Telangana Panchayat Elections Results2025

ETV Bharat / bharat

బడా పార్టీలు తూచ్- మరోసారి 5 సీట్లు గెల్చిన ‘మజ్లిస్’- సీమాంచల్‌లో ఎగిరిన ‘పతంగి’

బిహార్ అసెంబ్లీలో మజ్లిస్ తన పట్టు నిలుపుకుంది. సీమాంచల్ ప్రాంతంలో హవా కొనసాగించింది.

AIMIM In Bihar Election 2025
AIMIM In Bihar Election 2025 (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 14, 2025 at 6:41 PM IST

4 Min Read
Choose ETV Bharat

AIMIM In Bihar Election 2025 : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బడా పార్టీలు చావుదెబ్బ తిన్నాయి. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆర్‌జేడీ, కాంగ్రెస్ చతికిలపడ్డాయి. 143 స్థానాల్లో పోటీచేసిన ఆర్‌జేడీ 27 సీట్లకు, 61 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 5 సీట్లకు పరిమితమయ్యాయి. ఇక ఇదే సమయంలో ముస్లిం మెజార్టీ ‘సీమాంచల్’ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ సత్తా చాటుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన 5 స్థానాల్లో, ఈసారి కూడా అసదుద్దీన్ ఒవైసీ ‘పతంగి’ రివ్వున ఎగిరింది. ముస్లిం ఓటుబ్యాంకు రేసులో ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లను మజ్లిస్ దాటేసింది. జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు సరిసమాన స్థాయిలో 5 సీట్లను గెల్చుకొని ఔరా అనిపించింది.

వరుసగా రెండోసారి ఆ ఐదు స్థానాల్లో విజయం

47 శాతం ముస్లిం జనాభా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ హవా కొనసాగింది. అమౌర్, బహదూర్‌గంజ్, బైసి, జోకిహాట్, కొచధమాన్‌ సీట్లను వరుసగా రెండోసారి ఆ పార్టీ కైవసం చేసుకుంది. అమౌర్ స్థానంలో 38,928 ఓట్ల తేడాతో అఖ్తరుల్ ఇమాన్ గెలిచారు. కొచధమాన్‌ స్థానంలో 23,021 ఓట్ల తేడాతో మహ్మద్ సర్వర్ ఆలం విజయం సాధించారు. జోకిహాట్ స్థానంలో మహ్మద్ ముర్షిద్ ఆలం, బహదూర్‌గంజ్ స్థానంలో మహ్మద్ తౌసిఫ్ ఆలం, బైసి స్థానంలో గులాం సర్వర్ గెలుపొందారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఐదు స్థానాల్లో మజ్లిస్ పార్టీయే గెలిచింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత నలుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఆర్‌జేడీ‌లోకి జంప్ అయ్యారు. అయినప్పటికీ వరుసగా రెండోసారి ఆ స్థానాలను మజ్లిస్ పార్టీ నిలుపుకోవడం విశేషం. ఈ సీట్లలో ఒవైసీకి పెరుగుతున్న పట్టుకు తాజా ఫలితం నిలువెత్తు నిదర్శనం. ఈ వరుస విజయాలను పునాదిగా చేసుకొని రాబోయే రోజుల్లో సీమాంచల్‌లోని అరారియా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్ణియా జిల్లాలపై పట్టు బిగించేందుకు మజ్లిస్ వ్యూహ రచన చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లకు ఒవైసీ షాక్

ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ, స్వామి ప్రసాద్ మౌర్యకు చెందిన అప్ని జనతా పార్టీలతో మజ్లిస్ జట్టు కట్టింది. ఈ మూడు పార్టీలతో కూడిన కూటమి తరఫున రాష్ట్రంలోని 35 సీట్లలో మజ్లిస్ పార్టీ పోటీచేసింది. ఇందులోని 24 స్థానాలు సీమాంచల్‌‌లోనివే. ముస్లిం ప్రాబల్యం కలిగిన ఆ ప్రాంతంపై అసదుద్దీన్ ఒవైసీ సీరియస్‌ ఫోకస్‌కు ఈ రాజకీయ సమీకరణాలే సాక్ష్యాలు. ముస్లింలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలను కల్పించడం, ముస్లింల వాణిని అసెంబ్లీలో వినిపించే నేతలను తీర్చిదిద్దడం, ముస్లింల సంక్షేమానికి పాటుపడే నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలతో సీమాంచల్‌లో ఒవైసీ ప్రచారం చేశారు. ఈ అంశాలను జనం ఆదరించినందు వల్లే మజ్లిస్‌కు మళ్లీ 5 అసెంబ్లీ స్థానాలు చేజిక్కాయి. ఈ ఫలితాలు ముస్లిం ఓటుబ్యాంకుపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లకు పెద్ద షాక్ లాంటివి.

ఎంట్రీ ఇవ్వని ‘మహా కూటమి’.. సత్తా చాటిన మజ్లిస్

వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో విపక్ష మహా కూటమితో కలిసి పోటీచేయాలని మజ్లిస్ పార్టీ భావించింది. ఈమేరకు ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు మహా కూటమిలోని అన్ని మిత్రపక్షాల అగ్ర నేతలకు మజ్లిస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ లేఖలు రాశారు. తమ పార్టీకి 6 సీట్లు ఇస్తే చాలని, మహా కూటమితో కలిసి పనిచేస్తామని ఆయన కోరారు. అయితే ‘బీజేపీ బీ టీమ్’ అనే ముద్రవేసి, మజ్లిస్‌ను మహా కూటమిలోకి తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో అఖ్తరుల్ ఇమాన్ నేతృత్వంలో మజ్లిస్ కార్యకర్తలు, నాయకులు లాలూ ప్రసాద్ నివాసం వెలుపల నిరసన తెలిపారు. చివరకు సీమాంచల్‌ సహా బిహార్‌లోని అనేక ముస్లిం ప్రాబల్య అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను మజ్లిస్ బరిలోకి దింపింది. కట్ చేస్తే, ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌‌తో సరిసమానంగా 5 సీట్లను మజ్లిస్ సాధించింది. మిగతా స్థానాల్లోనూ ముస్లింల ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్, ఆర్‌జేడీ అభ్యర్థుల విజయ అవకాశాలను తగ్గించింది.

మజ్లిస్ విజయానికి ముఖ్య కారణాలివీ

‘‘సీమాంచల్‌లో మజ్లిస్ పార్టీ వరుస విజయాల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొదటి అతి ముఖ్యమైన కారణం అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం పరంగా సీమాంచల్ వెనుకబడి ఉండటం. ఒవైసీ దూకుడు, వాక్చాతుర్యం, ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం బలమైన వైఖరి అనేవి మజ్లిస్‌కు కలిసొచ్చాయి. ఈ ప్రాంతపు ముస్లింల అంచనాలను ఆర్‌జేడీ, కాంగ్రెస్ అందుకోలేకపోయాయి. వారి అవసరాలను తీర్చలేకపోయాయి. వాటి నిర్లక్ష్యపూరిత వైఖరిని మజ్లిస్ పార్టీ బలంగా ముస్లిం ఓటర్లలోకి తీసుకెళ్లింది. సీమాంచల్ ముస్లింల సాధికారత, ఆత్మగౌరవ రాజకీయాలను ఆ పార్టీ సమర్థించింది. తద్వారా 5 స్థానాల్లో విజయాన్ని అందుకుంది’’ అని సీనియర్ జర్నలిస్ట్ రవి ఉపాధ్యాయ విశ్లేషించారు.

ఇది ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లకు హెచ్చరిక సంకేతం

‘‘దాదాపు 35 ఏళ్ల పాటు బిహార్ రాజకీయాల్లో ముస్లిం ఓట్లు ఆర్‌జేడీ పార్టీకే పడ్డాయి. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 5 స్థానాల్లో గెలిచి బలమైన ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు 2025 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవే 5 సీట్లను మజ్లిస్ కైవసం చేసుకుంది. ముస్లిం ఓటర్లు ఒవైసీ వైపు నిలుస్తున్న తీరుకు ఈ ఫలితాలు నిదర్శనం. ఇది ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లకు ఒక హెచ్చరిక సంకేతం. రాబోయే కాలంలో బిహార్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దాదాపు 40కిపైగా సీట్లలోనూ ప్రభావవంతమైన శక్తిగా మజ్లిస్ ఎదిగే అవకాశాలు ఉన్నాయి’’ అని సీనియర్ జర్నలిస్ట్ అమర్‌నాథ్ ఆనంద్ విశ్లేషించారు.

మహాకూటమి ఘోర ఓటమి- పరాజయానికి అసలు కారణాలు ఇవేనా?

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు- బీజేపీ, కాంగ్రెస్​ పరిస్థితి ఎలా ఉందంటే?