ETV Bharat / bharat

'విశ్వగురువుపై అమెరికా అంచనాకు వచ్చేసింది'- పాక్‌కు ట్రంప్ మద్దతుపై కాంగ్రెస్ విమర్శలు

ఏకపక్ష ట్రేడ్ డీల్‌కు మోదీ సర్కారు తల ఊపింది- భారత్ ఆర్థిక దౌత్యం ఫెయిలైన పర్యవసానమిది భారత్‌కు ట్రంప్ వరుస షాక్‌లు ఇస్తున్నారు- కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్

Congress On Trump Pak Comments
Congress MP Jairam Ramesh (ANI File Photo)
author img

By ETV Bharat Telugu Team

Published : February 28, 2026 at 11:21 AM IST

3 Min Read
Choose ETV Bharat

Congress On Trump Pak Comments : అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతును ప్రకటించడం అనేది ప్రధాని మోదీ కౌగిలింతల దౌత్యానికి (హగ్లోమసీ) భారీ ఎదురుదెబ్బ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. స్వయం ప్రకటిత విశ్వగురువుపై అమెరికా పూర్తి అంచనాకు వచ్చిందంటూ పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు చేసింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇంఛార్జి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఒక వ్యక్తి (పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్) చేసిన వ్యాఖ్యల వల్లే 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే వ్యక్తిని ఆకాశానికి ఎత్తుతూ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరమని ఆయన తెలిపారు. పాక్‌కు ఈవిధంగా అమెరికా మద్దతు లభిస్తుండటం అనేది, భారత సర్కారు హగ్లోమసీ విఫలమైందని నిరూపిస్తోందని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.

డొనాల్డ్ ట్రంప్ వరుస షాక్‌లు ఇస్తున్నారు
"భారతదేశ వ్యూహాత్మక దౌత్యానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఆయన పదేపదే పాకిస్థాన్‌కు మద్దతును ప్రకటిస్తున్నారు. పాక్‌కు వంతపాడుతూ వ్యాఖ్యలను చేస్తున్నారు. భారత్, పాకిస్థాన్‌లను ఒకేగాటన కట్టి మాట్లాడేందుకు ట్రంప్ యత్నిస్తున్నారు. భారత ప్రధాని మోదీ తన పరిచయాలు, ప్రభావంతో అవార్డులను పొందొచ్చు కానీ, వాస్తవమేంటో అందరికీ తెలిసిపోయింది. స్వయం ప్రకటిత విశ్వగురువుపై ప్రపంచం అసలు అంచనాకు వచ్చేసింది. ప్రత్యేకించి అమెరికా, ఈవిషయంలో ఫుల్ క్లారిటీకి వచ్చింది" అని జైరాం రమేశ్ కామెంట్స్ చేశారు.

ఏకపక్ష ట్రేడ్ డీల్‌కు మోదీ సర్కారు తల ఊపింది
"అమెరికాతో భారత ప్రభుత్వం ఆర్థిక దౌత్యం కూడా తీవ్రంగా విఫలమైంది. అందుకే ఏకపక్షంగా అమెరికా డిసైడ్ చేసిన వాణిజ్య ఒప్పందానికి మోదీ సర్కారు తల ఊపాల్సి వచ్చింది. ఇందులో అమెరికాకు భారత్ పెద్దపెద్ద హామీలను ఇచ్చింది. ప్రత్యేకించి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటామని మోదీ సర్కారు మాట ఇచ్చింది. ఇక ఇదే సమయంలో భారత్ నుంచి వస్తు,సేవలను దిగుమతి చేసుకునే విషయంలో అమెరికా అరకొర హామీలనే ఇచ్చింది. ఈ ట్రేడ్ డీల్ ఖరారైన మరుసటి రోజే, భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన సోలార్ మాడ్యూల్స్‌పై అమెరికా ఏకంగా 125.87 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది" అని జైరాం రమేశ్ ఆరోపించారు.

పాక్‌పై ట్రంప్ తాజా ప్రశంసలివీ
గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి నుంచి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న భీకర సైనిక ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు మీరు ప్రయత్నిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రై చేస్తానన్నారు. కానీ తాను పాకిస్థాన్ పక్షాన నిలుస్తానని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు గొప్ప ప్రధానమంత్రి, గొప్ప ఆర్మీ చీఫ్ ఉన్నారని ట్రంప్ కొనియాడారు. వాళ్లిద్దరినీ తాను నిజంగా గౌరవిస్తానని తేల్చి చెప్పారు. పాక్‌లో షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌ చాలా బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

పాకిస్థాన్ VS అఫ్గానిస్థాన్‌ వార్
ఫిబ్రవరి 22న అఫ్గానిస్థాన్‌లోని నాన్ గర్హర్, పక్‌టీకా ప్రావిన్స్‌లపై పాక్ వైమానిక దాడులు చేసింది. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని అప్పట్లో అఫ్గానిస్థాన్‌ సైన్యం ప్రకటించింది. చెప్పినట్టుగానే, ఫిబ్రవరి 26న (గురువారం) రాత్రి తాలిబన్ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. 19 పాక్ ఆర్మీ పోస్టులను దహనం చేసి, 55 మంది పాక్ సైనికులను హతమార్చామని తాలిబన్లు ప్రకటించారు. ఈ ఎటాక్‌‌కు తక్షణ స్పందనగా గురువారం అర్ధరాత్రి అఫ్గానిస్థాన్‌లోని కాబూల్, కాందహార్, పక్టియాలలోని తాలిబన్ సైనిక స్థావరాలపై బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో 133 మంది తాలిబన్లు హతం కాగా, 200 మందికి గాయాలయ్యాయని పాక్ వెల్లడించింది.