ఆరోగ్యం, రుచి మేళవింపు ఈ 'చాయ్'- విదేశీ టూరిస్టులు ఫిదా- ఈ 'బేల్ టీ' గురించి మీకు తెలుసా?
బిహార్‌లోని బుద్ధగయలో బేల్ టీ చాలా పాపులర్- ఈ టీని తెగ తాసేస్తున్న విదేశీ పర్యటకులు- షుగర్, జీర్ణ, ఉదర సంబంధిత వ్యాధులకు మంచి పరిష్కారం

Published : January 6, 2026 at 3:51 PM IST
Bael Tea In Bodh Gaya : భారతీయులకు ఉదయాన్నే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. అంతలా టీతో మనకు బంధం ఏర్పడిపోయింది. అయితే చాలా మంది పాలతో చేసిన టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ సహా ఇంకా పలు రకాల టీలను రుచి చూసి ఉంటారు. అయితే విదేశాల్లో పాపులర్ అయిన బేల్ టీ (ఉడ్ యాపిల్ టీ)ని బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి విక్రయిస్తున్నారు. ఈ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో బేల్ టీని తయారు చేయడం ఎలా? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
బేల్ టీని తెగ తాగేస్తున్నటూరిస్టులు
థాయ్‌లాండ్, జపాన్, వియత్నాం, భూటాన్, మయన్మార్, శ్రీలంక వంటి దేశాల ప్రజలు ప్రతిరోజూ బేల్ టీని తాగుతారు. దీని ధర సాధారణ టీలతో పోలిస్తే కాస్త ఎక్కువ. అయితే మన దేశంలో బేల్ టీ చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది. అంతర్జాతీయ పర్యాటక ప్రదేశమైన బుద్ధగయలో ఓ వ్యక్తి తన స్టాల్లో బేల్ టీని విక్రయిస్తున్నారు. దీన్ని విదేశీ పర్యటకులు తెగ తాగేస్తున్నారు.


బుద్ధగయలోని మహాబోధి ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లే మార్గంలో రంజన్ కుమార్ (30) బేల్ టీని తయారు చేస్తున్నారు. బి.కామ్ డిగ్రీ, స్పానిష్ భాషలో డిప్లొమా పొందిన రంజన్ ఈ స్పెషల్ టీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రత్యేక టీని తయారు చేయడానికి రంజన్ మొదట పచ్చి ఉడ్ యాపిల్‌ను ముక్కలుగా కోసి, ఆపై దాన్ని ఎండబెడతారు. కొన్ని రోజుల తర్వాత అది గట్టిగా మారిన తర్వాత దాంతో టీని తయారు చేస్తారు.

థాయ్‌లాండ్ రెసిపీ నేర్చుకున్న రంజన్
రంజన్ కుమార్ అనేక పెద్ద కంపెనీలలో పనిచేశారు. తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో థాయ్‌లాండ్ వెళ్లారు. అక్కడ మొదటిసారి బేల్ టీని రుచి చూశారు. ఈ టీని తాగినప్పుడు రంజన్‌కు రిలీఫ్‌గా అనిపించింది. దీంతో అక్కడి ప్రజలను అడిగి బేల్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారు. అలాగే బేల్ టీ రెసిపీని నేర్చుకున్నారు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత బేల్ టీని తయారు చేయడం ప్రారంభించారు. ఒక టీ స్టాల్‌ను ప్రారంభించడమే కాకుండా బేల్ ముక్కలను థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, వియత్నాం వంటి దేశాలకు రంజన్ ఎగుమతి చేస్తున్నారు.

"మన దేశంలో చాలా మంది టీ తాగుతారు. అయితే టీలో అధిక చక్కెర, టీపొడి వల్ల అనేక వ్యాధులు రావొచ్చు. నా తండ్రికి షుగర్ ఉన్నా ఎక్కువగా టీ తాగుతాడు. దీంతో నా కుటుంబం ఆందోళన చెందేది. నేను బేల్ టీ తయారు చేసే రెసిపీని థాయ్‌లాండ్‌లో నేర్చుకున్నాను. ఇండియాకు వచ్చిన తర్వాత నేను దాన్ని ఇంట్లో ప్రయత్నించాను. నా తండ్రికి కూడా ఇది చాలా నచ్చింది. ప్రారంభంలో నేను నా తల్లిదండ్రుల కోసం బేల్ టీ తయారు చేశాను. ఆ తర్వాత ఒక టీ స్టాల్‌ను ప్రారంభించా. కస్టమర్లు కూడా దీన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బుద్ధగయకు వచ్చే విదేశీ పర్యటకులు ఎక్కువగా బేల్ టీని తాగుతారు. నేను ప్రతి ఒక్కరూ బేల్ టీని ప్రయత్నించమని ప్రోత్సహిస్తాను. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది" అని రంజన్ కుమార్ తెలిపారు.

పర్యటకులు ఏమంటున్నారంటే?
బేల్ టీ రుచి ఘాటుగా, చేదుగా ఉండదన్నారు టిబెట్‌కు చెందిన పర్యటకుడు షుంగ్ సాంగ్ రూప్. పండిన ఉడ్ యాపిల్ తియ్యగా ఉంటుందని, అందుకే దాన్ని పండకముందే కోసి ఎండబెడతారని అన్నారు. ఆ తర్వాత ఉడ్ యాపిల్‌తో చేసిన టీ రుచిగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ టీ ధర రూ. 30- 50 వరకు ఉంటుందని చెప్పారు.
"బేల్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి బేల్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసినవారు తప్పకుండా దీన్ని సేవిస్తారు. ఈ టీ పాదాలకు నొప్పులు, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అలాగే ఇది చాలా రుచికరంగా ఉంటుంది." అని రాకేశ్ గైడ్ కుమార్ తెలిపారు.

బేల్లో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయని గయాకు చెందిన ప్రఖ్యాత జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. బేల్ టీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కాకుండా అనేక వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. బేల్ టీ షుగర్ వ్యాధిగ్రస్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని స్పష్టం చేశారు. బేల్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుందని, ఉదర సంబంధించిన అనేక ఇతర సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుందని చెప్పారు.

బేల్ టీని ఎలా తయారు చేస్తారు?
ముడి బేల్‌ను మొదట కోస్తారు. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రంపై ఉంచి, సన్నని కాటన్ గుడ్డను కప్పి ఆరబెడతారు. బేల్పై ఈగలు, ఇతర కీటకాలు పడకుండా వస్త్రాన్ని కప్పుతారు. తరువాత దానిని ఎండలో ఎండబెడతారు. అది పూర్తిగా ఎండిపోయి చెక్కలా గట్టిగా అయ్యే వరకు ఎండబెడతారు. అందుకు దాదాపు 20- 25 రోజులు పడుతుంది. 10 కప్పుల టీకి 5-6 బేల్ ముక్కలను నీటిలో మరిగిస్తారు. 6- 7 నిమిషాల్లో టీ లాగా ఎరుపు రంగులోకి మారుతుంది.

మట్టి టీ కప్పుల తయారీ బిజినెస్‌లో అదుర్స్- ఏటా రూ.లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్న కేతన్

