ETV Bharat / bharat

భగ్గుమంటున్న పీఓకే, ప్రగతి పథంలో కశ్మీర్- LOC వద్ద భిన్నమైన పరిస్థితులు

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఆందోళనలు, హింసాత్మక అల్లర్లు- ప్రగతి పథంలో భారత్‌లోని జమ్ముకశ్మీర్‌

Kashmir Situation Now
Kashmir Situation Now (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 10, 2026 at 9:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kashmir Situation Now : భారత్‌, పాకిస్థాన్‌లను విడదీసే నియంత్రణ రేఖ ఇరువైపుల పరస్పర భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఆందోళనలు, హింసాత్మక అల్లర్లతో అట్టుడుకుతుంటే భారత్‌లోని జమ్ముకశ్మీర్‌ మాత్రం ప్రగతి పథంలో దూసుకెళుతోంది. POKలో ప్రజలపై సైన్యం దమనకాండలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన రోజే కశ్మీర్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా అత్యంత సంక్లిష్టమైన టన్నెల్‌ నిర్మాణంలో కీలక పురోగతి నమోదైంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనలను అణిచివేసేందుకు పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. POKలోని రావలాకోట్, ముజఫరాబాద్, మీర్పూర్ వంటి పట్టణాలు అశాంతి, అరెస్టులు, హత్యలతో అట్టుడుకుతున్నాయి. ఈ ప్రాంతంలో పాక్‌ ప్రభుత్వ ఆధిపత్యాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత జమ్ముకశ్మీర్‌లో 'జోజిలా టన్నెల్' నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తికావడంతో ఇంజినీర్లు సంబరాలు చేసుకున్నారు. హిమాలయ లోతుల్లో వ్యూహాత్మక జోజిలా టన్నెల్ 'బ్రేక్‌త్రూ'ను మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. పూర్తయిన తర్వాత ఆసియాలోనే అత్యంత పొడవైన ద్విముఖ సొరంగంగా ఇది రికార్డు సృష్టించనుంది. జమ్ముకశ్మీర్‌ను లద్దాఖ్‌తో అనుసంధానించే ఈ సొరంగం అన్ని కాలాల్లోనూ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా నియంత్రణ రేఖకి ఇరువైపులా ఉన్న కశ్మీర్‌లో పరస్పర భిన్నమైన పరిస్థితులకు ఈ రెండు ఘటనలే సజీవ సాక్ష్యం.

1947లో పాకిస్థాన్ దుశ్చర్యల కారణంగా విడిపోయిన ఈ రెండు ప్రాంతాల ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ఈ ఘటనలు కళ్లకు కడుతున్నాయి. జమ్ముకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్-బాల్టిస్థాన్, షక్స్‌గామ్ లోయలు భారత్‌లో అంతర్భాగం కాగా 1947 నుంచి పాకిస్థాన్ కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని దురాగతాలకు పాల్పడుతోంది. పాలనలో పాక్ సైన్యం ఆధిపత్యం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పీవోకే ప్రజలు చాలా ఏళ్లుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ప్రస్తుత ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న JAAC కూడా ఆర్థిక కష్టాలకు వ్యతిరేకంగానే ఉద్భవించింది. పిండి, కరెంటు సబ్సిడీ ఇవ్వాలని, రాజకీయ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ 2024, 2025లో తీవ్ర ఆందోళనలు జరిగాయి. వీటిని పాక్ భద్రతా బలగాలు టియర్ గ్యాస్, తూటాలతో దారుణంగా అణిచివేశాయి. అనేకమంది ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఈ నిరసనల్లో పాక్ నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలంటూ స్థానికులు నినాదాలు చేశారు. పీఓకేలోని వనరులను దోచుకుంటూ, పాక్ అవలంబిస్తున్న అణచివేత విధానాల ఫలితమే ఈ అశాంతి, హింస అని భారత్ స్పష్టం చేసింది.

మరోవైపు గడిచిన దశాబ్ద కాలంగా జమ్ముకశ్మీర్‌ ప్రగతి ప్రథంలో పరుగులు పెడుతోంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన భారీగా పెరిగింది. పెద్దఎత్తున జాతీయ రహదారులు, సొరంగాలు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక మౌలిక సదుపాయాలపై కేంద్రం భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2021కి ముందు కేవలం 450 కోట్లుగా ఉన్న వార్షిక పెట్టుబడులు 2025-26 నాటికి 5వేల 824 కోట్లకు చేరాయి. లక్షా 60వేల కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. 2020లో ఇక్కడ 69 స్టార్టప్‌లు మాత్రమే ఉండగా, ప్రభుత్వ ప్రత్యేక విధానాలు, ఇంక్యుబేటర్లు, సీడ్-ఫండింగ్ మద్దతుతో 2025-26 నాటికి ఆ సంఖ్య 13వందలు దాటింది.

జెడ్-మోర్ టన్నెల్, చీనాబ్ రైల్వే బ్రిడ్జి, కొత్త హైవేలు ఇక్కడి ప్రగతికి నిదర్శనాలు. మంచు కొండలు, పచ్చని లోయల నుంచి. వందేభారత్ రైళ్లు పరుగులు తీయడం కొన్నేళ్ల క్రితం ఊహకు కూడా అందని దృశ్యం ఇప్పుడు కనిపిస్తోంది. కశ్మీర్‌లో కనిపిస్తున్న ఈ స్పష్టమైన అభివృద్ధి పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే పహల్గామ్ లాంటి దాడుల ద్వారా అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని భద్రతా విశ్లేషకులు చెబుతున్నారు.

నెత్తురోడిన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్- అల్లర్లలో 30 మందికిపైగా మృతి!

దేశ భద్రతకు వ్యూహాత్మక సొరంగం- జోజిలా టన్నెల్‌ చివరి బ్లాస్ట్ విజయవంతం