ETV Bharat / bharat

టీవీకేకు మేం మద్దతు ఇవ్వడం లేదు- ఆ వార్తలు అవాస్తవం : ఏఐఏడీఎంకే

తమిళనాడులో నూతన గవర్నమెంట్​ను ఏర్పాటుకు టీవీకేకు 10 మంది ఎమ్మెల్యేల అవసరం- ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకే నాయకుడు కె పి మునుస్వామి టీవీకేకి మద్దతు ఇచ్చినట్లు వార్తా కథనాలు- తోసిపుచ్చిన ఏఐఏడీఎంకే

Aiadmk Leader K P Munusamy
Aiadmk Leader K P Munusamy (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2026 at 8:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tamilnadu Politics : తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా, ఆయనకు మద్దతు ఇచ్చేది లేదని ఏఐఏడీఎంకే తాజాగా స్పష్టం చేసింది. తాము విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలను అన్నాడీఎంకే ముఖ్యనేత కేపీ మునుస్వామి స్పష్టం చేశారు.

విజయ్​ టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేదు. కాంగ్రెస్ ఇప్పటికే ఆయనకు మద్దతు ప్రకటించినప్పటికీ అది ప్రభుత్వ ఏర్పాటుకు ఏమాత్రం సరిపోదు. మరోవైపు టీవీకే ఆహ్వానించినప్పటికీ, వామపక్ష పార్టీలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. ఎన్నికల్లో విజయం సాధించిన సీపీఐ(ఎం) అభ్యర్థులు ఆర్. చెల్లస్వామి, లతతో పాటు సీపీఐ సభ్యులు టి. రామచంద్రన్, మారిముత్తు డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను కలిశారు. అటు ఐయూఎంఎల్ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సయ్యద్ ఫరూక్ బాషా (ఎస్​ఎస్​బీ), ఏ.ఎం. షాజహాన్ కూడా డీఎంకే అధ్యక్షుడిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ, తాము డీఎంకేకి తమ మద్దతును కొనసాగిస్తామని సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్​ శాసనసభ్యులు స్పష్టం చేశారు. తాజాగా ఏఐఏడీఎంకే కూడా టీవీకేకు మద్దతు ఇవ్వమని కుండబద్దలు కొట్టారు. మరి ఇప్పుడు తమిళనాడులో ఏమౌతుందో చూడాలి.

విజయ్ చూపించిన సంఖ్యాబలంపై గవర్నర్‌ సంతృప్తి
ఇదిలా ఉండగా, తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను కలిశారు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. అయితే విజయ్ చూపించిన సంఖ్యాబలంపై గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేయలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు ఇంకా తగినంత సంఖ్యాబలం లేదని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్నే ఆయన విజయ్‌తో చర్చించినట్లు, 118 సభ్యులు సమకూరిన అనంతరమే రావాలని సూచించినట్టు సమాచారం.

ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తారుమారు చేస్తూ, మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు 108 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే అందుకు 118 ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్​ టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. అయితే, కాంగ్రెస్‌కు ఐదు సీట్లతో పాటు విజయ్ గెలిచిన రెండు సీట్లలో ఒకదాన్ని మినహాయిస్తే, సంఖ్య 112కు చేరింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు మరో ఆరుగురి మద్దతు అవసరం ఉంది. విజయ్ బృందంలోకి ఇంకా ఎవరెవరు వస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే, మెజారిటీ కోసం టీవీకే వర్గాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

తమిళనాడులో బీజేపీని అడుగుపెట్టకుండా అడ్డుకోవడమే తమ ఉద్దేశం
కాగా, టీవీకేకు మద్దతిచ్చి వెన్నుపోటు పొడిచారని డీఎంకే చేసిన ఆరోపణలను కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్మన్ పవన్‌ ఖేడా తోసిపుచ్చారు. తమిళనాడులో బీజేపీని అడుగుపెట్టకుండా అడ్డుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టంచేశారు. భావసారూప్యత కలిగిన పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని డీఎంకే ప్రకటిస్తే వారి నిర్ణయాన్ని తాము గౌరవించామని పవన్ ఖేడా వెల్లడించారు. అధికార కోసమే కాంగ్రెస్, టీవీకేకు మద్దతిస్తోందని డీఎంకే అధికారి ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గత ఐదేళ్లలో డీఎంకే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తాము ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదని పవన్ ఖేడా తెలిపారు. కనీసం బోర్డులు లేదా కార్పొరేషన్ పదవులను కూడా ఆశించలేదని చెప్పారు.

వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్​ చరిత్రలోనే ఉంది : బీజేపీ

బంగాల్, అసోం ఎన్నికల్లో- SC, ST రిజర్వ్‌డ్ స్థానాలను స్వీప్ చేసిన బీజేపీ- ఎలా అంటే?