డూప్లికేట్ సిమ్‌కు రూ.650 వసూల్- కట్ చేస్తే ఎయిర్‌టెల్ ఏజెంట్‌కు బిగ్ షాక్- రూ.40వేలు చెల్లించాలని ఆదేశం
డూప్లికేట్ సిమ్‌కు అసలు ఛార్జీ రూ.50 మాత్రమే- కస్టమర్ నుంచి రూ.650 వసూలు చేసిన ఏజెంట్- రూ.600 అదనంగా వసూలు చేసినట్లు ఫిర్యాదు- వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు

Published : August 31, 2026 at 2:22 PM IST
Airtel Duplicate Sim Extra Charge Case : మొబైల్ ఫోన్ పోయిందని డూప్లికేట్ సిమ్ కోసం వెళ్లిన ఓ మహిళ నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఎయిర్‌టెల్ ఏజెంట్‌కు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. డూప్లికేట్ సిమ్ కోసం నిర్ణయించిన ఛార్జీ కంటే అదనంగా రూ.600 వసూలు చేసినందుకు కస్టమర్‌కు ఆ మొత్తాన్ని వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అంతే కాదు, సేవల్లో లోపం, మానసిక వేదనకు రూ.25 వేల పరిహారం, న్యాయ ఖర్చుల కింద మరో రూ.15 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో మొత్తం పరిహారం రూ.40 వేలకు చేరింది. అసలేం జరిగిందంటే?
తమిళనాడులోని చెంగల్పట్టులో నివాసం ఉంటున్న సరిత అనే మహిళకు చెందిన మొబైల్ ఫోన్ ఆగస్టు 21వ తేదీన పోయింది. దీంతో తాను వినియోగిస్తున్న మొబైల్ నెంబర్‌ను తిరిగి పొందేందుకు డూప్లికేట్ సిమ్ తీసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకు గాను మరుసటి రోజు చెంగల్పట్టులోని మణి మార్కెటింగ్ షోరూమ్‌కు వెళ్లారు. అది ఎయిర్‌టెల్‌కు చెందిన ఏజెంట్ షోరూమ్. అక్కడికి వెళ్లాక తన నంబర్‌తో కొత్త సిమ్ కార్డు ఇవ్వాలని కోరారు సరిత. అయితే ఆ మొబైల్ నంబర్ ఆమె పేరుతో కాకుండా సరిత తండ్రి గాంధీ పేరుతో ఉందట.
సరిత ఫిర్యాదు ప్రకారం, సిమ్ కార్డు పేరు మార్పుతోపాటు డూప్లికేట్ సిమ్ ఇవ్వాలంటే రూ.650 చెల్లించాల్సి ఉంటుందని ఏజెంట్ చెప్పారట. దీంతో సరిత తన భర్త బ్యాంకు ఖాతా నుంచి గూగుల్ పే ద్వారా రూ.650ను ఏజెంట్‌కు పంపించారు. కానీ కంపెనీ నిర్ణయించిన ఛార్జీ కంటే ఇంత పెద్ద మొత్తాన్ని ఎందుకు వసూలు చేస్తున్నారో అడిగినప్పటికీ, ఏజెంట్ నుంచి సరైన వివరణ రాలేదట. అంతేకాదు చెల్లించిన మొత్తానికి రసీదు కూడా వెంటనే ఇవ్వలేదని సరిత ఆరోపించారు.
అసలు విషయం బయటకెలా వచ్చిందంటే?
అదనపు మొత్తాన్ని ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే విషయంపై సరిత భర్త నేరుగా ఎయిర్‌టెల్‌ను సంప్రదించారు. డూప్లికేట్ సిమ్ కార్డు కోసం వసూలు చేసే ఛార్జీ కేవలం రూ.50 అని ఎయిర్‌టెల్ నుంచి సమాచారం అందిందని ఆయన తెలిపారు. సిమ్ కార్డు పేరును మార్చేందుకు అదనంగా ఎలాంటి ఛార్జీ లేదని కూడా సంస్థ చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో తాము చెల్లించిన రూ.650లో రూ.600 అదనంగా వసూలు చేశారని సరిత దంపతులు గుర్తించారు. ఆ విషయంపై ఏజెంట్‌ను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం లేకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు
మార్కెటింగ్ షోరూమ్ యజమాని మణికందన్‌పై సరిత చెంగల్పట్టు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. నిర్ణయించిన ఛార్జీ కంటే రూ.600 అధికంగా వసూలు చేశారని ఆమె ఆరోపించారు. అదనపు మొత్తాన్ని తిరిగి ఇవ్వడంతోపాటు తనకు కలిగిన మానసిక వేదనకు పరిహారం అందించాలని కోరారు. ఆ కేసును కమిషన్ ఛైర్మన్ కాశీ పాండియన్, సభ్యుడు జవహర్ విచారించారు. డూప్లికేషన్ సిమ్ కార్డు కోసం నిర్ణయించిన రుసుము కంటే అదనంగా డబ్బులు వసూలు చేసిన అంశాన్ని కమిషన్ విచారించింది.
ఫిర్యాదు దారుడు సమర్పించిన వివరాలు, చెల్లింపు ఆధారాలు, సంస్థ నుంచి అందిన సమాచారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. విచారణ అనంతరం కస్టమర్ నుంచి అదనంగా వసూలు చేసిన రూ.600ను తిరిగి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. అంతే కాదు, ఆ మొత్తానికి 24 శాతం వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. అదనపు ఛార్జీ వసూలు చేయడాన్ని కమిషన్ సేవాలోపంగా పరిగణించింది. వినియోగదారుడికి సరైన సమాచారం ఇవ్వకపోవడం, నిర్ణయించిన ఛార్జీ కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం వంటి అంశాలను పరిశీలించింది.
అలా సరితకు కలిగిన సేవాలోపం, మానసిక వేదనకు పరిహారంగా రూ.25 వేలు చెల్లించాలని ఆదేశించింది. అదే విధంగా కేసు కోసం ఆమె చేసిన న్యాయపరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుని రూ.15 వేలు లీగల్ ఎక్స్పెన్సెస్ కింద చెల్లించాలని తీర్పులో పేర్కొంది. అంటే, అదనంగా వసూలు చేసిన రూ.600ను వడ్డీతో తిరిగి చెల్లించడంతోపాటు సేవాలోపం, మానసిక వేదనకు రూ.25 వేలు, న్యాయఖర్చులకు రూ.15 వేలు కలిపి మొత్తం రూ.40 వేల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
రూ.3500 బిర్యానీలో చనిపోయిన జెర్రి- కస్టమర్‌కు రూ.1.05 లక్షల పరిహారం!
ATM ట్రాన్సాక్షన్ ఫెయిల్- రూ.10వేల కోసం 8 ఏళ్ల పోరాటం- చివరికి యువకునికి దక్కిన న్యాయం!

