ETV Bharat / bharat

యూపీలో ఓటర్ల జాబితా కలకలం- బీజేపీ 'దొంగ ఓట్ల' మిషన్ అంటూ అఖిలేశ్ సంచలన ఆరోపణలు!

2.89 కోట్ల ఓట్ల తొలగింపు వెనుక భారీ కుట్ర- ఖాళీ అయిన స్థానాల్లో బోగస్ ఓట్ల కోసం అధికారులపై ఒత్తిడి- 'పీడీఏ ప్రహరీ'తో అడ్డుకుంటాం- ఎఫ్ఐఆర్లు తప్పవని హెచ్చరిక

Akhilesh Accuses BJP
Akhilesh Accuses BJP (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 9:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

Akhilesh Accuses BJP: "భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక కొత్త మిషన్‌ను చేపట్టింది. అదే 'దొంగ ఓట్ల' మిషన్. రాష్ట్రంలో ఓటర్ల సవరణ సాకుతో 2.89 కోట్ల ఓట్లు జాబితా నుంచి తొలగిపోవడంతో, ఆ ఖాళీని తమకు అనుకూలమైన బోగస్ ఓట్లతో నింపాలని ఆ పార్టీ చూస్తోంది" అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాలో భారీ కోత విధించడంపై ఆయన గురువారం లక్నో లో తీవ్రంగా స్పందించారు. ఓటర్ల సంఖ్యను పెంచాలంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన మండిపడ్డారు.

అధికారులను భయపెడుతున్నారు
అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశంలో అధికార పార్టీ తీరును ఎండగట్టారు. "రాష్ట్రంలో చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ఫలితాలు చూసి బీజేపీ నేతలు వణికిపోతున్నారు. మొదటిసారిగా అధికార పార్టీ నేతల్లో ఇంత భయం చూస్తున్నాం. సుమారు 3 కోట్ల ఓట్లు తగ్గిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అధికారులను పిలిపించుకుని మరీ బెదిరిస్తున్నారు. ఎలాగైనా సరే ఓటర్ల సంఖ్యను పెంచాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దొంగ ఓట్లను సృష్టించే భారీ కుట్ర జరుగుతోంది" అని అఖిలేష్ ధ్వజమెత్తారు.

పీడీఏ ప్రహరీ నిఘా, ఎఫ్ఐఆర్లు తప్పవు
బీజేపీ కుట్రలను అడ్డుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అఖిలేష్ స్పష్టం చేశారు. "మా పార్టీకి చెందిన 'పీడీఏ ప్రహరీ' బృందాలు ఇకపై డేగకన్నుతో నిఘా ఉంచుతాయి. ఎవరైనా బీజేపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తే, వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అధికారులు కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఒత్తిళ్లకు లొంగవద్దు. ప్రజలు బీజేపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. వెంటనే బూత్ స్థాయికి వెళ్లి ముసాయిదా జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అసలు ఓట్లు ఎందుకు పోయాయి?
అఖిలేష్ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా మంగళవారం విడుదల చేసిన గణాంకాలు చర్చనీయాంశమయ్యాయి. అక్టోబర్ 27, 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం 15.44 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయగా, కేవలం 12.55 కోట్ల మంది మాత్రమే ఫారాలు పూర్తి చేసి ఇచ్చారు. అంటే మిగిలిన వారి వివరాలు క్షేత్రస్థాయిలో లభ్యం కాలేదు. ఈ క్రమంలోనే మొత్తం 2.89 కోట్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు.

మూడు ప్రధాన కారణాలు ఇవే
ఇంత భారీగా ఓట్లు తొలగించడానికి గల కారణాలను ఎన్నికల సంఘం వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా 46.23 లక్షల మంది ఓటర్లు చనిపోయారు. వారి పేర్లను తొలగించారు. దాదాపు 2.17 కోట్ల మంది ఓటర్లు తమ ఇళ్లు మారారు. లేదా ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. అధికారులు వెళ్లినప్పుడు వారు ఆ చిరునామాలో లేరు. లేదా ఇళ్లు ఖాళీ చేసి శాశ్వతంగా వెళ్లిపోయారు. సుమారు 25.47 లక్షల మంది పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదయ్యాయి. ఈ డూప్లికేట్ ఓట్లను ఏరివేశారు.

మళ్లీ అవకాశం ఉంది
జాబితాలో పేర్లు గల్లంతైన వారికి, కొత్త వారికి ఎన్నికల సంఘం మరో ఛాన్స్ ఇచ్చింది. జనవరి 6, 2026 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఎవరైనా తమ పేరు లేదని భావిస్తే దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. అనర్హుల పేర్లు ఉంటే తొలగించాలని ఫిర్యాదు చేయవచ్చు. ఫిబ్రవరి 27 నాటికి ఈ దరఖాస్తులన్నింటినీ అధికారులు పరిశీలిస్తారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 403 మంది ఈఆర్ఓలు, 2042 మంది ఏఈఆర్ఓలు అందుబాటులో ఉంటారు.