డిజిటల్ యుగంలో దేశీ సారంగి- అంతరించిపోతున్న వాద్యానికి జీవంపోస్తున్న రాంపాల్
భారత పురాతన జానపద, సంప్రదాయ వాద్యమైన సారంగి ఉనికిని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు రాంపాల్. ఈ సంప్రదాయ సంగీతాన్ని గత మూడు దశాబ్దాలుగా దిల్లీలో నిరంతరాయంగా వినిపిస్తున్నారు.

Published : October 9, 2026 at 8:27 AM IST
Traditional Sarangi Artist Delhi : నేటి కాలంలో ఎక్కడచూసినా చేతిలో స్మార్ట్ ఫోన్లు, చెవిలో ఇయర్ బర్డ్స్‌తో యువత ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. కానీ దేశ రాజధాని దిల్లీలో సంప్రదాయ సంగీత కళకు మళ్లీ జీవం పోస్తున్నారు ఓ కళాకారుడు. డిజిటల్ సంగీతం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, భారత పురాతన జానపద, సంప్రదాయ వాద్యమైన సారంగి ఉనికిని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన పట్టుదల, శ్రమ, కళపై ఉన్న అపారమైన ప్రేమే ఈ రోజుకీ దిల్లీ నడిబొడ్డున ఈ మధురమైన సంప్రదాయ ధ్వనిని నలుగురూ వినేలా చేసింది.
ప్రసిద్ధ దిల్లీ హాట్ ప్రాంతం భారతీయుల సంస్కృతి, రంగురంగుల హస్తకళలు, నోరూరించే వివిధ రాష్ట్రాల వంటకాలు, సాంస్కృతిక వారసత్వానికి నిలయంగా ఉంది. రోజూ దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. అంతటి జనసందడి మధ్య, మట్టి కుండలు, వెదురు, ఒకే ఒక తీగ సాయంతో వినిపించే మధురమైన రాగం పర్యటకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఆ సుమధురమైన ధ్వనే మన సంప్రదాయ సారంగి వాద్యం. ఈ అద్భుతమైన సంప్రదాయ సంగీతాన్ని గత మూడు దశాబ్దాలుగా 1996 నుంచి దిల్లీ హాట్‌లో నిరంతరాయంగా వినిపిస్తున్నారు కళాకారుడు రాంపాల్. ఆధునిక యుగంలో అంతరించిపోతున్న ఈ సారంగిలను స్వయంగా తానే తయారుచేసి వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా తన జీవితంలోని కొన్ని ముఖ్య అంశాల గురించి రాంపాల్ 'ఈటీవీ భారత్'కు వివరించారు.

"నా చిన్నతనంలో నా తండ్రి ఊరూరా తిరుగుతూ ఈ సారంగిని వాయిస్తూ, అమ్ముతుండేవారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ వంటి నగరాల్లో వీధుల్లో తిరుగుతూ సారంగి వాయించి వాటిని విక్రయించేవారు. ఆ సమయంలో మా తండ్రితో కలిసి తిరుగుతూ, ఆయనకు చేదోడువాదోడుగా ఉండేవాడిని. అలా 1978 నుంచి 1984 మధ్యలో ఈ సారంగిని తయారు చేయడం, వాయించడం నేర్చుకున్నా. 1984లో మా నాన్న అకస్మాత్తుగా చనిపోయారు. అనంతరం నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ వాద్యం ఎంతో ఉపయోగపడింది. 1996లో దిల్లీ హాట్‌కు వచ్చి నా కళను ప్రదర్శిస్తూ, సారంగిలను విక్రయిస్తున్నా. ఈ విషయంలో నా కుటుంబం కూడా ఎంతో తోడ్పాటును అందించింది."
- రాంపాల్, సారంగి వాద్య కారుడు
సారంగీలను తానే తయారు చేస్తూ
రాంపాల్ కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన వస్తు శిల్పి. వెదురు చెక్కను చేత్తో మలిచి, దానికి తీగలను అమర్చి తానే స్వయంగా ఈ సారంగిని తయారు చేస్తారు రాంపాల్. మొదట మార్కెట్ నుంచి వెదురును తీసుకువచ్చి, దాన్ని సారంగికి కావలసిన ఆకారంలో కత్తిరిస్తారు. అనంతరం వెదురు కింది భాగంలో ఒక చిన్న మట్టి కుండను అమర్చుతారు. ఆ తర్వాత ప్రత్యేకమైన వైర్ (తీగ), పేపర్, బెత్తంతో చేసిన బలమైన దారాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక, దానిపై ఉన్న జిగురు లేదా నునుపుదనం పోవడానికి డిటర్జెంట్‌తో బాగా శుభ్రం చేస్తారు. ఆపై ఖరీదైన వయలిన్ వాద్యాల్లో ఉపయోగించే 'రెజిన్' (Resin) ను దీనిపై పూస్తారు. దీని వల్ల విల్లును తీగపై రుద్దినప్పుడు సరైన, మధురమైన స్వరం వినిపిస్తుంది. తన బాల్యంలో కేవలం 10 పైసలు లేదా 50 పైసలకు లభించే ఈ చిన్న సారంగి, ప్రస్తుతం దీని ధర రూ.300 నుంచి రూ.1500 వరకు అందుబాటులో ఉంది. దిల్లీ హాట్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు ఈ మధురమైన సారంగి ధ్వనికి ముగ్ధులై, వాటిని ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు.

దిల్లీ హాట్‌లో రాంపాల్ వినిపించే మధురమైన పాటల సారంగిపై వాయిస్తుంటే, అటువైపుగా వెళ్లే ప్రతి ఒక్కరూ ఆగి వినకుండా ఉండలేరు. ఆ వాద్యాన్ని విన్న ఎంతో మంది తమ బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనవుతుంటారు. రాంపాల్ వాద్యాన్ని ఎంతో మంది ప్రముఖులు ఆయన ప్రతిభను ప్రశంసించారు. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ దిల్లీ హాట్‌ను సందర్శించినప్పుడు రాంపాల్ సారంగిని విన్నారు. అంతే కాదు, సారంగి వాద్యంతో తన బాల్యాన్ని గుర్తు చేశారని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. రాంపాల్‌కు ఒక బహుమతి ఇచ్చి, ఆయన వద్ద ఒక సారంగిని కూడా కొనుగోలు చేశారు. ఆమెతో పాటు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, అరుణ్ జైట్లీ, దిల్లీ టూరిజం ఎండీ, లండన్ టూరిజంకు చెందిన ఒక సభ్యుడు రాంపాల్ దుకాణాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు రాంపాల్ దుకాణంలో ఉంచారు. అంతేకాదు, తన కళను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి, రాంపాల్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఒడిశా, కాఠ్‌గోడం, వెల్లూరు, తమిళనాడు, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాలను సందర్శించి తన సారంగి వాద్యాన్ని వినిపించారు.
ఈ జానపద కళను ఫ్రీగా నేర్పిస్తారంట!
ఎదైనా నేర్చుకోవాలంటే డబ్బులు వెచ్చించే ఈ రోజుల్లో ఈ జానపద కళను ఉచితంగా నేర్పడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు రాంపాల్. 'నేను ఉన్నా లేకపోయినా ఈ సారంగి, ఈ కళ ఎవరో ఒకరి చేతుల్లో సజీవంగా ఉండాలి. ఈ కళ అంతరించిపోకూడదు. ప్రజలు దీనిని నేర్చుకుంటే, వారు ఈనాటి కొత్త సంగీత వాద్యాలను కూడా మరచిపోతారు. ఈ సారంగి కేవలం చెక్క, తీగలతో చేసిన ఒక నిర్మాణం మాత్రమే కాదు, ఇది అంతరించిపోతున్న మన సాంస్కృతిక వారసత్వానికి ఒక సజీవ ఉదాహరణ' అని చెబుతున్నారు. తనకు డబ్బు మీద అత్యాశ లేదని రాంపాల్ చెప్పారు. 'చేతికళ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. అంతేకాదు, నైపుణ్యం ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఆకలితో అలమటించరు' అని రాంపాల్ అంటున్నారు.
'ఇండియాకు అసలు బాస్ అంబానీనా?'- మస్క్ సంచలన పోస్ట్- మరో వ్యక్తిని కనిపెట్టమని రాహుల్ రిప్లై!
రియాద్‌పై హూతీల దాడులు- విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్- పౌరులకు అడ్వైజరీ జారీ

