ETV Bharat / bharat

అయోధ్యలో సంచలన నిర్ణయం- ఇకపై అక్కడ 'ముక్క' కనపడకూడదు- రామయ్య ప్రసాదానికి ఫుడ్ సేఫ్టీ టెస్ట్!

రామ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో కఠిన ఆంక్షలు- ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌పైనా నిషేధం- సీతా రసోయిలో అధికారుల ఆకస్మిక తనిఖీలు- నైవేద్యం నాణ్యతపై సర్టిఫికేషన్

Ayodhya Non Veg Delivery Ban
Ayodhya Non Veg Delivery Ban (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 1:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ayodhya Non Veg Delivery Ban: ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర పరిసరాల్లో ఇకపై మాంసాహారం వాసన కూడా రాకూడదని జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. రామ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహార విక్రయాలతో పాటు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై కూడా పూర్తి నిషేధం విధించింది. మరోవైపు, బాలరాముడికి నిత్యం సమర్పించే నైవేద్యం, భక్తులకు పంచే ప్రసాదం నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఆలయ వంటశాల 'సీతా రసోయి'కి ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు.

ఆన్‌లైన్ ఆర్డర్లపైనా ఉక్కుపాదం
అయోధ్య పవిత్రతను కాపాడేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. 'పంచకోశి పరిక్రమ' మార్గంలో ఇప్పటికే మాంసాహార విక్రయాలు నిలిపివేశారు. అయితే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆన్‌లైన్ యాప్స్ ద్వారా రహస్యంగా నాన్-వెజ్ డెలివరీ చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్య చంద్ర సింగ్ సీరియస్ అయ్యారు. ఆన్‌లైన్ డెలివరీ కంపెనీలు కూడా ఆలయ పరిధిలో మాంసాహారాన్ని సరఫరా చేయకూడదని ఆదేశించారు. ఈ మేరకు హోటల్ యజమానులకు, డెలివరీ సంస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మద్యం దుకాణాల తొలగింపు
మాంసాహారంతో పాటు మద్యపానంపై కూడా నిషేధం కొనసాగుతోంది. పంచకోశి పరిక్రమ మార్గంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అయితే రామ్​పథ్ మార్గంలో ఇంకా దాదాపు రెండు డజన్ల లైసెన్స్ ఉన్న మద్యం షాపులు ఉన్నాయి. వీటిని తొలగించడానికి మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. జిల్లా యంత్రాంగం అనుమతి రాగానే వీటిని కూడా తొలగిస్తామని అధికారులు తెలిపారు.

రామయ్య ప్రసాదానికి 'టెస్ట్'
మరోవైపు, రామయ్యకు పెట్టే నైవేద్యంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా, ప్రసాదం అత్యంత స్వచ్ఛంగా ఉండాలనేదే అధికారుల లక్ష్యం. ఆలయ వంటశాలలోని నైవేద్యం, ప్రసాదం నాణ్యతను పరీక్షించి సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఫుడ్ సేఫ్టీ విభాగం ఆడిట్ నిర్వహించనుంది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సర్టిఫికేట్ జారీ చేస్తారు.

ఏమేం తనిఖీ చేస్తారంటే?
ఆడిట్ బృందం సీతా రసోయిలో పలు అంశాలను పరిశీలిస్తుంది. వంటకు వాడే బియ్యం, నెయ్యి, పప్పులు వంటి సరుకుల నాణ్యతను పరీక్షిస్తారు. వంట గదిలో శుభ్రత, వంట పాత్రల క్లీనింగ్ విధానాన్ని గమనిస్తారు. సరుకులు నిల్వ చేసే గదులు ఎలా ఉన్నాయో చూస్తారు. వంట చేసే సిబ్బందికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? వారు ఫిట్‌గా ఉన్నారా లేదా? అని పరీక్షిస్తారు. వారు గ్లౌజులు, మాస్కులు వాడుతున్నారో లేదో తనిఖీ చేస్తారు.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, వంట సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆహార భద్రత, పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పిస్తారు. దేవుడికి పెట్టే నైవేద్యం తయారీలో ఎలాంటి చిన్న పొరపాటు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో యాలకుల టెస్టింగ్
కొద్ది రోజుల క్రితం ప్రసాదంలో వాడే యాలకుల నాణ్యతపై అనుమానాలు వచ్చాయి. వెంటనే వాటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించారు. అందులో అవి పూర్తిగా స్వచ్ఛమైనవేనని తేలింది. భక్తులకు పంచే ప్రసాదం కూడా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని అధికారులు నిర్ధారించారు. మొత్తానికి అయోధ్యలో పవిత్రత, ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడకూడదని ప్రభుత్వం, ఆలయ ట్రస్ట్ నిర్ణయించుకున్నాయి.

చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని శక్తిమంతమైన భారత్​ను నిర్మించాలి: అజిత్ ఢోబాల్

'స్కూల్ మ్యూజియమ్స్‌‌'- పాఠ్య పుస్తకాలను మించిన నాలెడ్జ్- ఆచరణాత్మక, అనుభవపూర్వక విద్యాబోధన