ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై భారత్ వెనక్కి తగ్గదు- వారికి ఆశ్రయం లేకుండా చూడాలి'- BIMSTEC దేశాలకు అమిత్​షా పిలుపు

ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఎక్కడా ఆశ్రయం లేకుండా చూడాలని BIMSTEC దేశాలకు పిలుపునిచ్చారు.

Amit Shah BIMSTEC
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : October 13, 2026 at 4:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Amit Shah BIMSTEC : ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. BIMSTEC దేశాల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం దొరకకుండా సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను దాచడం, వారికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు ఈ ప్రాంతంలో ఎలాంటి అవకాశం ఉండకూడదని చెప్పారు.

దిల్లీలో మంగళవారం జరిగిన తొలి బిమ్‌స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. సభ్య దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం ఉంటేనే ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయగలమని తెలిపారు. ఒక దేశ భద్రతా వ్యవస్థ మరో దేశ భద్రతకు కూడా ఉపయోగపడేలా పనిచేయాలని సూచించారు. ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో అన్ని దేశాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని చెప్పారు.

ఉగ్రవాదులకు ఎక్కడా ఆశ్రయం ఉండకూడదు
ఉగ్రవాదులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి దాక్కోవడం, అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, కొత్తవారిని నియమించుకోవడం, శిక్షణ ఇవ్వడం వంటి వాటిని అడ్డుకోవాలని అమిత్ షా అన్నారు. పొరుగు దేశాలపై దాడులకు ప్రణాళికలు వేయడం, వాటి కోసం వనరులను సమకూర్చుకోవడం వంటి చర్యలకు కూడా అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఒక దేశానికే పరిమితమైన సమస్య కాదని, దాని ప్రభావం అనేక దేశాలపై ఉంటుందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

అందువల్ల ప్రతి దేశం తన భద్రతను మాత్రమే కాకుండా, ఇతర సభ్య దేశాల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉగ్రవాదులను, వారి సహాయకులను గుర్తించేందుకు సభ్య దేశాల మధ్య సమాచార మార్పిడి పెరగాలని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదుల వివరాలు, వారికి సహకరించే వ్యక్తులు, నేర ముఠాలు, వారి ఆర్థిక లావాదేవీలు, సరిహద్దులు దాటి జరిగే కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో పంచుకోవాలని సూచించారు. ఇప్పటికే ఉన్న సంబంధిత సంస్థల ద్వారా ఈ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఉగ్రవాదంపై పోరును మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.

నిధుల సరఫరాను అడ్డుకోవాలి
ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంతోపాటు, దానికి అందుతున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడం కూడా ముఖ్యమని అమిత్ షా పేర్కొన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే మార్గాలను గుర్తించి, వాటిని అడ్డుకోవాలని సభ్య దేశాలకు సూచించారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలపై కూడా కలిసి చర్యలు తీసుకోవాలని చెప్పారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను చట్టం ముందు నిలబెట్టేందుకు సభ్య దేశాలు పరస్పరం సహకరించుకోవాలని అన్నారు. ఆయా దేశాల చట్టాలు, కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా న్యాయపరమైన సహాయం అందించుకోవడం, నిందితులను అప్పగించే విషయంలో సహకరించడం అవసరమని వివరించారు. ఇలాంటి చర్యల వల్ల నేరగాళ్లను పట్టుకోవడం సులభమవుతుందని తెలిపారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరో పెద్ద సమస్యగా మారిందని అమిత్ షా చెప్పారు. ఈ అక్రమ రవాణాను ఒక్క దేశం మాత్రమే అడ్డుకోలేదని, అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు నేర ముఠాలకు బలాన్ని ఇస్తోందని, అదే డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే రసాయనాలను అక్రమంగా మళ్లించడం, డార్క్ వెబ్ ద్వారా లావాదేవీలు జరపడం వంటి చర్యల వల్ల ఈ సమస్య మరింత క్లిష్టంగా మారుతోందని చెప్పారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఒక్కో దేశం విడివిడిగా ప్రయత్నించడం కాకుండా, మొత్తం ప్రాంతం ఒకటిగా భావించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉగ్రవాదం, నేర ముఠాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు.

ఏమిటీ BIMSTEC?
BIMSTEC అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచడం ఈ కూటమి ప్రధాన లక్ష్యం. భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలను కలిపే ఈ ప్రాంతంలో సుమారు 170 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాలో దాదాపు 22 శాతం. ఈ దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి సుమారు 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి బిమ్‌స్టెక్ హోంమంత్రుల సమావేశం ప్రాంతీయ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది.

'ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించుకునే హక్కును వినియోగిస్తాం'- పాక్​కు భారత్‌ ఘాటు హెచ్చరిక

'ఉగ్రవాదం, డ్రామాలతో అప్పులు తీరవు'- ఐరాస వేదికపై పాకిస్థాన్‌ తీరును ఎండగట్టిన భారత్