ETV Bharat / bharat

యూనస్​ మతోన్మాదులు, విభజన కోరుకునే గ్రూపులతో చేతులు కలిపారు: తస్లిమా నస్రీన్

నోబెల్​ శాంతి బహుమతి విజేత అయిన యూనస్ ప్రజాభద్రత, సెక్యూలరిజానికి ముప్పు కలిగించే ఎజెండాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శ

Taslima Nasreen on Bangladesh
Taslima Nasreen on Bangladesh (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 5:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

Taslima Nasreen on Bangladesh : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆ దేశ బహిష్కృత రచయిత్రి తస్లిమా నస్రీన్​. మతోన్మాదులు, విభజన కోరుకునే గ్రూపులతో చేతులు కలిపారని ఆరోపించారు. కేరళ శాసనసభలో ఏర్పాటుచేసిన నాలుగో అంతర్జాతీయ బుక్​ ఫెయిర్​లో కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నోబెల్​ శాంతి బహుమతి విజేత అయిన యూనస్​, ప్రజాభద్రత, సెక్యూలరిజానికి ముప్పు కలిగించే ఎజెండాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తన పుస్తకాలపై కొంతమంది మత మౌఢ్యులు, తీవ్రవాదులు ఫత్వాలు జారీ చేసి బెదిరించారని గుర్తుచేశారు. అయినా అప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దానికి బదులుగా తిరిగి తనపైనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారని తెలిపారు.

"అప్పటి ప్రభుత్వం ఆ మతోన్మాదులు, జిహాదీలపై చర్య తీసుకుంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదు. ప్రభుత్వం తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం, వీలైనంత కాలం అధికారంలో ఉండటానికి మతాన్ని ఉపయోగించుకుంది. ఇంకా సెక్యూలర్​ విద్యా సంస్థలు, సైన్స్ అకాడమీలను నిర్మించడానికి బదులుగా ఎక్కువ కాలం అధికారంలో ఉండేందుకు మతోన్మాదుల మద్దతు కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం మత పాఠశాలలను నిర్మిస్తోంది. మౌలికవాదులు ఒక రకంగా అధికారంలో ఉన్నారు. యూనస్ వారికి మద్దతు ఇస్తున్నారు. ఈ సమయంలో 1971లో పాకిస్థాన్‌తో పోరాడి సాధించుకున్న లౌకిక దేశాన్ని మనం మళ్లీ ఎలా తిరిగి పొందుతామో నాకు తెలియట్లేదు. ఇప్పుడు దేశం విభజనకు గురైంది. ముస్లిం తీవ్రవాదులు మైనారిటీ వర్గాలను హింసిస్తూ చంపుతున్నారు దీనిని మనం ఆపాలి."

- తస్లిమా నస్రీన్​, బంగ్లాదేశ్ రచయిత్రి

అంతకుముందు కూడా ఇస్లాంపై పలుమార్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బంగ్లాదేశ్‌ బహిష్కృత రచయిత తస్లీమా నస్రీన్‌. ఇస్లాం ఉన్నంతవరకూ ఉగ్రవాదం ఉంటుందన్న ఆమె, పహల్గాం దాడిని, 2016లో ఢాకాలో జరిగిన ఉగ్రదాడితో పోల్చారు. "1400 ఏళ్లైనా ఇస్లాం ఇంకా వికాసం చెందలేదు. ఇది జరిగేవరకూ ఉగ్రవాదులను పుట్టిస్తూనే ఉంటుంది. కల్మా పఠించనందుకు 2016లో ఢాకాలో జరిగిన దాడిలో ముస్లింలను హత్య చేశారు. మానవత్వాన్ని, హేతుబద్ధతను కూడా విశ్వాసం అధిగమించినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇస్లాం ఉన్నంత వరకూ ఉగ్రవాదం ఉంటుంది. ఐరోపాలో చర్చిలు ప్రదర్శనశాలలుగా మారాయి. కానీ ప్రతి చోటా మసీదులు కట్టడంలో ముస్లింలు బిజీగా ఉన్నారు. వారు జిహాదీలను ఉత్పత్తి చేస్తున్నారు. మదర్సాలు ఉండకూడదు. పిల్లలు ఒక పుస్తకాన్ని కాకుండా అన్ని పుస్తకాలూ చదవాలి" అని నస్రీన్‌ అన్నారు.

బంగ్లాదేశ్​లో​ దీపూ చంద్రదాస్‌ హత్య కేసు- ప్రధాన నిందితుడు అరెస్ట్

4రోజుల్లోనే చేతులెత్తేసిన పాక్‌తో బంగ్లాదేశ్‌తో 'రక్షణ' డీల్?- 'జేఎఫ్-17' యుద్ధ విమానాల విక్రయం