ETV Bharat / bharat

ఈ ఏడాది వర్షాలు తక్కువే- నైరుతి రుతుపవనాలపై ఎల్‌ నినో ఎఫెక్ట్

నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన- ఈ ఏడాది వర్షపాతం తక్కువే అని వెల్లడి

Southwest Monsoon 2026 Rainfall
Southwest Monsoon 2026 Rainfall (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2026 at 9:16 PM IST

3 Min Read
Choose ETV Bharat

Southwest Monsoon 2026 Rainfall : దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఎల్‌ నినో ప్రభావం పడనుంది. ఈ ఏడాది జూన్- సెప్టెంబర్​లో నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 92 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. దీంతో దేశంలోని వ్యవసాయం, నీటి వనరులు, పర్యావరణంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

'ఐఎండీ అంచనా ప్రకారం, మొత్తం రుతుపవన కాలంలో వర్షపాతం సాధారణ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, వాయువ్య, ఈశాన్య, దక్షిణ భారత్​లోని కొన్ని ప్రాంతాలు మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ప్రస్తుత పరిస్థితులు తటస్థ స్థితిలో ఉన్నాయి. ఇది జూన్​ వరకు కొనసాగుతాయి' అని మహాపాత్ర పేర్కొన్నారు.

92 శాతం మాత్రమే వర్షపాతం
ఐఎండీ అంచనాల ప్రకారం, 2026 రుతుపవనాల వర్షపాతం సుమారు 92 శాతం మాత్రమే ఉండే అవకాశముంది. ±5 శాతం మార్పు ఉండొచ్చని తెలిపింది. ఇది గత 30 సంవత్సరాల సగటు కంటే తక్కువని పేర్కొంది. జూన్‌లో సాధారణ వర్షపాతం సుమారు 101 శాతం, జులైలో 95శాతం, ఆగస్టులో 92శాతం, సెప్టెంబర్​లో 89శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అంటే రుతుపవనాల ప్రారంభంలో మంచి వర్షాలు పడినా, తరువాతి నెలల్లో క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి.

ఈ రాష్ట్రాలపై ప్రభావం
మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో నీటిపారుదల సదుపాయాలు తక్కువగా ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వచ్చే ఈ వర్షాలు భారత్‌ మొత్తం వార్షిక వర్షపాతంలో దాదాపు 75 శాతం వాటా కలిగి ఉంటాయి.

ఎల్ నినో ప్రభావం
వర్షపాతం తగ్గడానికి ప్రధాన కారణంగా ఎల్‌ నినో పరిస్థితులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం లా నినా పరిస్థితులు ఉన్నప్పటికీ, అవి క్రమంగా ఎల్ నినోగా మారే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూన్ నాటికి ఎల్‌ నినో ప్రభావం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. రుతుపవనాల రెండో భాగంలో హిందూ మహాసముద్రంలో సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావం వల్ల కొంత మేర వర్షపాతం పెరిగి, ఎల్‌ నినో ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య ఉత్తర గోళార్థంలో మంచు విస్తీర్ణం సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉందని ఐఎండీ పేర్కొంది. ఇది కూడా రుతుపవనాలపై ప్రభావం చూపే అంశంగా భావిస్తున్నారు.

వ్యవసాయం, నీటి వనరులపై ప్రభావం
దేశవ్యాప్తంగా వర్షపాతం సమానంగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ లేదా అధిక వర్షాలు పడినా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కొరత ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య భారత్​లో పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షపాతం తగ్గితే వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల నీటి సరఫరా, స్థానిక ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖరీఫ్‌ పంటలపై ప్రభావం అధికంగా ఉండొచ్చు.

పర్యావరణంపై ప్రభావం
తక్కువ వర్షాలు కేవలం వ్యవసాయానికే కాదు, పర్యావరణానికి కూడా ముప్పు అందని నిపుణులు అంటున్నారు. అడవుల్లో తేమ తగ్గడం, వాగులు, నదులు ఎండిపోవడం, పక్షుల వలసలు, జంతువుల జీవన చక్రాలు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.