ఓవైపు లాయర్‌గా ప్రాక్టీస్- మరోవైపు మోడ్రన్ ఫార్మింగ్‌లో అదుర్స్- యువరైతుకు ఏటా రూ.లక్షల్లో ఆదాయం
సాగులో అదరగొడుతున్న యువరైతు- భారీగా లాభాలు

Published : December 11, 2025 at 12:49 PM IST
Gorakhpur Farmer Success Story : ప్రస్తుతం కాలంలో అకాల వర్షాలు, పురుగు పోటు, పెరిగిన ఖర్చుల వల్ల వ్యవసాయం దండుగ అని చాలా మంది యువత భావిస్తున్నారు. సాగు వల్ల కుటుంబ పోషణే కష్టమవుతుందని భయపడుతున్నారు. చిన్నదో పెద్దదో ఉద్యోగం బెటర్ అని యోచిస్తున్నారు. లేదంటే వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇదంతా తప్పని నిరూపించారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన ఓ యువరైతు. కూరగాయల సాగు బాట పట్టి ఏటా లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. మరికొంత మంది కూలీలను ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో యువరైతు అవినాశ్ కుమార్ మౌర్య సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
లాయర్‌గా ప్రాక్టీస్ కూడా
అవినాశ్ కుమార్ మౌర్య స్వస్థలం గోరఖ్‌పుర్ జిల్లాలోని నార్హర్ పుర్. అవినాశ్ ఎంఫిల్ పూర్తి చేశారు. అలాగే లా గ్రాడ్యుయేట్ కూడా. ఉన్నత చదువుల తర్వాత అవినాశ్‌కు చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ జాబ్ చేసేందుకు ఆయన అసక్తి చూపలేదు. వ్యవసాయం వైపునకు మెగ్గు చూపారు. మోడ్రన్ ఫార్మింగ్‌ను తన ప్రధాన ఆదాయ వనరుగా చేసుకున్నారు. అలాగే గోరఖ్‌పుర్ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

తొలుత సాగులో నష్టాలు
2017లో సాగులోకి దిగారు అవినాశ్. తొలుత వ్యవసాయంలో చాలా నష్టాలను చవిచూశారు. తరువాత ఉద్యానవన శాఖ అధికారులతో సంప్రదించి ఫార్మింగ్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. అనేక ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్నారు. సంప్రదాయ పంటలైన గోధుమలు, వరిని అవినాశ్ పండించరు. తన 35 ఎకరాల పొలంలో బీన్స్, టమాటాలు, పొట్లకాయలు, వంకాయలు, గుమ్మడికాయలు, ముల్లంగి, క్యాబేజీ, ఓక్రా వంటి వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు.

సీఎం యోగి చేతుల మీదుగా సత్కారం
ఒక ఎకరం భూమిలో దోస పాదులను వేశారు అవినాశ్. అవి బాగా దోసకాయలు కాయడంతో మంచి దిగుబడి వచ్చింది. కేవలం మూడు నెలల్లోనే దాదాపు రూ.10 లక్షలు ఆదాయం దోససాగు ద్వారా అవినాశ్‌కు వచ్చింది. కూరగాయల సాగు వార్షిక టర్నోవర్ సుమారు రూ.35 లక్షలు- రూ. 40 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అలాగే అవినాశ్ ఉద్యానవన శాఖ నిర్వహించే సెమినార్లలో కూడా పాల్గొని, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తమ గ్రామంలో దాదాపు 25 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారికి నెలకు రూ.15,000 వరకు జీతం ఇస్తున్నారు. రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న అవినాశ్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చౌదరి చరణ్ సింగ్ జయంతి నాడు డిసెంబరు 23న సత్కరించనున్నారు.

'యూత్ తమను తాము బలహీనులుగా భావించొద్దు'
యువత రీల్స్, మొబైల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారని యువరైతు అవినాశ్ అభిప్రాయపడ్డారు. ఇలా సమయం వృథా చేయడం మంచిది కాదన్నారు. తమను తాము యువత బలహీనులుగా భావించవద్దని సూచించారు. ఉద్యోగం దొరకకపోతే పొలంలో కూరగాయలు పండించడం ద్వారా జీవనోపాధి పొందొచ్చని వెల్లడించారు. "సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. డ్రిప్, స్ప్రింక్లర్, రెయిన్ గన్ పద్ధతులను వాడుతున్నాం. తద్వారా నీటి వినియోగం తగ్గుతుంది." అని అవినాశ్ పేర్కొన్నారు.

"దుకాణదారులు నా పొలానికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తారు. నేను కూరగాయలను మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేను చదువులో టాపర్‌ని. మంచి జాబ్ కూడా వచ్చింది. కానీ నేను వ్యవసాయం వైపునకు ఆకర్షితుడినయ్యాను. రైతుల దుస్థితి, ఆత్మహత్యలు, అప్పుల బాధలు వంటి సమస్యలు నన్ను తీవ్రంగా కదిలించాయి. సంప్రదాయ వ్యవసాయం కాకుండా కూరగాయలను సాగు చేస్తున్నాను. బీన్స్, దోసకాయల ద్వారా మంచి రాబడిని పొందుతున్నాను. రసాయన ఎరువులతో పాటు ఆవు పేడ ఎరువును వ్యవసాయ భూమిలో వేస్తాను. వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ అందుతోంది. "
--అవినాశ్, యువరైతు
అలాగే అవినాశ్ వల్ల చాలా మంది స్థానికులు ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో ఉపాధి లభించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "నేను అవినాశ్‌తో కలిసి చాలా కాలంగా పనిచేస్తున్నాను. నాకు నెలకు రూ.15,000 జీతం వస్తుంది. ఇప్పుడు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. నేను ఇకపై ఉపాధి కోసం వెరో చోటికి వెళ్లాల్సిన పనిలేదు." అని సురేశ్ చౌహాన్ అనే కార్మికుడు తెలిపాడు.


