ETV Bharat / bharat

1.77 అంగుళాలు వంగిన భాక్రా నంగల్ డ్యామ్ గోడ- క్లారిటీ ఇచ్చిన కేంద్రం

భాక్రా నంగల్ ఆనకట్ట గోడ వంగిందని సోషల్ మీడియాలో రూమర్స్- ఈ విషయంపై స్పందించిన పీఐబీ- ఈ వార్త ప్రజలను తప్పు పట్టించేదిగా ఉందని ప్రకటన

Bhakra Dam
ప్రతీకాత్మక చిత్రం (pecial Arrangement)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 8:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bhakra Nangal Dam Wall Issue : పంజాబ్‌లోని భాక్రా నంగల్ డ్యామ్ గోడ 1.77 అంగుళాలు వంగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒకవేళ డ్యామ్ తెగిపోతే దిల్లీ సహా పలు నగరాలు మునిగిపోతాయనే భయాలు ఈ వీడియో వల్ల రేకెత్తాయి. అయితే ఈ విషయంపై ప్రభుత్వ అధికారిక నిజ నిర్ధరణ విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కీలక ప్రకటన చేసింది. ఈ వాదనను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా, అవాస్తవమైనదిగా పేర్కొంది. 2026 ఆగస్టు 27న భాక్రా నంగల్ డ్యామ్ గోడలో నమోదైన అసలు కదలిక కేవలం 0.86 అంగుళాలు మాత్రమేనని పీఐబీ స్పష్టం చేసింది. ఇది ఇంజినీరింగ్ భద్రతా ప్రమాణాల ప్రకారం నిర్దేశించిన సాధారణ పరిధిలోనే ఉందని వెల్లడించింది.

వదంతులను, తప్పుడు వార్తలను నమ్మెద్దు!
మరోవైపు, భాక్రా నంగల్ డ్యామ్ నిర్మాణాత్మకంగా పటిష్టంగానే ఉందని అధికారులు, నిపుణులు తెలిపారు. దాని స్థిరత్వానికి ఎలాంటి ముప్పు లేదని ధ్రువీకరించారు. ఈ ఆనకట్టను ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన డ్యామ్‌ల్లో ఒకటిగా పరిగణిస్తారని వెల్లడించారు. ఒత్తిడి, రంధ్ర పీడనం, లీకేజీ వంటి కీలక నిర్మాణ భద్రతా సూచికలు నిర్దేశించిన సురక్షిత పరిమితుల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, భాక్రా నంగల్ డ్యామ్ భద్రతపై సోషల్ మీడియాలో ప్రచారంలో అవుతున్న వీడియోలను, భయాందోళనలు సృష్టించే వదంతులను నమ్మొద్దని పీఐబీ, పంజాబ్ ప్రభుత్వం ప్రజలను కోరాయి. భాక్రా నంగల్ ఆనకట్ట భద్రతకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక, ధ్రువీకరించిన మూలాల నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశాయి. పీఐబీ, అధికారులు ప్రకటనతో భాక్రా నంగల్ డ్యామ్ గోడ వంగిందన్న దుష్ప్రచారానికి తెరపడింది.

కొన్నాళ్ల క్రితం మంత్రి ప్రకటన
కొద్ది రోజుల క్రితం పంజాబ్ జలవనరుల శాఖ మంత్రి బరీందర్ కుమార్ గోయల్ కూడా రాష్ట్ర అసెంబ్లీలో భాక్రా నంగల్ డ్యామ్ గురించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆనకట్ట భద్రతపై ఉన్న ఆందోళనలను తగ్గించేందుకు ప్రయత్నించారు. భాక్రా నంగల్ డ్యామ్ గోడలో తాత్కాలిక కదలిక, దాని ఇంజినీరింగ్ డిజైన్‌లో ఒక సాధారణ భాగమని గోయల్ అన్నారు. నీటి ఒత్తిడి పెరిగినప్పుడు స్వల్ప కదలిక సంభవించవచ్చని, ఒత్తిడి తగ్గినప్పుడు నిర్మాణం తిరిగి యథాస్థితికి వస్తుందని తెలిపారు. గత 40 ఏళ్లలో భాక్రా నంగల్ డ్యామ్‌ గోడలో ఇలాంటి కదలికలు 15 సార్లు నమోదయ్యాయని వివరించారు. అందుకే ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భాక్రా నంగల్ ఆనకట్ట సురక్షితంగానే ఉందని చెప్పారు.

పంజాబ్ సర్కార్‌కు హరియాణా ప్రభుత్వం విజ్ఞప్తి
ఇటీవలే పంజాబ్‌ వద్ద భాక్రా రిజర్వాయర్‌లో అదనంగా మిగిలిపోయిన తాగునీరు తమకు ఇవ్వాలని హరియాణా సర్కార్ కోరింది. లేకపోతే ఆ నీరు పాకిస్థాన్‌కు వెళ్లడం మినహా ప్రయోజనం లేదని అభిప్రాయపడింది. దిల్లీలో ఆప్ అధికారంలో ఉన్నన్నాళ్లు నీటి విడుదలకు పంజాబ్‌ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని పేర్కొంది. ప్రస్తుతం అక్కడ ఆప్‌ ప్రభుత్వం లేదని వెల్లడించింది. అలాంటి సమయంలో దిల్లీ ప్రజలను శిక్షించేలా పంజాబ్ ప్రభుత్వం వ్యవహరించకూడదని కోరింది. అసలు హరియాణాకు రావాల్సిన వాటా జలాలే రాలేదని స్పష్టం చేసింది.

భాక్రా నంగల్ ఆనకట్ట నిర్మాణం 1948వ సంవత్సరంలో మొదలై 1963లో పూర్తైంది. దీని ఎత్తు 741 అడుగులు (226 మీటర్లు). ఈ డ్యామ్ ఇంచుమించు 10 మిలియన్ ఎకరాలకు పంట నీరును అందిస్తుంది. ఈ డ్యామ్‌ను ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులలో నిర్మించారు. ఈ డ్యామ్ నిర్మాణానికి ముఖ్య కారణం సట్లెజ్-బియాస్ నదీ పరీవాహక ప్రాంతంలో వరదలను నిరోధించడం, పంట పొలాలకు సాగునీటి పంపిణీ, జల విద్యుత్తు (హైడ్రో విద్యుత్) ను ఉత్పత్తి చేయడం. ప్రస్తుతం భాక్రా నంగల్‌ ప్రాజెక్టు పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్ నీటి అవసరాలను తీరుస్తోంది.

వరదలపై జైశంకర్‌ సమీక్ష- సహాయక చర్యలకు అత్యంత ప్రాధాన్యత- నెల జీతం విరాళంగా ఇచ్చిన నేపాల్ మంత్రులు

భారత్-చైనా సరిహద్దు వివాదం- శాంతియుత పరిష్కారానికి ఇరుదేశాలు అంగీకారం: MEA