ETV Bharat / bharat

మోదీ మెచ్చిన బిచ్చగాడు- సొంత సొమ్ముతో అమ్మాయిలకు పెళ్లిళ్లు- పేదలకు దుప్పట్లు దానం!

పఠాన్‌కోట్‌లో రాజు అనే దివ్యాంగుడి గొప్ప మనసు- భిక్షాటనతో వచ్చిన డబ్బు పేదల సేవకే వినియోగం- గతంలో 'మన్ కీ బాత్'లో ప్రశంసించిన మోదీ- ఇప్పటివరకు 50 మంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు

PM Praises Beggar Raju
PM Praises Beggar Raju (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 8:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Praises Beggar Raju: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మానవత్వానికి నిలువుటద్దంలాంటి ఒక అరుదైన వ్యక్తి ఉన్నాడు. పేరుకు రాజు అయినా, అతనొక దివ్యాంగ యాచకుడు. అయితేనేమి గొప్ప దానగుణం ఉన్నవాడు. ఏకంగా 500 దుప్పట్లను కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా పంపిణీ చేశాడు. తాను భిక్షాటన ద్వారా ప్రజల నుంచి సేకరించిన పది, ఇరవై రూపాయలను కూడబెట్టి ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. సాధారణంగా భిక్షాటన చేసేవారు తమ కడుపు నింపుకోవడానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ రాజు మాత్రం తన కష్టార్జితాన్ని సమాజ సేవ కోసం ఖర్చు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో రాజు సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించడం విశేషం.

చలి పులి కోరల్లో పేదలు, రాజు ఆసరా
ప్రస్తుతం ఉత్తర భారతదేశం తీవ్రమైన చలి గుప్పిట్లో చిక్కుకుంది. చలి తీవ్రతకు సామాన్య ప్రజలే వణికిపోతున్నారు. ఇక ఇళ్లు లేని నిరాశ్రయుల పరిస్థితి వర్ణనాతీతం. వారికి కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి దొరకడమే కష్టంగా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాజు వారికి దేవుడిలా కనిపించాడు. తన చక్రాల కుర్చీపై తిరుగుతూ చలికి వణుకుతున్న అభాగ్యులకు వెచ్చని దుప్పట్లు కప్పాడు. సుమారు 500 మందికి దుప్పట్లు పంచడమే కాకుండా, వారికి టీ, అల్పాహారం కూడా ఏర్పాటు చేశాడు.

పది రూపాయల నోట్లు పోగుచేసి
రాజు చేస్తున్న సేవ వెనుక పెద్ద కష్టమే ఉంది. "నేను ప్రజల దగ్గర ఒక్కో పది రూపాయలు అడిగి తీసుకుంటాను. అలా వచ్చిన డబ్బును పోగుచేసి దుప్పట్లు కొన్నాను. నాకంటూ సొంత ఇల్లు లేదు. నెలకు రూ.5,000 అద్దె కట్టి ఒక చిన్న గదిలో ఉంటున్నాను. నా కష్టాలు నాకు ఉన్నా, పది మందికి సాయం చేయడం ఆపను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు" అని రాజు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.

మోదీ ప్రశంసలు, కరోనా కాలంలో సేవలు
రాజు ఇలా సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. కరోనా కష్టకాలంలో రాజు చేసిన సేవలు అమోఘం. ఆ సమయంలో మాస్కులు, శానిటైజర్లు కొనుగోలు చేసి వీధుల్లో ఉచితంగా పంచాడు. పేదలకు ఇంటింటికీ వెళ్లి రేషన్ అందించాడు. పేద పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు, నోట్‌బుక్స్ కొనిచ్చాడు. రాజు సేవా దృక్పథాన్ని గుర్తించిన ప్రధాని మోదీ, అప్పట్లో 'మన్ కీ బాత్'లో రాజు గురించి గొప్పగా చెప్పారు.

50 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు
రాజు కేవలం దుప్పట్లు పంచడమే కాదు, అంతకంటే పెద్ద పనులు చేశాడు. ఇప్పటివరకు దాదాపు 50 మంది పేద యువతులకు పెళ్లిళ్లు చేయించాడు. తన సంపాదనతో పాటు దాతల సాయం కూడా తీసుకుని వారిని ఆదుకున్నాడు. అంతేకాదు, గ్రామాల్లో విరిగిపోయిన రెండు వంతెనలను కూడా సొంత ఖర్చుతో బాగు చేయించాడు. కాళ్లు పనిచేయకపోయినా, వీల్‌చైర్‌కే పరిమితమైనా, అతని మనసు మాత్రం చాలా విశాలమైనది.

ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఇంత సేవ చేస్తున్న రాజుకు సొంత గూడు లేకపోవడం విషాదం. ప్రభుత్వాలు తనకు ఎన్నో హామీలు ఇచ్చాయని, కానీ ఏవీ నెరవేరలేదని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఉండటానికి ఒక ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. "నాకు ఇల్లు ఇస్తే, అద్దెకు కట్టే డబ్బు కూడా పేదలకే ఖర్చు చేస్తాను" అని రాజు చెబుతున్నాడు.

ఆప్ నేత హామీ
రాజు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత విశ్వ శర్మ పాల్గొన్నారు. రాజు సేవాగుణాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. "జీవితంలో ఏమీ లేదని సాకులు చెప్పేవాళ్ళు రాజును చూసి నేర్చుకోవాలి. ఇతను నిజమైన మానవత్వానికి నిదర్శనం. రాజుకు ఇల్లు కల్పించే విషయంపై మా పార్టీ తరఫున అధికారులతో, విభూతి శర్మతో మాట్లాడతాం" అని హామీ ఇచ్చారు.