దళపతికి తమిళ ఓటర్ల సర్‌ప్రైజ్- సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ TVK
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు- ఫలితాల్లో దూసుకెళ్తున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే- 90కి పైగా స్థానాల్లో ఆధిక్యం- పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ లీడ్‌లో విజయ్- విజిల్ రీసౌండ్ వస్తుందంటున్న ఫ్యాన్స్

Published : May 4, 2026 at 11:05 AM IST
Tamilnadu Polls Vijay : తమిళనాడు ఓటర్లు సినీ నటుడు విజయ్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా చూపిస్తోంది. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే కూటమి, పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేను వెనక్కి నెట్టి 90కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. దీంతో తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే దిశగా టీవీకే దూసుకుపోతోంది. మరోవైపు, తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) విజయ్ ఆధిక్యంలో ఉన్నారు.
డీఎంకే, అన్నాడీఎంకేకు షాకిచ్చిన విజయ్
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే కూటమి హవా చూపించింది. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత టీవీకే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. అన్నాడీఎంకే కూటమి రెండో స్థానంలో నిలిచింది. డీఎంకే కూటమి ఆధిక్యాల్లో మూడో స్థానానికి పడిపోయింది. మరోసారి అధికారం చేపట్టాలని ఆశపడ్డ డీఎంకేకు విజయ్ వల్ల తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది.
తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉద్భవించారు. అంచనాలకు మించి ఎన్నికల్లో రాణించారు. ముఖ్యంగా యువతను, మహిళా ఓటర్లను ఆకర్షించి ఓట్లను రాబట్టుకోగలిగారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతమయ్యారు. డీఎంకే, అన్నాడీఎంకేను దాటుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీని నిలిపారు.
పార్టీ శ్రేణులు సంబరాలు
మరోవైపు, తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ 'విజిల్ పోడు' పాటను పాడుతూ ఆనందంలో తేలుతున్నారు. తమ పెదవుల మధ్య పార్టీ గుర్తు (విజిల్)ను ఉంచుకుని ఈల వేస్తూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. అలాగే విజిల్ రీసౌండ్ వస్తుందంటున్న విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తమదే విజయమని కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు
మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే సత్తా చాటుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత విజయ్ ఇంటి వద్ద అధికారులు భద్రతను పెంచారు. విజయ్ ఇంటి వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇతర వాహనాలను విజయ్ ఇంటివైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలను ఢీకొట్టిన విజయ్
దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ విజయ్ ప్రజాదరణ, యువతతో ఆయనకున్న క్రేజ్, దూకుడైన ప్రచారం ముందు ద్రవిడ పార్టీలు తట్టుకోలేకపోయాయి. దీంతో విజయ్ పార్టీ ముందు ద్రవిడ పార్టీలు కుదేలయ్యాయి. టీవీకే 118 సీట్ల మెజారిటీ మార్కుకు చేరుకోలేకపోయినప్పటికీ, ఆ పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక మలుపు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది. ఏకంగా 159 స్థానాలను గెలుచుకుంది. అన్నాడీఎంకే కూటమి 75 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ సారి జరిగిన ఎన్నికల్లోనూ డీఎంకే కూటమిదే అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే వాటిని తలకిందులు చేస్తూ విజయ్ పార్టీ సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అంతేకాకుండా అన్నాడీఎంకే కూడా డీఎంకే కన్నా ఎక్కువ సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 2021-26వరకు అధికారంలో ఉన్న స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మూడో స్థానంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినా ఫలితాల్లో డీఎంకేకు చుక్కెదురవ్వడం ఆ పార్టీని కలవరపెడుతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి.

