2000ఏళ్ల నాటి 'సోనా మోతీ' గోధుమ సాగు- క్వింటాల్ ధర రూ.12,000- యువ రైతులకు లాభాలపంట!
పురాతన గోధుమ రకం సాగులో దూసుకెళ్తున్న యువ రైతు- తక్కువ విస్తీర్ణంతో తొలుత వ్యవసాయం ప్రారంభం- మంచి దిగుబడి, ఆదాయం రావడంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు

Published : August 26, 2026 at 9:59 PM IST
Sona Moti Wheat Farming In MP : 2వేల సంవత్సరాల క్రితం నాటి 'సోనా మోతీ' రకం గోధుమను సాగు చేసి మంచి రాబడి పొందుతున్నారు ఓ యువ రైతు. క్వింటాల్ గోధుమలను రూ.12,000 వేలకు అమ్ముతున్నారు. పురాతన ఈ గోధుమ రకాన్ని తన పొలంలో పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ యువ అన్నదాత ఎవరు? ఆయన పండించిన గోధుమలు అంత రేటు ఉండడానికి కారణాలు ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం పదండి.
గుండ్రంగా, బంగారు వర్ణంలో గోధుమలు
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన అర్జున్ ప్రధాన్ అనే యువ రైతు దేశీయ 'సోనా మోతీ' గోధుమ రకాన్ని సాగు చేస్తున్నారు. సాధారణ గోధుమల కంటే చాలా ఎక్కువ ధర పలికే సోనా మోతీ గోధుమలను తన పొలంలో పండిస్తున్నారు. ఈ క్రమంలో తన పంటను విక్రయించేందుకు ఓ స్టార్టప్‌ను సైతం ప్రారంభించారు. ఈ పురాతన గోధుమ రకం చిన్నగా, గుండ్రంగా, బంగారు వర్ణంలో ఉంటుంది. నేడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వినియోగదారులు ఈ గోధుమను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే దీని ధర చాలా ఎక్కువ.

ఆదర్శ రైతు ఏమన్నారంటే?
తాను సామ్రాట్ విక్రమాదిత్య యూనివర్సిటీలో బీఎస్‌సీ (అగ్రికల్చర్) చదువుతూనే సోనా మోతీ రకం గోధుమ సాగును ప్రారంభించానని యువ రైతు అర్జున్ ప్రధాన్ తెలిపారు. రెండేళ్ల క్రితం కేవలం ఒక బిఘా (సుమారు 63 సెంట్లు) భూమిలో సోనా మోతీ సాగును మొదలుపెట్టినట్లు చెప్పారు. ఈ సంప్రదాయ గోధుమ రకం సాగు సవాల్‌తో కూడుకున్న పనని వెల్లడించారు. అయితే సోనా మోతీ రకం గోధుమలకు డిమాండ్ క్రమంగా పెరగడంతో సాగు విస్తీర్ణం పెంచామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పన్నెండున్నర ఎకరాల్లో గోధమను పండిస్తున్నామని వెల్లడించారు.
ప్రాసెస్ చేసిన గోధుమలు, విత్తనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామని అర్జున్ సహచర రైతు, పార్ట్‌నర్ శంభు చెప్పారు. ఈ పంటలో అత్యంత ముఖ్యమైన అంశం కేవలం దాని దిగుబడి మాత్రమే కాదని, దానికున్న అధిక మార్కెట్ విలువని అన్నారు. సాధారణ గోధుమలు ఎక్కువగా మండి (టోకు మార్కెట్) వ్యవస్థ ద్వారా అమ్ముడవుతున్నాయని వివరించారు. అయితే సోనా మోతీ గోధుమలు నేరుగా వినియోగదారులకు, సహజ వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారికి చేరువవుతున్నాయని స్పష్టం చేశారు.

"సోనా మోతీ రకం గోధుమలు క్వింటాల్‌కు సుమారు రూ.12,000 (అంటే కిలోకు రూ.120) చొప్పున పలుకుతున్నాయి. దీనికి భిన్నంగా మార్కెట్‌లో ఇదే పేరుతో అమ్ముడవుతున్న ప్యాక్ చేసిన బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఒక ఆన్‌లైన్ విక్రేత సోనా మోతీ గోధుమలను 2 కిలోల ప్యాక్‌కు రూ.399, 10 కిలోల ప్యాక్‌కు రూ.1,949 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే కిలో సుమారు రూ.195-రూ.200 వరకు పడుతుంది. " అని రైతులు అర్జున్, శంభు వెల్లడించారు.
'ఈ రకం గోధుమకు ఫుల్ డిమాండ్'
"సోనా మోతీ రకం గోధుమలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే రైతు కేవలం పంటను మాత్రమే అమ్మడం లేదు. వారు ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టిస్తున్నారు. సాధారణ గోధుమల విషయంలో రైతులు ఉత్పత్తి, మండి ధరలపై ఆధారపడతారు. కానీ సోనా మోతీ వంటి సంప్రదాయ గోధుమల విషయంలో కొనుగోలుదారులకే అధిక ఆసక్తి ఉంటుంది. ఈ గోధుమల్లో ఉన్న పోషక విలువల గురించిన తెలిసినవారు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు." అని కిరాణా వ్యాపారి వివేక్ అగర్వాల్ పేర్కొన్నారు.

లీడ్స్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం
సోనా మోతీ దాదాపు 2,000 ఏళ్ల క్రితం నాటి సంప్రదాయ గోధుమ రకం. ఈ గోధుమలను 'షుగర్ ఫ్రీ గోధుమ'గా పరిగణిస్తారు. వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందని లీడ్స్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలింది. పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని వెల్లడైంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ గోధుమలు మెరుగైన ఆహార ఎంపిక కాగలదని గుర్తించింది. అదే సమయంలో సోనా మోతీ గోధుమల్లో ప్రోటీన్, ఖనిజ లవణాలు, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.
గణేశుడి కోసం 3.5అడుగుల భారీ రాఖీ- గత 24 ఏళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఫ్యామిలీ!

