ETV Bharat / bharat

ఎయిర్​ఇండియాకు 8ఏళ్ల తర్వాత తొలి లైన్‌ఫిట్ డ్రీమ్‌లైనర్‌- భారత్​కు ఎప్పుడు రానుంది?

ఎనిమిదేళ్ల తర్వాత తొలి లైన్‌ఫిట్ డ్రీమ్‌లైనర్‌ను అందుకున్న ఎయిర్‌ ఇండియా- రాబోయే కొద్ది రోజుల్లో భారత్​కు చేరనున్న విమానం

Air India
Air India (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 3:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

Air India First Line Fit Dream Liner : టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా ఎనిమిదేళ్ల విరామం తర్వాత తన తొలి లైన్‌ఫిట్ డ్రీమ్‌లైనర్‌ను అందుకుంది. బోయింగ్‌ తయారు చేసిన 787-9 డ్రీమ్‌లైనర్‌ విమానం తాజాగా ఎయిర్‌ ఇండియా ఫ్లీట్‌లో చేరింది. ఇది ఎయిర్‌ ఇండియాకు ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన తొలి డ్రీమ్‌లైనర్‌ కావడం విశేషం. అంతేకాదు 2022లో ప్రైవేటీకరణ అనంతరం ఎయిర్‌ ఇండియా తీసుకున్న తొలి లైన్‌ఫిట్‌ డ్రీమ్‌లైనర్‌ కూడా ఇదే కావడం మరో విశేషం.

అధికారుల సమాచారం ప్రకారం, అమెరికాలోని సియాటిల్‌ సమీపంలోని బోయింగ్‌ ఎవెరెట్‌ ఫ్యాక్టరీలో జనవరి 7న ఈ విమానానికి సంబంధించిన టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియను ఎయిర్‌ ఇండియా పూర్తి చేసింది. అనంతరం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తనిఖీలు పూర్తైన తర్వాత, ఈ విమానం రాబోయే కొద్ది రోజుల్లో భారత్‌కు చేరుకోనుంది.

ఈ కొత్త డ్రీమ్‌లైనర్‌ విమానం త్రీ క్లాస్ సీటింగ్‌ ఏర్పాటుతో రూపొందించారు. ఇందులో ఎకానమీ క్లాస్‌, ప్రీమియం ఎకానమీ, బిజినెస్‌ క్లాస్‌ సీట్లు ఉన్నాయి. ఆధునిక ఇంటీరియర్స్‌, మెరుగైన ప్రయాణ అనుభూతి, ఇంధన సామర్థ్యం వంటి లక్షణాలతో ఈ విమానం ఎయిర్‌ ఇండియా దీర్ఘదూర అంతర్జాతీయ సేవలను మరింత బలోపేతం చేయనుంది.

లైన్‌ఫిట్‌ అంటే? ఒక నిర్దిష్ట ఎయిర్‌లైన్‌ అవసరాలకు అనుగుణంగా తయారీ దశలోనే డిజైన్‌, సీటింగ్‌, ఇతర సదుపాయాలను అమర్చడం. ఈ విధంగా తయారైన విమానాలను లైన్‌ఫిట్‌ విమానాలుగా పిలుస్తారు. ఎయిర్‌ ఇండియా చివరిసారిగా ఇలాంటి లైన్‌ఫిట్‌ డ్రీమ్‌లైనర్‌ను 2017 అక్టోబర్‌లో అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమయంలో పొందింది.

అధికారుల వివరాల ప్రకారం, తాజా డ్రీమ్‌లైనర్‌ ఎయిర్‌ ఇండియాకు వచ్చిన తొలి వైడ్‌బాడీ విమానం. అలాగే, 2023లో బోయింగ్‌కు ఇచ్చిన 220 విమానాల ఆర్డర్‌లో ఇది 52వ డెలివరీగా నిలిచింది. అదే సమయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఇప్పటికే 51 బోయింగ్‌ 737-8 న్యారోబాడీ విమానాలను అందుకుంది. ఇందులో డిసెంబర్‌ చివర్లో చేరిన తొలి లైన్‌ఫిట్‌ విమానం కూడా ఉంది.

విమాన సర్వీసుల విస్తరణపై భారీ ప్రణాళికలు
టాటా గ్రూప్‌ 2022 జనవరిలో ఎయిర్‌ ఇండియాను స్వాధీనం చేసుకున్న తర్వాత, విమాన సర్వీసుల విస్తరణపై భారీ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఎయిర్‌ ఇండియా 350 ఎయిర్‌బస్‌ విమానాలు, 220 బోయింగ్‌ విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది. ఎయిర్‌బస్‌ ఆర్డర్‌లో భాగంగా ఇప్పటికే ఆరు ఏ350 విమానాలు ఎయిర్‌ ఇండియా ఫ్లీట్‌లో చేరాయి.

మొత్తం 300కుపైగా విమానాలు
ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాకు ఇప్పటికే 26 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్లు, విలీనమైన విస్తారా నుంచి వచ్చిన ఆరు బోయింగ్‌ 787-9 విమానాలు ఉన్నాయి. తాజా డెలివరీతో డ్రీమ్‌లైనర్‌ ఫ్లీట్‌ మరింత బలపడనుంది. మొత్తం ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ వద్ద ప్రస్తుతం 300కు పైగా విమానాలు ఉన్నాయి. వీటిలో సుమారు 185 విమానాలు ఎయిర్‌ ఇండియాకు, మిగిలినవి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందినవిగా ఉన్నాయి.

2026 నాటికి మళ్లీ సేవల్లోకి!
ఇదిలా ఉండగా, పాత తరం డ్రీమ్‌లైనర్‌ విమానాలకు కూడా ఎయిర్‌ ఇండియా మెరుగుదలలు చేపడుతోంది. రిఫ్రెష్‌ చేసిన ఇంటీరియర్స్‌తో మరో డజను లెగసీ డ్రీమ్‌లైనర్‌ విమానాలు 2026 నాటికి మళ్లీ సేవల్లోకి రానున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరిణామాలన్నీ ఎయిర్‌ ఇండియా గ్లోబల్‌ స్థాయిలో తిరిగి తన స్థానాన్ని బలోపేతం చేసుకునే దిశగా సాగుతున్న కీలక అడుగుగా నిపుణులు ఇప్పుడు భావిస్తున్నారు.

ఎయిర్‌బస్‌ ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌- డీజీసీఏ ప్రకటన

ఎయిర్​ఇండియా, ఇండిగో విమానాలకు తప్పిన ప్రమాదాలు- ల్యాండింగ్​ అయ్యేందుకు విఫలయత్నం