ETV Bharat / bharat

ఆ ఊర్లో రాత్రి 7 గంటలకు సైరన్- వెంటనే టీవీలు, ఫోన్లు బంద్- స్టూడెంట్స్ చదువు కోసమేనట

రాత్రి 7 కాగానే ఆ గ్రామంలో టీవీలు, ఫోన్లు బంద్‌- 9 గంటల వరకు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారు- ఫోన్, టీవీకి బానిసై విద్యార్థుల చదువు దెబ్బతినకుండా చర్యలు

HOMEWORK SIREN MAHARASHTRA
7pm Study Siren in Maharashtra (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 6, 2026 at 9:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

7pm Study Siren in Maharashtra: రాత్రి ఏడు గంటలు అయ్యిందంటే చాలు ఆ ఊరిలో సైరన్ మోగుతుంది. వెంటనే ఊళ్లోని టీవీలన్నీ ఆగిపోతాయి. సెల్ ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్ అయిపోతాయి. పిల్లలంతా బుద్ధిగా కూర్చొని పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటారు. రాత్రి 9 గంటల వరకు ఇంతే పరిస్థితి. గ్రామంగా సైలెంట్​గా, ప్రశాంతంగా ఉంటుంది. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలోని నాగపుర్ గ్రామంలో కనిపించే దృశ్యమిది. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్లకు బానిసవుతున్న స్టూడెంట్స్
ప్రస్తుత సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉంటోంది. దీంతో చాలా మంది విద్యార్థులు మొబైల్ వ్యసనం కారణంగా సరిగ్గా చదవట్లేదు. ఎక్కువసేపు ఫోన్​లో సోషల్ మీడియా, యూట్యూబ్​ను చూస్తూ కాలం గడిపేస్తున్నారు. దీంతో వారి చదువు అటకెక్కుతోంది. ఇది విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. అందుకే బీద్ జిల్లాలోని నాగపుర్ గ్రామం దీనికి ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని కనుగొంది. సైరన్ ఫర్ స్టడీ చొరవను అమలు చేస్తోంది.

రాత్రి 7 గంటలకు గ్రామంలో సైరన్
నాగపుర్ గ్రామంలో ప్రతి రోజు రాత్రి 7 గంటలకు సైరన్ మోగుతుంది. అది మోగిన వెంటనే గ్రామంలోని ప్రతి ఇంట్లోని టీవీలను ఆపివేస్తారు. మొబైల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసేస్తారు. ఈ రెండు గంటల కాలం విద్యార్థులు చదువుకోవడానికి కేటాయిస్తారు. ఈ చొరవను గ్రామ డిప్యూటీ సర్పంచ్ సంతోశ్ సోలంకే ప్రతిపాదించారు. సాంగ్లీ జిల్లా మోహితే వడ్గావ్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని గ్రామస్థులు ఈ నిర్ణయాన్ని అమలు చేసి సక్సెస్ అయ్యారు.

"ఇది సోషల్ మీడియా యుగం. పిల్లలు ఫోన్లు, టీవీ వ్యసనం నుంచి బయటపడటం కష్టమని మేము భయపడ్డాం. పిల్లల చదువు గురించి సాంగ్లీ జిల్లాలోని మోహితే వడ్గావ్ గ్రామం చేసిన ప్రయోగం గురించి మేము విన్నాం. అదే ప్రయోగాన్ని మా గ్రామంలో అమలు చేయాలనుకున్నాం. అందుకే ముందుగా గ్రామస్థులతో మాట్లాడాను. ఇప్పుడు ఈ ప్రయోగానికి అద్భుతమైన స్పందన వచ్చింది. మేము మా గ్రామంలోని విద్యావంతులైన యువకులు, టీచర్స్​తో సమావేశం నిర్వహించాం. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఊరిలోని విద్యావంతులైన యువకులు, ఉపాధ్యాయులను పెట్రోలింగ్ స్క్వాడ్​లో భాగంగా చేశారు. ఈ స్క్వాడ్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థులు చదువుతున్నారో లేదో తనిఖీ చేస్తారు. ఈ ప్రయత్నం వేరే చోటికి పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటి వచ్చే, ఇంటి పనుల్లో బిజీగా ఉన్న తల్లిదండ్రులకు సహాయపడింది. ఈ నిర్ణయం వల్ల పిల్లల్ని చదవమని, హోం వర్క్స్ చేయమని తల్లిదండ్రులు వెంటపడాల్సిన అవసరం లేదు."
-సంతోశ్ సోలంకే, నాగ్​పుర్ గ్రామం డిప్యూటీ సర్పంచ్

సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
విద్యార్థులు చదువుకునే సమయాన్ని ఎటువంటి పరధ్యానం లేకుండా ఉంచడం సంతృప్తికరంగా ఉందన్నాడు గ్రామస్థుడు మోర్. ఇప్పుడు తన కుమారుడు ప్రతిరోజూ సైరన్ మోగకముందే పుస్తకాల ముందు కూర్చొంటున్నాడని తెలిపాడు. విద్యుత్తు అంతరాయం ఉన్నప్పటికీ కొవ్వొత్తి లేదా టార్చ్ లైట్ వెలుగులో పిల్లలందరూ తమ హోంవర్క్​ను శ్రద్ధగా చేస్తుండడాన్ని తాను చూస్తున్నానని పేర్కొన్నాడు. గతంలో వారు సెల్​ఫోన్​లతో గడిపేవారని, ఇప్పుడు పుస్తకాల పట్టుకుని కూర్చొంటున్నారని చెప్పాడు. రాత్రి సమయంలో రెండు గంటలు చదివి ఆ తర్వాత భోజనం చేస్తున్నారని అన్నాడు. మరోవైపు, తమ పిల్లలు ఇప్పుడు చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టారని మరొక గ్రామస్థుడు మనీశ్ సౌందాడే పేర్కొన్నారు. హోంవర్క్​ను త్వరగా పూర్తి చేసేస్తే మొబైల్ లేదా టీవీని చూడడానికి బదులుగా డ్రాయింగ్, ఇతర పుస్తకాలను పఠనం చేస్తున్నారని వెల్లడించాడు.

తమ గ్రామం తీసుకున్న చొరవకు ఆ ఊర్లోని టీచర్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "ఈ చొరవ కచ్చితంగా పిల్లలను క్రమశిక్షణలో పెట్టింది. గతంలో వారందరూ టీవీ స్క్రీన్​లకు అతుక్కుపోయి ఉండటం లేదా వారి తల్లిదండ్రుల సెల్​ఫోన్​లలో రీల్స్ చూడటంలో బిజీగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు." అని ఉపాధ్యాయుడు రాధాకృష్ణ పురుషోత్తం జోషి అన్నారు.

పొద్దున్న పాఠాలు- మధ్యాహ్నం వ్యవసాయం- నెలకు 2400 కిలోల వంకాయలు పండిస్తున్న ప్రొఫెసర్

దుప్పటి నుంచి లేవలేక కొత్త ఆవిష్కరణ! వాయిస్ కమాండ్‌తో ఫ్యాన్లు, లైట్లు బంద్- ఇంటికో 'స్మార్ట్ బ్రెయిన్'