ETV Bharat / bharat

మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్​డీఏ- బిహార్​లో అధికార కూటమి హవా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​- ఇప్పటికే మెజారిటీ మార్క్ దాటేసిన ఎన్​డీఏ కూటమి

NDA Crosses Majority Mark In Bihar
NDA Crosses Majority Mark In Bihar (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : November 14, 2025 at 10:44 AM IST

3 Min Read
Choose ETV Bharat

NDA Crosses Majority Mark In Bihar : బిహార్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే అధికార ఎన్​డీఏ ఆధిక్యంలో కొనసాగుతోంది. సాధారణ మెజారిటీ 122 కన్నా ఎక్కువ స్థానాల్లో ఎన్​డీఏ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో తారాపూర్ బీజేపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ ముందంజలో ఉన్నారు. అలీగఢ్​లో సింగర్ మైథిలి ఠాకూర్ మళ్లీ లీడ్​లోకి వచ్చారు. మిగిలిన బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో శ్రేయాసీ సింహ్ దూసుకెళుతుండగా, రామ్ కృపాల్ యాదవ్, విజయ్ కుమార్ వంటివారు వెనుకబడ్డారు. ఆర్​జేడీ స్టార్ అభ్యర్థుల్లో ఒసామా షహాబ్, శతృగన్‌ యాదవ్​లు ఆధిక్యంలో ఉన్నారు. లాలూ కుమారుల్లో ఆర్​జేడీ నేత, మహాగఠ్​బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్ రాఘోపూర్​లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా, జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం మహువాలో వెనుకబడ్డారు. ఇటీవల అరెస్టై జైలులో ఉన్న మొకామా నియోజక వర్గం జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. జన్ సురాజ్ అభ్యర్థి త్రిపురారీ కుమార్, సీపీఎం అభ్యర్థి దివ్యా గౌతమ్, ఆర్​జేడీ అభ్యర్థి వీణాదేవి వెనుకంజలో ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులు నెమ్మదిగా నెట్టుకొస్తున్నారు.

ఏకంగా 153 స్థానాల్లో ఆధిక్యం

  • ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఎన్​డీఏ ఏకంగా 195 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాగఠ్​బంధన్ కేవలం 42 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 243 స్థానాలు కలిగిన బిహార్​ అసెంబ్లీలో అధికార కూటమి స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతోంది.
  • పార్టీల వారీగా చూస్తే, ఎన్​డీఏ కూటమిలోని జేడీయూ 78 స్థానాల్లో, బీజేపీ 89 స్థానాల్లో, ఎల్​జేపీ (రామ్ విలాస్​) 21 స్థానాల్లో, హెచ్​ఏఎం (ఎస్​) 4 స్థానా్లలో, ఆర్​ఎల్ఎం 3 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి.
  • మహాగఠ్​బంధన్​లో ఆర్​జేడీ 32 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, సీపీఐ 0 స్థానంలో, సీపీఐ(ఎం) 1 స్థానంలో, సీపీఐ(ఎంఎల్) 5 స్థానాల్లో, ఐఐపీ 0 స్థానంలో ముందంజలో ఉన్నాయి.
  • మరోవైపు ప్రశాంత్ కిశోర్​కు చెందిన జన్​ సురాజ్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ వెనుకబడ్డారు.
  • ప్రస్తుతం ఏఐఎంఐఎం 5 స్థానాలు, బీఎస్​పీ ఒక స్థానంలో అధిక్యంలో ఉన్నాయి.

విజయంపై ఎవరు ఏమంటున్నారంటే?
ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇలా ఉంటే, ఎన్​డీఏ, మహాగఠ్​బంధన్ కూటమి నేతలు మాత్రం విజయం మాది అంటే మాదే అంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, నీతీశ్​ కుమార్​ల అభివృద్ధి పాలనపై బిహార్ ప్రజలు విశ్వాసం చూపించారని ఎన్​డీఏ నేతలు అంటున్నారు. కాగా ఈసారి ప్రజలు మార్పునకు ఓటు వస్తారని తేజస్వి యాదవ్​ ప్రభుత్వం ఏర్పడుతుందని మహాగఠ్​బంధన్ కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భద్రత కట్టుదిట్టం
ఎన్నికల కమిషన్ నియమించిన 243 మంది రిటర్నింగ్ అధికారులు, 243 మంది కౌంటింగ్ పరిశీలకులు ప్రస్తుతం బిహార్​లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఆయా పార్టీల అభ్యర్థులు నియమించిన 18,000 మందికిపైగా కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్నారు. చెల్లుబాటు అయ్యే పాసులు ఉన్నవారికి మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. కాగా అక్కడ మొబైల్ ఫోన్​ల వాడకం పూర్తిగా నిషేధించారు.

బిహార్​లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడంచెల భద్రత, పరిసరాల్లో సీసీటీవీల పర్యవేక్షణల మధ్య అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్ట్రాంగ్ రూమ్​ల్లోనే కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ అబ్జర్వర్స్​తో పాటు అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ప్రక్రియ మెుత్తాన్ని రికార్డు చేస్తున్నారు. బిహార్​లో మెుత్తం 243 స్థానాలుండగా ఈనెల 6, 11వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈసారి బిహార్​లో రికార్డు స్థాయిలో 67.13 పోలింగ్ నమోదైంది.