ETV Bharat / bharat

పూర్వీకులకు మోక్షం ప్రసాదించే గాయత పఖ్నా- వీపుపై బండరాళ్లు మోసిన పురుషులు

గాయత పఖ్నా వేడుక ఆద్యంతం ఆసక్తికరం- పూర్వీకులను స్మరించే పాటలతో తొలి రోజంతా సందడి- మరణించిన ప్రతీ కుటుంబ సభ్యుడి జ్ఞాపకార్థం కలశం

Unique Ritual Of Salvation
Unique Ritual Of Salvation (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 5:56 PM IST

6 Min Read
Choose ETV Bharat

Unique Ritual Of Salvation : చనిపోయిన పూర్వీకులకు మోక్షం దక్కాలనే సంకల్పంతో అన్ని మతాలు, కులాలవారూ వివిధ రకాల పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ఇందుకోసం ఓ గిరిజన తెగ వరుసగా నాలుగు రోజుల పాటు నిర్వహించే సంప్రదాయ వేడుక గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. గాయత పఖ్నా అని పిలిచే ఈ ప్రాచీన వేడుక 22 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఓ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. తమ పూర్వీకులకు మోక్షం లభించాలనే ఆశతో అక్కడి ప్రజలు నాలుగు రోజుల పాటు ఏమేం చేశారో తెలియాలంటే పూర్తి కథనాన్ని చదవండి.

పూర్వీకుల మోక్షం కోసం ఏకమయ్యారు
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ పరిధిలో అబూజ్‌మడ్ ప్రాంతం ఉంది. అబూజ్‌మడ్ అనేది దాదాపు 4వేల చదరపు కిలోమీటర్ల కొండ ప్రాంతంలో విస్తరించి ఉంది. దీని పరిధిలోనే నారాయణ్‌పుర్, బీజాపుర్, దంతెవాడ, కాంకేర్ జిల్లాలు ఉన్నాయి. ఇటీవలే ‘గాయత పఖ్నా’ వేడుకకు నారాయణ్‌పూర్ జిల్లాలోని కేరళాపాల్ గ్రామం వేదికగా నిలిచింది. ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఈ వేడుక జరిగింది. ఈ వేడుకను ఉసెండి అనే గిరిజన తెగ ప్రజలు నిర్వహించారు. ఉసెండి తెగలో 7 వేర్వేరు శాఖలు ఉన్నాయి. జీవనోపాధి కోసం అబూజ్‌మడ్ ప్రాంతానికి చెందిన ఎంతోమంది ఉసెండి తెగ ప్రజలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలస వెళ్లారు. 22 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ‘గాయత పఖ్నా’ వేడుకను నిర్వహిస్తున్నందున, తమ సమీప బంధువులు అందరికీ ఆహ్వానాలను పంపారు. ఈ వేడుకలో తల్లి, మేనమామ తరఫు కుటుంబీకులు పాల్గొనడం అవసరం. అందుకే వారికీ కబురు పంపారు. తమ పూర్వీకులకు మోక్షం లభించాలనే ఏకైక సంకల్పంతో వారంతా కేరళాపాల్ గ్రామానికి చేరుకున్నారు.

మొదటి రోజు వేడుక (ఫిబ్రవరి 22) : పాటలు, నృత్యాలు
హాన్సిన్ నాటా అంటే తల్లి తరఫు, మేనమామ తరఫు బంధువులు. తొలిరోజు ఉదయం గాయత పఖ్నాలో భాగంగా వీరికి కేరళాపాల్ గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈక్రమంలో డప్పు చప్పుళ్లు, సంప్రదాయ పాటలతో ఊరు మార్మోగింది. రాత్రి టైంలో మహిళలు, వృద్ధులు కలిసి "పతంగ్‌ పరే" సాంగ్స్ పాడారు. చనిపోయినవారిని గుర్తు చేసుకుంటూ ఆలపించే విషాద గీతాలివి. వీటితో పాటు "పెన్ పట"ను కూడా వాళ్లు పాడారు. పెన్ పట అంటే దేవతల పాటలు అని అర్థం. వీటిని ఎంత బిగ్గరగా పడితే, అంత ఎక్కువ దైవ శక్తి లభిస్తుందని ఉసెండి తెగ ప్రజలు విశ్వసిస్తారు. ఇవి కేవలం పాటలు కావని, మంత్రాలు అని వారు నమ్ముతారు. ఈ పాటల్లో మరణించిన పూర్వీకుల పేర్లు, జ్ఞాపకాలను ప్రస్తావిస్తారు. ఈ పాటలను వినడానికి మరణించిన వారి ఆత్మలు వస్తాయని భావిస్తారు.

Unique Ritual Of Salvation
గాయత పఖ్నా వేడుక (ETV Bharat)

మరణించిన ప్రతీ కుటుంబ సభ్యుడి జ్ఞాపకార్థం కలశం
కేరళాపాల్ గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. దాని ఎదుట బంధువులు, అతిథుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. రాత్రంతా వాళ్లు అక్కడే కూర్చొని పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆప్తులను కలవడంతో వాళ్ల కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ఇక తొలిరోజు రాత్రంతా సాంప్రదాయ పాటలు పాడుతూ, వాటిలోని స్వరాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ గడుపుతారు. ఇక ఇదే సమయంలో మరణించిన ప్రతీ కుటుంబ సభ్యుడి జ్ఞాపకార్థం ఒక కలశాన్ని తయారు చేస్తారు. వెదురు బుట్టలో ఉంచిన చిన్న మట్టి కుండపై నూనె దీపాన్ని వెలిగిస్తారు. వరి, పసుపు, బియ్యం, పువ్వుల వంటి శుభ వస్తువులను ఆ బుట్టలో ఉంచుతారు. రెండో రోజు నుంచి జరగబోయే గాయత పఖ్నా పూజలకు ఇవే కీలకం.

Unique Ritual Of Salvation
గాయత పఖ్నా వేడుక (ETV Bharat)

రెండో రోజు వేడుక (ఫిబ్రవరి 23) : గ్రామ శివార్లలో కలశానికి పూజలు
ఉసెండి తెగ ప్రజలు గ్రామ ప్రధాన పూజారిని సిర్హా అని పిలుస్తారు. ఆయన చెప్పినట్టే అన్ని పూజలు చేస్తారు. గాయత పఖ్నా వేడుకల్లో రెండోరోజున ఉదయాన్నే పూజారి వెంట గ్రామస్థులంతా ఊరి అవతలికి బయలుదేరుతారు. మహిళలంతా తలపై కలశాన్ని మోస్తూ పూజారి వెంట నడుస్తారు. గ్రామం శివార్లకు చేరాక ఒక ప్రత్యేక ప్రదేశంలో, మద్ది చెట్టు కొమ్మలను సేకరించి నేలలో పూడుస్తారు. ఈసందర్భంగా కలశానికి పూజలు నిర్వహిస్తారు. తద్వారా మరణించిన పూర్వీకుల ఆత్మలు గ్రామం సరిహద్దులను విడిచిపెట్టి, వారి శాశ్వత విశ్రాంతి స్థలం వైపు బయలుదేరుతాయని గిరిజనులు విశ్వసిస్తారు. అనంతరం గ్రామ పూజారి అందరినీ గాయత పఖ్నా స్థలానికి తీసుకెళ్తాడు. కేరళాపాల్ గ్రామ శివార్లలోని గాయత పఖ్నా స్థలంలో పూర్వీకుల పేరిట గతంలో పాతిన బండరాళ్లు పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఈ వేడుకలో భాగంగా తమ పూర్వీకుల జ్ఞాపకార్ధం పాతిన రాళ్ల దగ్గర దీపపు కుండలను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

Unique Ritual Of Salvation
గాయత పఖ్నా వేడుక (ETV Bharat)

మూడో రోజు వేడుక (ఫిబ్రవరి 24) : కొండ పైనుంచి బండరాళ్ల తరలింపు
గాయత పఖ్నా వేడుకలో మూడో రోజు చాలా కీలకమైంది. ఈ రోజున తమ తల్లి, తండ్రి వైపు బంధువులతో కలిసి గ్రామ పురుషులు పూజారి వెంట నడుస్తారు. పూజారి వారిని ఓ కొండపైకి తీసుకెళ్తాడు. కొండపైకి వెళ్లాక చనిపోయిన వారి ఆత్మలు పూజారి శరీరంలోకి ప్రవేశిస్తాయని విశ్వసిస్తారు. అప్పటికే మట్టితో పూడ్చిన బండరాళ్లు ఆ కొండపై పెద్దసంఖ్యలో ఉంటాయి. మరణించిన ప్రతీ ఒక్కరి పేరిట ఒక్కో బండరాయిని పూజారి సూచిస్తారు. మరణించిన వ్యక్తి వయసు ఎక్కువగా ఉంటే, బరువైన రాయిని తీసుకెళ్లమని పూజారి చెబుతారు. ఎవరైనా వృద్దాప్యంలో చనిపోయి ఉంటే, గరిష్టంగా 15 కిలోల బరువున్న బండరాయిని కేటాయిస్తారు. మధ్య వయస్కులు చనిపోయి ఉంటే మీడియం సైజు రాళ్లు, చిన్నపిల్లలు చనిపోయి ఉంటే చిన్న రాళ్లను ఎంపిక చేస్తారు. పూజారి సూచించిన బండరాయిని పురుషులు నేల నుంచి పెకిలిస్తారు. ఆ రాయిని పెకిలించిన చోట తెల్లటి వస్త్రాన్ని కప్పుతారు.

Unique Ritual Of Salvation
గాయత పఖ్నా వేడుక (ETV Bharat)

బండరాయిని వీపుపై మోస్తూ గాయత పఖ్నా స్థలానికి
బండరాయిని వీపుపై మోస్తూ గాయత పఖ్నా స్థలానికి తీసుకెళ్తారు. ఈ రాళ్లను పాతిపెట్టడానికి గాయత పఖ్నా స్థలంలో గొయ్యిలను తవ్వుతారు. తొలుత గొయ్యిలో నాణేలు, ఇనుప ఉంగరాలను వేస్తారు. అనంతరం అందులో బండరాయిని పాతిపెడతారు. తదుపరిగా దానిపై పసుపు, నూనె, బియ్యం కలిపిన పేస్ట్‌ను పూస్తారు. ఈ రాళ్లకు ఇప్పు పూల రసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పు పూల రసం తమ దేవతల పానీయమని గిరిజనులు విశ్వసిస్తారు. బండరాళ్లను పూడ్చిన తర్వాత, తమ పూర్వీకుల పవిత్ర ఆత్మలు ప్రకృతి, దేవుడి వైపు ప్రయాణిస్తాయని నమ్ముతారు. ఈ బండరాళ్లను భూమిపై తమ పూర్వీకుల నివాస స్థలంగా భావిస్తారు.

Unique Ritual Of Salvation
గాయత పఖ్నా వేడుక (ETV Bharat)

నాలుగో రోజు వేడుక (ఫిబ్రవరి 25) : రాయి పడిపోతే అశుభ సూచకం
గాయత పఖ్నా వేడుకలో భాగంగా నాలుగో రోజున ఉదయం కేరళాపాల్ గ్రామంలో ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. విశేషం ఏమిటంటే, ఈ ఊరికి చెందిన ప్రజల తల్లి తరఫు, మేనమామ తరఫు బంధువులు ఈ మార్కెట్‌ను నడుపుతారు. ఇక్కడ లావాదేవీల కోసం కరెన్సీని ఉపయోగించరు. వస్తు మార్పిడి పద్దతిలో లావాదేవీలను చేస్తారు. కుండలు, వస్త్రాలు, ఆహార ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు, బెల్లం, కూరగాయలు, వంటచెరుకు, ఇంట్లో వండిన వంటకాలను ఈ మార్కెట్ ద్వారా పరస్పరం మార్పిడి చేసుకుంటారు. ఈ మార్కెట్ ముగిశాక, సామాజిక విందు కార్యక్రమం ఉంటుంది. భోజనం చేశాక, సామూహిక నృత్యాలు చేస్తారు. ఆ వెంటనే గ్రామస్థులంతా కలిసి గాయత పఖ్నా స్థలానికి వెళ్తారు. తాము పాతిపెట్టిన బండరాళ్లు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా రాయి పడిపోతే, దాని అశుభ సూచకంగా భావిస్తారు. ఆ రాయితో ముడిపడిన పూర్వీకుడి మరణానికి గల నిర్దిష్ట కారణాలను పూజారి అడిగి తెలుసుకుంటారు.

ప్రమాదంలో, బలవన్మరణంగా చనిపోయిన వారికి వేరేచోట
ప్రమాదంలో, బలవన్మరణంతో చనిపోయిన వారి పేరిట గాయత పఖ్నా స్థలంలో బండరాళ్లను పాతిపెట్టరు. వారి కోసం ఊరిశివార్లలోనే వేరొక ప్రదేశం ఉంటుంది. ఆ విధంగా చనిపోయిన వారి కోసం వేరొక టైంలో పూజలు చేస్తారు. వేడుకలో చివరగా రాత్రివేళ మరొక సారి గొప్ప విందు జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులకు గ్రామస్థులు వీడ్కోలు పలుకుతారు. రాబోయే 20 సంవత్సరాల పాటు ఈ వేడుక తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

పెరుగుతున్న రాళ్ల సైజు ?
గాయత పఖ్నా స్థలంలో పూర్వీకుల పేరిట వందల ఏళ్ల క్రితం పాతిపెట్టిన బండరాళ్లు కూడా ఉన్నాయి. వాటిలో కొన్నింటి సైజు బాగా పెరిగిపోయిందని కేరళాపాల్ గ్రామస్థులు అంటున్నారు. చనిపోయిన ఆయా వ్యక్తుల ఆత్మబలం, సత్యశీలత వల్లే ఇలా జరిగి ఉంటుందని వారు చెబుతున్నారు. గాయత పఖ్నా స్థలంలోని కొన్ని రాళ్లు 10 అడుగుల పొడవు, అనేక టన్నుల బరువుతో ఉండటం గమనార్హం.

ఓ వైపు ప్రపంచం అభివృద్ధి కోసం పరుగెత్తుతుండగా, మరోవైపు కేరళాపాల్ గ్రామస్థులు ప్రశాంతంగా నిర్వహించుకున్న నాలుగు రోజుల గాయత పఖ్నా వేడుక సంప్రదాయాల విలువను చాటిచెబుతోంది. సంస్కృతి, సంప్రదాయాలపై వారికున్న బలమైన విశ్వాసానికి, పూర్వీకులపై ఉన్న అపార గౌరవానికి ఈ వేడుకే నిదర్శనం.నైతిక విలువలను పెంచే ఇలాంటి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.