16 ఏళ్లకే పెళ్లి- ఆపై భర్తతో విడాకులు- కట్ చేస్తే తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డ్
ఒడిశా తొలి మో బస్సు మహిళ డ్రైవర్‌గా సంతోషి- చెన్నైలో చూసిన దృశ్యంతో మారిన జీవితం- ఆటో నుంచి బస్సు వరకు అన్ని రకాల వాహనాలను నడిపిన సంతోషి

Published : January 16, 2026 at 6:58 PM IST
Odisha Woman Driver Santhoshi Journey : 16 ఏళ్ల వయసులో వివాహం, ఆ తర్వాత గృహ హింస, వరకట్న వేధింపులు ఆపే భర్త నుంచి విడాకులు వీటిన్నింటిని తట్టుకుని తన సొంత కాళ్లపై నిలబడింది ఒడిశాకు చెందిన మహిళ. తన కూతురుని మంచిగా చదివించడం కోసం చెన్నైలో ఓ టెక్స్టైల్స్ మిల్లులో పనిచేసింది. అక్కడ ఆమె చూసిన దృశ్యమే తనని ఆటో డ్రైవర్‌గా మార్చింది. అంతటితో ఆగకుండా గనుల్లో 40 టన్నుల వోల్వో ట్రక్‌ను నడిపింది. ఆ తర్వాత ఒడిశా తొలి మో బస్సు మహిళ డ్రైవర్ చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆమె ఎవరు? చెన్నైలో ఆమె చూసిన దృశ్యం ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గత పదేళ్లుగా ఒడిశా రద్దీ రహదారులపై ఉదయం నుంచి రాత్రివరకు ఉత్సాహంగా ప్రయాణికులను చేరవేస్తున్న మహిళా ఆటోరిక్షా డ్రైవర్ సంతోషి దేవో (37)కియోంజర్ జిల్లాకు చెందిన సంతోషి దేవోకు కుటుంబ పరిస్థితులు కారణంగా 16 ఏళ్లకే పెళ్లి చేశారు. ఆ తర్వాత గృహ హింస, వరకట్నం వంటి వేధింపులకు గురైంది. ఆ తర్వాత భర్త వదిలేయడంతో తిరిగి కియోంజర్‌కు వచ్చేసింది. అప్పటికే సంతోషికి ఒక కూతురు ఉంది. పెద్దగా చదువుకోకపోయినా తన కూతురును మాత్రం గౌరవంగా పెంచాలని నిర్ణయించుకుంది. అందుకోసం చెన్నైలోని ఒక టెక్స్టైల్ మిల్లులో చేరింది. అక్కడే తన జీవితాన్ని మార్చేసిందని, ఆ తర్వాతే డ్రైవర్‌గా మారాని సంతోషి ఈటీవీ భారత్‌కు తెలిపింది.
' నేను జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. కానీ నేను ఎప్పుడు ఆశను కోల్పోలేదు. చెన్నైలో టైక్స్‌టైల్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు ఓ మహిళ ధైర్యంగా ఆటో నడుపుతూ కనిపించింది. ఆమె చేయగలిగితే నేను ఎందుకు చేయలేను అని ఆలోచన వచ్చింది. 2015లో తిరిగి ఒడిశాకు వచ్చేసి ఆటోను కొనుగోలు నడపటం ప్రారంభించా. ప్రారంభంలో నా ఆటో ఎక్కడం ముందుకు వచ్చేవారు కాదు. క్రమంగా ప్రజలు సహకరించడం మొదలుపెట్టారు. ఒడిశా స్కిల్ డెవలప్‌మెంట్ అథారిటీ (OSDA) ఛైర్మన్ సుబ్రతో బాగ్చీ, మాజీ కియోంజర్ కలెక్టర్ ఎన్. తిరుమల నాయక్ నా ఆటోలో ప్రయాణించారు. నన్ను ప్రశంసించారు' అని సంతోషి చెప్పింది.
గనుల్లో 40 టన్నుల వోల్వో ట్రక్ డ్రైవింగ్
ఆటో నడపటం వరకే జీవితాన్ని పరిమితం చేయకుండా భారీ యంత్రాల నిర్వహణలో కూడా శిక్షణ పొందినట్లు సంతోషి తెలిపింది. కియోంజర్ జిల్లాలోని గువాళి గనుల్లో 40 మెట్రిక్ టన్నుల వోల్వో ట్రక్కును నడిపాడినట్లు చెప్పింది. వోల్వో ట్రక్ నడిపే అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నించాలని నిర్ణయించుకుని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. ఒక మహిళ దృఢంగా నిర్ణయించుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాలనుకున్నానని తెలిపింది. అంతేకాకుండా
ఒడిశా తొలి 'మో బస్' మహిళా డ్రైవర్‌గా
సంతోషి ప్రయాణం అక్కడితో ఆగలేదు. 2021లో భువనేశ్వర్‌లో ఒడిశా తొలి మహిళా ' మో బస్' డ్రైవర్‌గా సంతోషి చరిత్ర సృష్టించింది. వృత్తి నైపుణ్యం క్రమశిక్షణతో ప్రభుత్వ బస్సులను నడిపేది. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఇటీవల ఒడిశా ప్రభుత్వ వాణిజ్య అండ్ రవాణా శాఖ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఏఎంఏ సువాహక్ పథకం కింద సంతోషి ఎంపికైంది. దీంతో సొంతగా ఒక వెహికల్ కూడా కొనుగోలు చేసింది.
'ఆటోనే ఇష్టం'
ఎన్ని రకాల వాహనాలు నడిపినప్పటికీ, ఆటోనే తనకు అత్యంత ఇష్టమని సంతోషి చెబుతుంది. 'ఆటో నడిపితే నాకు సౌకర్యంగా, స్వతంత్రంగా అనిపిస్తుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రిని కియోంజర్ నుంచి కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీకి ఆటోలోనే తీసుకెళ్లాను. అలాగే వ్యక్తిగత న్యాయ పోరాటంలో భాగంగా కియోంజర్ నుంచి దిల్లీ వరకు దాదాపు 1,600 కిలోమీటర్లు ఆటోలోనే ప్రయాణించా. అంతేకాకుండా రామమందిరం ప్రారంభోత్సవానికి కియోంజర్ నుంచి అయోధ్యకు, అలాగే ప్రయాగ్‌రాజ్, కోరాపుట్‌కు కూడా ఆటోలనే ప్రయాణించా' అని సంతోషి తెలిపారు.

