ఎకో ఫ్రెండ్లీ 'నెట్ హౌస్'- అకాలవర్షాలు, కీటకాల సమస్యలకు చెక్- రైతులకు స్థిర ఆదాయం
65 శాతం సబ్సీడిని అందిస్తున్న ప్రభుత్వం - 55 యూనిట్ల నర్సరీలు, నెట్‌హౌస్‌లు ఏర్పాటు - అధిక నాణ్యతగల ఉత్పత్తులు - పర్యావరణహితంగా నెట్‌హౌస్‌లు

Published : February 8, 2026 at 11:26 AM IST
Usage Of Nethouses In Agriculture: కాలానుగుణంగా వ్యవసాయంలో కూడా అనేక కొత్త మార్పులు వచ్చాయి. అధునాతన టెక్నాలజీతో కొన్ని కంపెనీలు రైతులు కోసం నూతన పరికరాలు తయారు చేస్తున్నారు. అయితే ఎన్ని మార్పులు, ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ రైతులకు ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా ఇంకా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు, కీటకాలు వంటి సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎకో ఫ్రెండ్లీ నెట్‌హౌస్ పద్దతి తీసుకొచ్చింది ప్రభుత్వం. అందుకోసం రైతులకు సబ్సిడీని కూడా అందిస్తోంది. దీంతో రైతులు స్థిర ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంతకీ ఏ రాష్ట్రంలో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు? ఎంత సబ్సీడీని ప్రభుత్వం అందిస్తోంది అనే విషయాలు ఈటీవీ భారత్ కథనంలో తెలుసుకుందాం.
గుజరాత్లోని భావ్‌నగర్ జిల్లా రైతులు ఈ నెట్‌హౌస్ పద్దతితో సాగు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా, అకాల వర్షాలు, పురుగుల దాడి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నెట్‌హౌస్ వ్యవసాయానికి 65 శాతం సబ్సిడీ ఇస్తోంది.
పర్యావరణ పరిరక్షణగా నెట్‌హౌస్‌లు
నెట్హౌసింగ్ అనే పద్ధతిని అనుసరించడం వల్ల పంట ఉత్పత్తితో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని భావ్‌నగర్ హార్టికల్చర్ విభాగం అధికారి ఎంబీ వాఘమాసీ తెలిపారు. 'గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం నెట్‌హౌస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. నెట్‌హౌస్‌లో సాగు చేస్తే మెరుగైన నాణ్యత గల పంటలు వస్తాయి. మంచి ధర కూడా లభిస్తుంది. ప్రస్తుతం భావ్‌నగర్ జిల్లాలో 55 స్వయం ఉపాధి నర్సరీ యూనిట్లు నెట్‌హౌస్‌లతో పనిచేస్తున్నాయి' అని వాఘమాసీ తెలిపారు.
ప్రభుత్వ సబ్సీడితో ప్రయోజనం
ప్రభుత్వం సబ్సీడి ద్వారా అందించే ఈ నెట్ హౌస్లతో ప్రయోజనం పొందినట్లు అంధారియావాడ్ గ్రామానికి చెందిన రైతు కిశోర్‌భాయ్ వేగడ్ తెలిపారు. 'నేను 2016 నుంచి నెట్ హౌసింగ్ పద్ధతిని అనుసరిస్తున్నా. మొదట సాధారణ నెట్‌హౌస్‌తో ప్రారంభించా. తర్వాత ప్రభుత్వ సబ్సిడీతో నర్సరీ నెట్‌హౌస్ తీసుకున్నా. అందులో నేను రూ.1.25 లక్షలు పెట్టుబడి పెట్టగా, ప్రభుత్వం రూ.2.27 లక్షలు ఇచ్చింది. గతేడాది నాకు ప్రభుత్వం 2000 చదరపు మీటర్ల నెట్‌హౌస్ మంజూరు చేసింది. దీనిపై రూ.9.59 లక్షలు (65%) సబ్సిడీ వచ్చింది. నేను నా సొంతంగా రూ.3.12 లక్షలు పెట్టి మొత్తం రూ.12 లక్షలతో నెట్‌హౌస్ నిర్మించాను. ఇందులో దోసకాయలు, టమాటాలు, క్యాప్సికం (శిమ్లామిర్చి) సాగు చేస్తున్నా. నెట్‌హౌస్‌లో అకాల వర్షం, మంచు, పురుగుల సమస్య తక్కువగా ఉండటంతో ఉత్పత్తి పెరిగింది, ఆదాయం స్థిరంగా వస్తోంది' అని కిశోర్ తెలిపారు.
నెట్‌హౌస్‌కు ఎంత సబ్సిడీ?
ప్రభుత్వం 1000 నుంచి 4000 చదరపు మీటర్ల వరకు నెట్‌హౌస్‌లకు సబ్సిడీ ఇస్తుందని హార్టీకల్చర్ అధికారి ఎంబీ వాఘమాసీ తెలిపారు. మొత్తం వ్యయంలో 65శాతం ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. ఒక రైతు 55 చదరపు మీటర్ల నర్సరీ ఏర్పాటు చేయాలంటే సుమారు రూ3.50 లక్షలు ఖర్చు అవుతుంది. అందులో రూ.2,27,500 ప్రభుత్వం భరిస్తుంది. గత మూడేళ్లలో జిల్లాలో నెట్‌హౌస్‌లు, స్వయం ఉపాధి నర్సరీల కోసం ప్రభుత్వం రూ.144 లక్షలు విడుదల చేసింది' అని వాఘమాసీ పేర్కొన్నారు.
పంట వ్యర్థాలపైనే బంగాళాదుంప సాగు- దిగుబడి అదుర్స్- జీరో టిల్లేజ్‌తో తగ్గిన ఖర్చు
ఇంట్లోనే లాభాల పంట- అరుదైన పుట్టగొడుగుతో భారీ ఆదాయం- కిలో ధర రూ.లక్ష

