ETV Bharat / bharat

తాత టైమ్‌లో భూవివాదంపై పోరాటం- మనవడి హయాంలో దక్కిన న్యాయం- 59 ఏళ్ల తర్వాత కేసు విజయం!

సివిల్ వివాదంలో ఓ వ్యక్తికి 59 ఏళ్ల తర్వాత ఊరట- సంతోషం వ్యక్తం చేసిన పిటిషనర్- అయితే ఈ తీర్పునాటికి తన తాత బతికిలేరని ఎమోషనల్

Verdict in 59 Year Old Land Dispute
భూవివాదంపై పోరాటం (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 21, 2026 at 5:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

Verdict in 59 Year Old Land Dispute : 3 కంఠాల (సుమారు 9 సెంట్లు) భూమిపై ఉన్న సివిల్ వివాదంపై తాత హయాంలో న్యాయపోరాటం ప్రారంభమవ్వగా, మనవడి హయాంలో తీర్పు వెల్లడైంది. 1967లో ప్రారంభమైన భూవివాదం 59 ఏళ్ల తర్వాత అంటే 2026లో పరిష్కారమైంది. ఇంతకీ ఈ వివాదం ఏంటి? ఏ కోర్టులో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది? తదితర విషయాలు తెలుసుకుందాం.

1967లో కేసు- 2026లో వీడిన చిక్కుముడి
బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలోని ఖఖ్రా గ్రామానికి చెందిన సుబేదార్ యాదవ్‌ 59 ఏళ్ల నాటి భూవివాదం పరిష్కారం కావడంతో ఎట్టకేలకు మూడు కంఠాల భూమిపై చట్టపరమైన హక్కును పొందారు. సుబేదార్ యాదవ్ తాత జగ్నారాయణ్ యాదవ్ 1967లో ఈ న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు. ఆ కేసులో జగ్నారాయణ్ ఫ్యామిలీలోని మూడు తరాలు పోరాడాయి. చివరగా జగ్నారాయణ్ మనవడు సుబేదార్ యాదవ్ హయాంలో ఈ కేసు చిక్కుముడి వీడింది. ఈ భూవివాదం ఔరంగాబాద్ సివిల్ కోర్టులో అత్యంత కాలం పాటు పెండింగ్‌లో ఉన్న కేసుగా నిలిచింది.

ఈ చారిత్రక కేసు 1967 ఆగస్టు 10న అప్పటి గయా జిల్లా కోర్టులో నమోదైంది. ఆ సమయంలో ఔరంగాబాద్ ప్రత్యేక జిల్లాగా కాకుండా గయాలో భాగంగా ఉండేది. తర్వాత ఔరంగాబాద్ కొత్త జిల్లాగా ఏర్పడినప్పుడు ఈ కేసును అక్కడికి బదిలీ చేశారు. ఈ కేసులో ప్రతివాది ముంగేశ్వర్ యాదవ్ 1967 డిసెంబర్ 9న మొదటిసారి ఔరంగాబాద్ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత కోసం జగ్నారాయణ్ యాదవ్ ఫ్యామిలీ మూడు తరాలుగా న్యాయం కోసం పోరాటం చేసింది. తాజాగా ఈ కేసుపై జులై 20 (సోమవారం)న ఔరంగాబాద్ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. సుబేదార్ యాదవ్‌కు అనుకూలంగా తుది తీర్పును వెలువరించింది.

'మాకు న్యాయం జరిగింది'
తన తాత జగ్నారాయణ్ యాదవ్ ఈ భూమి కోసం కేసు వేశారని, 59 ఏళ్ల తర్వాత తమ కుటుంబానికి న్యాయం జరిగిందని సుబేదార్ యాదవ్ పేర్కొన్నారు. తమకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. ఎట్టకేలకు తమకు న్యాయం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తన తాత హయాం నుంచే ఈ కేసు కోర్టులో నడుస్తోందని చెప్పారు. తన తాతే ఈ కేసును కోర్టులో వేశారని, కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేరని ఎమోషనల్ అయ్యారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, భూమిపై హక్కులు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఏమన్నారంటే?
ఈ దావా 3 కంఠాల విస్తీర్ణం కలిగిన (ఖాతా నం. 31, ప్లాట్ నం. 1488) వివాదాస్పద భూమిపై చట్టపరమైన హక్కుకు సంబంధించినదని సుబేదార్ యాదవ్ తరఫున న్యాయవాది రవికాంత్ వర్మ తెలిపారు. రాణి సయ్యదా ఖతూన్ జమీందారీ సెటిల్‌మెంట్ ప్రకారం తామే సరైన సాగుదారు అని జగ్నారాయణ్ యాదవ్, ముంగేశ్వర్ యాదవ్ ఇద్దరూ చెప్పకుంటూ వచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో జగ్నారాయణ్ 1946 జనవరి 25 నాటి స్కేల్ (ధరల లేదా వేతనాల నిర్ణయ ప్రాతిపదిక) ఆధారంగా వాదించగా, ముంగేశ్వర్ 1945 ఏప్రిల్ 21 నాటి స్కేల్ ఆధారంగా తన వాదనను వినిపించారని చెప్పారు. "ఈ భూవివాదానికి సంబంధించిన సాక్ష్యాలను నమోదు చేసే ప్రక్రియ 1972 మే 22న కోర్టులో ప్రారంభమైంది. ఈ సుదీర్ఘ న్యాయ ప్రక్రియలో పిటిషనర్ 12 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రతివాది తరఫున ఆరుగురు వ్యక్తులు తమ సాక్ష్యాలను నమోదు చేశారు. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఈ కేసులోని న్యాయపరమైన అంశాలను ఐదుసార్లు నిర్ధారించారు. తీర్పు సుబేదార్ యాదవ్‌కు అనుకూలంగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్ సివిల్ కోర్టు న్యాయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. " అని రవికాంత్ స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ తీర్పుపై ప్రతివాది తరఫు న్యాయవాది రాజేంద్ర యాదవ్ స్పందించారు. కోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పు కాపీని పొందేందుకు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఆ కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

సోల్జర్ టు స్నేక్ మ్యాన్- పాము కాటు నుంచి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న జస్వీర్

మందులు మర్చిపోయే బాధ తప్పింది!- విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ- స్మార్ట్ బాటిల్ 'PillSip' ప్రత్యేకతలివే