ఒకే అభ్యర్థి, ఒకటే స్థానం- రెండు పార్టీ గుర్తులపై నామినేషన్- ఎందుకో తెలుసా?
బిహార్ ఎన్నికల్లో వింత నామినేషన్- ఒకే అభ్యర్థి రెండు పార్టీ గుర్తులపై నామినేషన్

Published : October 18, 2025 at 4:48 PM IST
Same Candidate Nomination In Two Party : సాధారణంగా ఎన్నికల్లో ఒకే అభ్యర్థి రెండు, మూడు స్థానాల్లో పోటీ చేసిన సందర్భాలు చాలా చూశాం. ఒక చోట కాకపోయినా మరో స్థానంలో అయినా గెలువచ్చనే ఉద్దేశంతో చాలా మంది ఇలా చేస్తుంటారు. అయితే బిహార్‌లో ఓ అభ్యర్థి ఒకే నియోజవర్గం నుంచి రెండు గుర్తులు మీద నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ నామినేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిదంటే?
మథేపురాలోని ఆలమ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. నబీన్ కుమార్ అనే వ్యక్తి మొదట రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే సీట్ల సర్దుబాటులో ఆ స్థానం వీఐపీ(వికాస్‌సీల్ ఇన్సాన్ పార్టీ)కి కేటాయించారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత నబీన్ కుమార్ మళ్లీ వీఐపీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే నియోజకవర్గం నుంచి ఒకే అభ్యర్థి రెండు పార్టీల తరఫున పోటీ చేశారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన నబీన్ కుమార్ ఆర్జేడీ నుంచి చేసిన తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అయితే తాను పార్టీ ఆదేశాలను పాటించినట్లు పేర్కొన్నారు. అందుకే రెండుసార్లు నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇకపై కూడా పార్టీ ఇచ్చే సూచనల ప్రకారమే వ్యవహరిస్తాని అన్నారు.

స్థానిక సమస్యల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక జరిగిందని వీఐపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మదేవ్ సాహ్ని తెలిపారు. తమ పార్టీ ఎప్పుడూ స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి పనిచేస్తుందని అన్నారు. ఆలమనగర్ అభ్యర్థి ఎంపిక కూడా స్థానిక ప్రజాదరణ, సమస్యల అవగాహన ఆధారంగానే జరిగిందని అన్నారు. నబీన్ కుమార్ ఒక ఇంజనీర్, ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉందని చెప్పారు. ఆలమనరగ్లో గత మూడు దశాబ్దాలుగా ఉన్న నరేంద్ర నారాయణ్ యాదవ్‌ను కూడా 2020 ఎన్నికల్లో నబీన్ కుమార్ ఓడించారని చెప్పారు.
బిహార్ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. తొలివిడతలో భాగంగా 121 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి నామినేషన్ స్వీకరణ తేదీ అక్టోబర్ 17కే ముగిసింది. బిహార్‌లో పాగా వేయాలని కసితో ఉంది 'మహాఘట్ బంధన్'. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తికాలేదు. గురువారం రాత్రి పొద్దుపోయాక 48 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. అయితే కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితా మాత్రం ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షాలైన బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఎల్‌జేపీకి 29, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్ఎం)లకు చెరో 6 సీట్లను ఇచ్చారు. జేడీయూ ప్రకటించిన 101 స్థానాల్లో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడినవారికి 59 సీట్లు కేటాయించింది. మంత్రుల్లో దాదాపు అందరికీ టికెట్లు లభించాయి. ఓడిపోయిన ముగ్గురు ఎంపీలకూ టికెట్లు ఇచ్చారు. మహిళలకు 13 చోట్లే అవకాశం లభించింది.

