ETV Bharat / bharat

ఇరాన్​పై దాడులు- పశ్చిమాసియా గగనతలం మూసివేత- అన్ని విమాన సర్వీసులు రద్దు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగాన్ని తలపిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాలు తమ గగనతలాన్ని మూసేశాయి. ఫలితంగా మిడిల్ ఈస్ట్ గుండా వెళ్లే అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Israel Airspace Closure
Israel Airspace Closure (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : February 28, 2026 at 5:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Israel Airspace Closure: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మిస్సైళ్లతో విరుచుకపడుతున్నాయి. మరోవైపు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ రాకెట్ల వర్షం కురిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాంతంలో విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, టర్కీ సహా పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్, దోహా వంటి అంతర్జాతీయ విమాన విమానాశ్రయాల్లోనే భారీ సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు.

భారతీయ విమానయాన సంస్థలపై ప్రభావం

ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర దాడుల ప్రభావం భారతీయ విమానయాన సంస్థలపై పడింది. మధ్యప్రాచ్య దేశాలకు నడిచే అన్ని సర్వీసులను శనివారం అర్ధరాత్రి వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. "ఇరాన్, మధ్యప్రాచ్య గగనతలంలో విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో అటువేపు వెళ్లే, వచ్చే అన్ని విమానాలను రద్దు చేస్తున్నాం" అని ఇండిగో ట్వీట్ చేసింది. దీంతో దుబాయ్, జెడ్డా, దోహా, అబుదాబి, దమ్మామ్, బహ్రెయిన్, షార్జా, కువైట్, రస్ అల్-ఖైమా నగరాలకు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇండిగో స్పష్టం చేసింది.

మరోవైపు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పశ్చిమాసియా వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ఎయిర్ ఇండియా కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలోని అన్ని గమ్యస్థానాలకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. దిల్లీ నుంచి ఇజ్రాయెల్ (టెల్ అవీవ్) వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (AI139) గాలిలో ఉండగానే భద్రతా కారణాల దృష్ట్యా వెనక్కి మళ్లింది. దీన్ని ముంబైలో సురక్షితంగా పైలెట్లు ల్యాడ్ చేశారు. బోయింగ్ 777 విమానం గాలిలో సుమారు ఐదు గంటల పాటు ప్రయాణించింది. సౌదీ అరేబియా గగనతలంలో ఉన్న సమయంలో, ఇజ్రాయెల్ ఎయిర్‌స్పేస్ మూతపడటంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. దీనివల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. గగనతలాల మూసివేత కారణంగా అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విమానాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24.com కూడా వెల్లడించింది.

విదేశీ సర్వీసులు

ఖతార్ ఎయిర్‌వేస్ తమ గగనతలం మూసివేత వల్ల దోహాకు రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేసింది. దుబాయ్ కేంద్రంగా నడిచే పలు సర్వీసులు నిలిచిపోయాయని, ప్రయాణికులు తమ విమాన స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలని ఎమిరేట్స్ సూచించింది. లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్,జోర్డాన్ దేశాలకు సోమవారం వరకు విమానాలను నిలిపివేసినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. లండన్ నుంచి దుబాయ్‌కి వెళ్లే విమానాలను వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్​లైన్స్ రద్దు చేసింది. ఇరాక్ మీదుగా వెళ్లే మార్గాన్ని మళ్లించడం వల్ల భారత్, మాల్దీవులు, రియాద్, దుబాయ్ వెళ్లే విమాన ప్రయాణ సమయం మరింత పెరుగుతుందని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో దారి మళ్లించడానికి వీలుగా విమానాల్లో అదనపు ఇంధనాన్ని నింపుతున్నట్లు పేర్కొంది.

డచ్ విమానయాన సంస్థ కేఎల్ఎం ఆదివారం నుంచి టెల్ అవీవ్‌కు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధ వల్ల వేలమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. కొన్ని విమానయాన సంస్థలు విమాన మార్గాలను మళ్లించడం వల్ల ఇంధన ఖర్చులు పెరగడంతో పాటు, ప్రయాణ సమయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో రానున్న రోజుల్లో మరిన్ని విమాన సంస్థలు సర్వీసులను నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికుల కష్టాలు మరింత పెరగనున్నాయి.

కాంగ్రెస్ దేశ ప్రతిష్ఠను దిగజార్చుతోంది- ముస్లిం లీగ్​లా ద్వేషపూరిత రాజకీయాలు చేస్తోంది: ప్రధాని మోదీ

'విశ్వగురువుపై అమెరికా అంచనాకు వచ్చేసింది'- పాక్‌కు ట్రంప్ మద్దతుపై కాంగ్రెస్ విమర్శలు