఇకపై మొబైల్ చోరీ అయినా డోంట్ వర్రీ- దొంగ ఫొటో, లొకేషన్ క్షణాల్లో ప్రత్యక్షం- 65ఏళ్ల తాత అద్భుత ఆవిష్కరణ!

గెట్ యువర్ లాస్ట్ ఫోన్ యాప్ రూపొందించిన రవి నందన్- చోరీకి గురైతే ముందుగా ఇచ్చిన నంబర్, ఇ-మెయిల్‌కు ఫొటో, లొకేషన్ సమాచారం- యూట్యూబ్, ఏఐ, క్లౌడ్ టూల్స్ సాయంతో యాప్ సృష్టి

Get Your Lost Phone App
రవి నందన్ క్రియేట్ చేసిన యాప్ (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 26, 2026 at 6:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

Get Your Lost Phone App : చేతిలో ఫోన్ లేకపోతే క్షణం తోచని రోజులివి. రోజంతా మనతోనే ఉండే ఆ స్మార్ట్‌ఫోన్ పొరపాటున పోయినా, లేదా దొంగల చేతికి చిక్కినా పడే వేదన అంతా ఇంతా కాదు. బ్యాంకింగ్ వివరాల దగ్గర్నుంచి మొదలుకొని పర్సనల్ ఫొటోలు, వీడియోలు, ఇతర ముఖ్యమైన సమాచారం, విలువైన డాక్యుమెంట్లు దొంగల చేతికి చిక్కుతాయేమోనన్న భయం ప్రశాంతత లేకుండా చేస్తుంది. సరిగ్గా ఇలాంటి తీవ్రమైన సమస్యకే బిహార్ రాజధాని పట్నాకు చెందిన 65 ఏళ్ల రవి నందన్ సహాయ్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు.

తన వయస్సును, సాంకేతిక సవాళ్లను పక్కనపెట్టి ఆయన తయారు చేసిన గెట్ యువర్ లాస్ట్ ఫోన్ (Get Your Lost Phone) యాప్ ఇప్పుడు దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఫోన్ దొంగిలించిన వ్యక్తి ముఖాన్ని ఫొటో తీయడమే కాకుండా, ఆ దొంగ ఎక్కడున్నారో కచ్చితమైన లొకేషన్‌ను కూడా ఫోన్ ఓనర్‌కు పంపడం ఈ యాప్ ప్రత్యేకత. రవి నందన్ రూపొందించిన ఈ యాప్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా పకడ్బందీగా, వినూత్నంగా పనిచేస్తుంది.

యాప్ ఎలా పనిచేస్తుందంటే?
రని నందన్ సహాయ్ ప్రకారం- ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, మనకు నమ్మకమైన రెండు ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్లు, ఒక ఇ- మెయిల్ ఐడీని నమోదు చేయాలి. మొబైల్‌కు ఒక సెక్యూరిటీ పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఫోన్ దొంగతనానికి గురైతే, దొంగ ఆ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి తప్పుడు పాస్‌వర్డ్ టైప్ చేయగానే, యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రహస్యంగా యాక్టివేట్ అవుతుంది. దొంగకు తెలియకుండానే ఫ్రంట్ కెమెరా ద్వారా అతని ముఖాన్ని ఫొటో తీసి, జీపీఎస్ సహాయంతో కచ్చితమైన లైవ్ లొకేషన్‌ను గుర్తిస్తుంది. ఆ ఫొటో, లొకేషన్ లింక్‌ను ముందే రిజిస్టర్ చేసుకున్న ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్, ఇ మెయిల్‌కు అలర్ట్‌గా పంపుతుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే దొంగ ముఖంతో పాటు, ఫోన్ ఉన్న స్థలానికి 20 మీటర్ల పరిధిలోకి నేరుగా చేరుకోవచ్చు. దీంతో ఫోన్ ఎక్కడుందో లైవ్‌ ట్రాక్ చేసి పట్టుకోవచ్చు. ఇది పోలీసులకు కూడా ఫోన్ రికవరీ చేయడంలో ఎంతో సహాయపడుతుంది.

APP Logo In Google Play Store
యాప్ లోగో (Source : ETV Bharat)

యూట్యూబ్ చూసి, సొంతంగా నేర్చుకొని!
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రవి నందన్ సహాయ్‌కు ఎలాంటి కంప్యూటర్ లేదా సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఆయన మేథమేటిక్స్‌లో డిగ్రీ, స్టాటిస్టిక్స్‌లో MSC పూర్తి చేసి, ప్రస్తుతం ఆన్‌లైన్ ట్రాన్స్‌లేటర్ పనిచేస్తున్నారు. ఆయన పిల్లలిద్దరూ కంప్యూటర్ ఇంజినీర్లే అయినప్పటికీ, వారి ఉద్యోగ పనుల వల్ల సమయం కేటాయించలేకపోయారని, దీంతో తానే యాప్ తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. తొలుత ఏఐ సాయంతో ప్రయత్నించానని, అది సఫలం కాకపోవడంతో క్లౌడ్ ఆధారిత టూల్స్‌తో యాప్ డెవలప్ చేయడం ప్రారంభించినట్ల తెలిపారు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ సొంతంగా కోడింగ్, క్లౌడ్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకున్నట్లు పేర్కొన్నారు. చివరకు సుమారు 3 నుంచి 4 నెలల పాటు రాత్రింబవళ్లు శ్రమించి ఈ గెట్ యువర్ లాస్ట్ ఫోన్ యాప్‌ను డిజైన్ చేశారు.

Ravi Nandan Sahay
ఈటీవీ భారత్​తో రవి నందన్ సహాయ్ (Source : ETV Bharat)

మార్కెట్లోని ఇతర యాప్స్ కంటే ఇదెలా ప్రత్యేకం?
ప్రస్తుతం ఉన్న చాలా యాప్స్ కేవలం లొకేషన్ మాత్రమే చూపుతాయని.. కానీ తన యాప్ దొంగ ముఖ చిత్రాన్ని కూడా స్పష్టంగా చూయిస్తుందని రవి నందన్ చెబుతున్నారు. విదేశీ కంపెనీల సెక్యూరిటీ యాప్స్ ఏడాదికి రూ. 2 వేల వరకు వసూలు చేస్తుంటే, రవి నందన్ ఈ సేవను సామాన్యులకు అందుబాటులో ఉండేలా, వార్షిక రుసుమును రూ. 500 గా నిర్ణయించారు. గూగుల్ ప్లే స్టోర్ నిబంధనల ప్రకారం 25 డాలర్ల ఎంట్రీ ఫీజు చెల్లించి, వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకొని యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెబుతున్నారు. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, కష్టపడే మనస్తత్వం, సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన ఉంటే ఏదైనా సాధించొచ్చని 65 ఏళ్ల రవి నందన్ సహాయ్ నిరూపించారు.

'యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మందులతో సొంతంగా వైద్యం చేసుకోవద్దు'- స్వైన్ ఫ్లూ వ్యాప్తిపై IMA కీలక సూచన

గణేశుడి కోసం 3.5అడుగుల భారీ రాఖీ- గత 24 ఏళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఫ్యామిలీ!