మహాఘట్బంధన్లో అంతర్గత కుమ్ములాటలు- అందుకే సీట్ల సర్దుబాటు కాలేదు : బీజేపీ చీఫ్
బిహార్ ప్రజలు ఎన్డీఏ పక్షాన నిలిచారని వ్యాఖ్య

Published : October 16, 2025 at 4:33 PM IST
Bihar Election 2025 : బిహార్‌లో ప్రతిపక్ష కూటమి మహాఘట్‌బంధన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైశ్వాల్. వారి కూటమిలో అంతర్గత కుమ్ములాటలు తలెత్తినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ సమస్యలు మరింతగా ముదిరి కూటమిని బలహీనం చేస్తాయని జోస్యం చెప్పారు. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) అధినేత ముఖేశ్ సాహ్నీకి మద్దతుగా నిలిచారు దిలీప్ జైశ్వాల్. ప్రతిపక్ష కూటమిలో ఆయనకు సరైన గౌరవం దక్కడం లేదని ఆరోపించారు.
"మహాఘట్బంధన్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇది వారి చాలా సహజమైన విషయం. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది. అందుకే ఓటర్లు ఎన్డీఏకు మద్దుతుగా నిలుస్తున్నారు. ముఖేస్ సాహ్నీకి ప్రతిపక్ష కూటమిలో అన్యాయం జరుగుతుంది. ఆయన ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎంతో గౌరవం దక్కింది. ఒకవేళ ముఖేస్ సాహ్నీని కాంగ్రెస్, ఆర్జేడీ ఇలానే అగౌరవపరిస్తే అది వారికే తిరిగి నష్టం కలుగుతుంది. ప్రతిపక్ష కూటమి మహాఘట్బంధన్కు సంబంధించిన అనేక మాధ్యమాల్లో ముఖేశ్ సాహ్నీని కించపరిచేలా ప్రచారం చేస్తున్నారు."
--దిలీప్ జైశ్వాల్, బిహార్ బీజేపీ అధ్యక్షుడు
కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు దిలీప్. సీట్ల సర్దుబాటుపై ప్రతిపక్ష కూటమిలో వివాదం నెలకొందని, అందుకే ఇంకా ఎలాంటి ప్రకటన చేయలదేని అభిప్రాయపడ్డారు. బిహార్ ప్రజల నమ్మకం ఎన్డీఏ పక్షానే ఉందని చెప్పారు. "బీజేపీ పోటీ చేయబోయే 101 స్థానాల్లో అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాం. సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థులను అందరికంటే ముందుగా ఎన్డీఏ ప్రకటించింది. కానీ మహాఘట్బంధన్లో ఇంకా గొడవలు జరుగుతున్నాయి. అందుకే సీట్ల సర్దుబాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఈ విషయం ప్రజలకు కూడా అర్థమైంది. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్ర పరిస్థితి ఏంటి? అందుకే ప్రజలు ఎన్డీఏ పక్షాన నిలిచారు." అని దిలీప్ అన్నారు.
బిహార్‌లో 243 నియోజకవర్గాలు ఉండగా, ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే సీట్ల పంపకం పూర్తైంది. దీని ప్రకారం బీజేపీ- 101 స్థానాలు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)- 101 సీట్లు కేటాయించారు. ఇక కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)- 29 సీట్లు, కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)- 6 సీట్లు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)- 6 సీట్లలో పోటీ చేయనున్నాయి.
కాగా, ఇప్పటికే బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ వెల్లడించింది. మంగళవారం 71 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ, ఆ తర్వాత రెండు దశల్లో మిగిలిన వారిని ప్రకటించింది. అటు జేడీయూ సైతం రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన తొలి జాబితాలో 57 మందికి చోటు కల్పించిన జేడీయూ, తాజా లిస్టులో మరో 44 మంది పేర్లను ప్రకటించింది. అయితే, తొలి జాబితాలో చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్‌జన్ శక్తి కోరుకున్న ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ, తుది జాబితాలోనూ ఆ పార్టీ కావాలనుకున్న మరో నాలుగు నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఖరారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 243 నియోజకవర్గాలున్న బిహార్‌లో ఎన్డీయే తమకు కేటాయించిన మొత్తం 101 సీట్లకు సీఎం నీతీశ్ కుమార్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 37 మంది ఓబీసీ, 22 మంది ఈబీసీ, జనరల్ కేటగిరీ నుంచి 22 మంది, 15 మంది ఎస్సీ, ఒక ఎస్టీ, నలుగురు ముస్లీం అభ్యర్థులకు తమ జాబితాల్లో చోటు కల్పించింది.

