ETV Bharat / bharat

''ప్రమాదమా? కుట్రనా? దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి'- అజిత్ మృతిపై రోహిత్ పవార్​ అనుమానాలు

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేసిన ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్- ఈ ప్రమాదంపై బహుళ నిపుణుల సంస్థలతో సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్

rohit pawar on ajit pawar death
rohit pawar on ajit pawar death (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 10, 2026 at 9:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rohit Pawar on Ajit Pawar Death : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు జరిగిన విమాన ప్రమాదంపై ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై బహుళ నిపుణుల సంస్థలతో సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు.

పలు అనుమానాలు వ్యక్తం చేసిన రోహిత్
దుర్ఘటన జరిగిన రోజు (జనవరి 28న) విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ ట్రాక్ రికార్డ్‌ను రోహిత్ పవార్ ప్రశ్నించారు. గతంలో మద్యం సేవించినందుకు సుమిత్‌ను మూడేళ్లు సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి నేర పరిశోధన విభాగం (సీఐడీ)కి పూర్తి అధికారం ఉండదని వెల్లడించారు. జాతీయ రవాణా భద్రతా బోర్డు, బ్యూరో ఆఫ్ ఎంక్వైరీ అండ్ అనాలిసిస్ ఫర్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ, యూకే-ఆధారిత ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఏఏఐబీ), భారతీయ ఏజెన్సీలతో సహా బహుళ నిపుణుల సంస్థలతో సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏఏఐబీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కింద పనిచేస్తుందని, అందుకే ఈ ప్రమాదంపై ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేయకపోవచ్చన్నారు.

"అజిత్ పవార్ ప్రయాణించిన లియర్‌జెట్ విమానం వీఎస్ఆర్ కంపెనీది. ఆ సంస్థ డీజీసీఏ అధికారులపై ప్రభావం చూపింది. ఆ కంపెనీ ఎలాగైనా తప్పించుకోలగలదు. 2023లో జరిగిన లియర్‌జెట్ విమానానికి జరిగిన ప్రమాదంపై తుది దర్యాప్తు నివేదికను ఇప్పటికే సమర్పించారు. ఆ కంపెనీ విమాన నిర్వహణ లైసెన్స్‌ను ఎందుకు ఎప్పుడూ రద్దు చేయలేదు. ఇప్పటికీ ఆ కంపెనీ విమానాలను ఉన్నతస్థాయి రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నారు. వీఎస్ఆర్ కంపెనీ అధికారులపై నేరపూరిత హత్య కేసు నమోదు చేయాలి"
-- రోహిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే


అలాగే విమాన ప్రమాదానికి దారితీసిన ఘటనల క్రమం గురించి రోహిత్ పవార్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ల్యాండింగ్‌కు ముందు విమానం ట్రాన్స్‌పాండర్‌ను ఉద్దేశపూర్వకంగా స్విచ్ ఆఫ్ చేశారా? అని అనుమానం వ్యక్తం చేశారు. పైలట్లు సాహిల్ మదన్, యష్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారని చెప్పారు. "వారి స్థానంలో సుమిత్ కపూర్, శాంభవి పాఠక్ విమానాశ్రయానికి ఎలా చేరుకున్నారు? వారు ఎయిర్‌పోర్ట్ సమీపంలోనే నివసిస్తున్నారా? విమానం వంగి ఉన్నప్పుడు సుమిత్ కపూర్ మౌనంగా ఉన్నారు. దృశ్యమానత సమస్యలు ఉన్నప్పటికీ అతను ఎందుకు విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు? విమానంలో అక్రమ అదనపు ఇంధన ట్యాంకులు ఉన్నాయో లేదో ధ్రువీకరించడానికి గతంలో లియర్‌జెట్ విమానాల ల్యాండింగ్‌ల సీసీటీవీ ఫుటేజ్‌లను బయటపెట్టాలి." అని రోహిత్ పవార్ తెలిపారు.

ఈ ప్రమాదం కుట్రలో భాగం కావొచ్చు : రోహిత్ పవార్
"అజిత్ పవార్ విమాన ప్రమాదం కుట్రలో భాగం కావచ్చు. ఈ విమాన ప్రమాదం గురించి మేము కొన్ని విషయాలను పరిశోధించాం. మీరు ఒక వ్యక్తిని చంపాలనుకుంటే, ఆ వ్యక్తి డ్రైవర్‌ను చంపడమే సులభమైన మార్గమని ఓ బుక్‌లో ఉంది. అజిత్ పవార్ జనవరి 27 (ప్రమాదానికి ముందురోజు) సాయంత్రం క్యాబినెట్ సమావేశం తర్వాత పుణెకు వెళ్లాల్సి ఉంది. ఆయన కాన్వాయ్ సిద్ధంగా ఉంది. అజిత్ పవార్ అధికారిక నివాసమైన దేవగిరి బంగ్లా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను చూస్తే ఈ విషయం తెలుస్తుంది. అయితే తూర్పు విదర్భకు చెందిన ఒక నాయకుడు అజిత్‌తో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ఆలస్యమైంది. దీంతో విమానం బుకింగ్ రాత్రి ఆలస్యంగా జరిగింది. అజిత్‌ దాదా మరుసటి నాడు (జనవరి 28న) ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయినప్పటికీ విమానం ఉదయం 8.10 గంటలకు బయలుదేరింది. " అని రోహిత్ పవార్ పేర్కొన్నారు.

జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్‌ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది విదీప్‌ జాదవ్‌, పింకీ మాలీ, పైలట్‌ ఇన్‌ కమాండ్‌ సుమిత్‌ కపూర్‌, ఫస్ట్ ఆఫీసర్‌ శాంభవి పాఠక్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని, దీన్ని రాజకీయం చేయొద్దని అజిత్ బాబాయ్ శరద్ పవార్ విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా అజిత్ మరణంపై ఆయన సోదరుడి కుమారుడు రోహిత్ పవార్ అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.