ఏదో ఒకరోజు 'హిజాబ్' ధరించిన మహిళే ప్రధాని అవుతుంది- అసదుద్దీన్ ఒవైసీ
పాకిస్థాన్ రాజ్యాంగంలా మనది కాదు- అంబేడ్కర్ రాజ్యాంగం అందరికీ అవకాశం ఇస్తుందన్న ఎంఐఎం చీఫ్- ముందు మీ పార్టీ పగ్గాలు హిజాబ్ మహిళకు ఇవ్వగలరా అని బీజేపీ సవాల్

Published : January 10, 2026 at 4:49 PM IST
Owaisi Comments on Hijab: "ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ కచ్చితంగా భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుంది. ఇది నా కల" అని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని షోలాపుర్లో శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని, సమ్మిళితత్వాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎవరినైనా అత్యున్నత పదవిలో కూర్చోబెడుతుందని, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రధాని కావచ్చని ఆయన ఉద్ఘాటించారు. అయితే ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పాకిస్థాన్‌తో పోలిక
ఒవైసీ తన ప్రసంగంలో పొరుగు దేశం పాకిస్థాన్ రాజ్యాంగంతో భారత రాజ్యాంగాన్ని పోల్చి మాట్లాడారు. "పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం, కేవలం ఒక మతానికి చెందిన వ్యక్తి మాత్రమే ఆ దేశానికి ప్రధాని కాగలరు. కానీ అంబేడ్కర్ రాసిన మన రాజ్యాంగం అలా కాదు. భారతదేశంలో ఏ పౌరుడైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చు. అందుకే ఏదో ఒక రోజు హిజాబ్ కట్టుకున్న మా ఆడబిడ్డ ఈ దేశానికి ప్రధాని అవుతుందని నేను నమ్ముతున్నాను" అని ఒవైసీ అన్నారు.
ప్రేమ గెలుస్తుంది
ముస్లింలపై జరుగుతున్న విద్వేష ప్రచారంపైనా ఒవైసీ స్పందించారు. "ముస్లింలపై మీరు చిమ్ముతున్న విషం ఎక్కువ కాలం సాగదు. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారి అంతం త్వరలోనే చూస్తాం. ఏదో ఒక రోజు ప్రేమ సాధారణమవుతుంది. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, తమ మెదళ్లను ఎలా విషపూరితం చేశారో వారు గ్రహిస్తారు" అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌పైనా ఫైర్
ఇదే సభలో మాజీ కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం, కాంగ్రెస్ పార్టీపై కూడా ఒవైసీ విరుచుకుపడ్డారు. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ రాకపోవడానికి కాంగ్రెస్ తెచ్చిన చట్టాలే కారణమని ఆరోపించారు. "కాంగ్రెస్ హయాంలోనే యుఏపీఏ చట్టాన్ని కఠినతరం చేశారు. ఉగ్రవాదం నిర్వచనాన్ని మార్చింది మీరే. ఆనాడు నేను చెప్పాను, ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని హెచ్చరించాను. ఈరోజు అదే చట్టం వల్ల ఇద్దరు యువకులు ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్నారు. వారికి బెయిల్ రావడం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడైనా ఐదేళ్లు జైల్లో ఉన్నారా?" అని ప్రశ్నించారు.
హిమంత కౌంటర్
ఒవైసీ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తనదైన శైలిలో స్పందించారు."రాజ్యాంగపరంగా ఎవరికీ అడ్డంకి లేదు. ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశం హిందూ నాగరికత కలిగిన దేశం. మేము ఎప్పుడూ ఒకటే నమ్ముతాం. భారత ప్రధానమంత్రి ఎప్పుడూ ఒక హిందువే అయి ఉంటారు. దీనిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది" అని హిమంత బిశ్వ శర్మ తేల్చిచెప్పారు.
మీ పార్టీ అధ్యక్షురాలిని చేయగలరా? - బీజేపీ
ఒవైసీ వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా గట్టి కౌంటర్ ఇచ్చారు. "రాజ్యాంగం ఎవరినీ అడ్డుకోదు. హిజాబ్ ధరించిన వారు కూడా ప్రధాని కావొచ్చు. కానీ మియాన్ ఒవైసీ, మీకు నేను ఒక సవాల్ విసురుతున్నా. ముందుగా ఒక 'పస్మాండా' ముస్లిం మహిళను లేదా హిజాబ్ ధరించిన మహిళను మీ పార్టీ అధ్యక్షురాలిగా చేయండి. దేశం గురించి తర్వాత మాట్లాడుదురు గాని, ముందు మీ పార్టీలో ఆ పని చేసి చూపించండి" అని 'ఎక్స్' వేదికగా ఎద్దేవా చేశారు.
పీఎం పోస్ట్ ఖాళీ లేదు - శివసేన
శివసేన అధికార ప్రతినిధి షైనా ఎన్‌సీ కూడా ఒవైసీకి చురకలు అంటించారు. "ప్రస్తుతానికి ప్రధానమంత్రి కుర్చీ ఖాళీగా లేదు. నరేంద్ర మోదీ ప్రజాదరణ ఏంటో అందరికీ తెలుసు. ముందు మీ ఎంపీలను గెలిపించుకోండి. ఆ తర్వాత ప్రధాని పదవి గురించి కలలు కనండి. భవిష్యత్తులో మహిళా ప్రధానిని మేము కూడా కోరుకుంటాం. కానీ అది కులం, మతం, వస్త్రధారణ ఆధారంగా కాదు, కేవలం ప్రతిభ ఆధారంగా ఉండాలి" అని ఆమె స్పష్టం చేశారు.

