ETV Bharat / bharat

సిద్ధరామయ్యపై డీకే శివకుమార్​ ప్రశంసల జల్లు- సీఎం మార్పు వేళ ఆసక్తికర పోస్ట్​

ఆయన పట్టుదలకు, సమాజిక న్యాయం పట్ల నిబద్ధతకు నిదర్శనం- కర్ణాటక నాయకత్వం మార్పుల వేళ సిద్ధరామయ్యను కొనియాడిన డీకే శివకుమార్

DK Shivakumar and Siddaramaiah
DK Shivakumar and Siddaramaiah (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2026 at 1:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Shivakumar Hails Siddaramaiah : కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య నిలకడ, పట్టుదల, సామాజిక న్యాయానికి నిదర్శనమని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొనియాడారు. కర్ణాటక సీఎం పీఠాన్ని శివకుమార్ అధిరోహించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులో సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానాన్ని, నాయకత్వాన్ని ప్రశంసించారు.

"దేవుడు వరాలు లేదా శాపాలు ఇవ్వడు. ఆయన కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాలను మనం ఎలా ఉపయోగించుకున్నామన్నదే ముఖ్యం. సిద్ధరామయ్య జీవితం ఆ ఆలోచనకు అత్యుత్తమ ప్రతిబింబం. మైసూరులోని ఒక సాధారణ గ్రామం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించే స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం, ఆయన నిలకడకు (రిసిలియెన్స్), పట్టుదల, సామాజిక న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది."
- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం

సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. "సిద్ధరామయ్య చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కర్ణాటక చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తప్పుకుంటున్న తరుణంలో, కర్ణాటక ప్రజలకు ఆయన అందించిన సుదీర్ఘ సేవలకు, నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తున్నాను. ఆయన పదవీ కాలంలో చేపట్టిన పలు ప్రజాసంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం కర్ణాటక వృద్ధి చరిత్రలో ముఖ్యమైన అధ్యాయాలుగా నిలిచిపోతాయి. దాదాపు ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో, ప్రజల కేంద్రంగా సాగిన పాలన, సమగ్ర నాయకత్వం ద్వారా ఆయన మన రాష్ట్ర రాజకీయ, సామాజిక నిర్మాణాన్ని తీర్చిదిద్దారు" అని శివకుమార్​ పేర్కొన్నారు.

2020లో తనకు కర్ణాటక ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి సిద్ధరామయ్య తనకు అండగా నిలిచారని శివకుమార్ పేర్కొన్నారు. ఆయనతో కలిసి డిప్యూటీ సీఎంగా పనిచేయడం ఒక విశేష గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఆ సీనియర్ నాయకుడి అనుభవం, రాజకీయ దూరదృష్టి నుంచి తాను నిరంతరం నేర్చుకుంటునే ఉన్నానని శివకుమార్ అన్నారు. పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ శివకుమార్​ చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఓ సామెత చెప్పినట్లు, మీరు వేగంగా నడవాలనుకుంటే ఒంటరిగా నడవండి. మీరు చాలా దూరం నడవాలంటే కలిసి నడవండి. కర్ణాటక ప్రజల కోసం ఈ ప్రయాణాన్ని కలిసి ముందుకు తీసుకెళ్లడానికి నేను ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.

కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక గవర్నర్ థావర్​చంద్ గెహ్లోత్​ ఆ రాజీనామాను ఆమోదించి, ఆయన నేతృత్వంలోని మంత్రివర్గాన్ని రుద్దు చేశారు. తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనను నియమించారు. ప్రస్తుతం డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరూ దిల్లీలోనే ఉండడం గమనార్హం.

మంత్రి పదవులు కావాలని డిమాండ్​
ఈ కీలక తరుణంలో కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన ఏడుగురు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఒక లేఖ సమర్పించారు. అందులో వారు తమ జిల్లాకు చెందిన నాయకులకు 3 మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్​ కులాల కోటా కింద బంగారపేట ఎమ్మెల్యే ఎస్​ఎన్​ నారాయణ స్వామికి, జనరల్ కోటా కింద మాలూరు ఎమ్మెల్యే నంజేగౌడ, కోలార్ ఎమ్మెల్యే మంజునాథ్​లకు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతున్న తరుణంలో కోలార్ నేతల నుంచి ఈ డిమాండ్ రావడం గమనార్హం.

శనివారం సీఎల్​పీ సమావేశం
కర్ణాటక సీఎల్​పీ సమావేశం శనివారం సాయంత్రం 4 గంటలకు జరగనుందని కర్ణాటక మంత్రి హెచ్​కే పాటిల్​ శుక్రవారం తెలిపారు. సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత పార్టీలోని అంతర్గత విభేదాలు అన్నీ పూర్తిగా సమసిపోయాయని అన్నారు. కాగా, కొత్త ప్రభుత్వంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్ష పదవి లేదా ఉపముఖ్యమంత్రి లేదా మంత్రి పదవిని ఆశిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా, తాను ఎలాంటి పదవి ఆశించడం లేదని, అధిష్ఠానం కేటాయించిన ఏ బాధ్యతనైనా స్వీకరించి పార్టీకి సేవలు చేస్తానని పాటిల్ స్పష్టం చేశారు.

ఊహాగానాలు వద్దు!
మరోవైపు, కర్ణాటక తదుపరి కేపీసీసీ చీఫ్​ రేసులో తన పేరు ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలను సీనియర్ కాంగ్రెస్ నేత సతీశ్ జార్కిహోళి కొట్టిపడేశారు. సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ హైకమాండ్​తో చర్చలు ముగించుకొని దిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే దీనిపై ఏ నిర్ణయమైనా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము దానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

'రిజర్వ్ చేసిన తీర్పులు గరిష్ఠంగా 3నెలల్లోపు వెలువరించాలి'- హైకోర్టుల్లో విచారణల జాప్యంపై సుప్రీం

దేశంలో నైరుతి రుతుపవనాలు- ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షాలు: ఐఎండీ