1950 నాటి విలయాన్ని గుర్తుచేస్తున్న నేపాల్ జలప్రళయం- అసోంలో అప్పుడేం జరిగింది?
అసోం భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం- ఇప్పటికీ తేలని అధికారిక గణాంకాలు- ఆ మహా విపత్తును తలపిస్తోన్న ప్రస్తుత నేపాల్ ఆకస్మిక వరదలు

Published : August 29, 2026 at 4:40 PM IST
Nepal Flash Floods Recall : నేపాల్‌ను ముంచెత్తిన జలప్రళయం (ఆకస్మిక వరదలు) ఇంకా మన కళ్లముందే కదలాడుతోంది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మరోవైపు మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ ఘోర విపత్తుకు గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. సరిగ్గా ఇలాంటి ప్రకృతి విపత్తే 1950లో అసోంలో సంభవించింది. ఆనాటి గ్రేటర్ అసోం, టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపం ధాటికి జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం గురించిన ఆధారాలు ఇప్పటికీ లభించకపోవడం గమనార్హం. అప్పట్లో ఆ భూకంపాన్ని కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాల ద్వారా మాత్రమే అప్పుడు ఏం జరిగిందో మనం ఊహించగలం.
భయంకరమైన రాత్రి!
అది 1950 ఆగస్టు 15వ తేదీ. అంటే ఆ రోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం. దేశం అప్పుడప్పుడే బానిసత్వ సంకెళ్ల నుంచి కోలుకుంటూ, భవిష్యత్తు నిర్మాణంపై దృష్టి సారిస్తున్న సమయం. సరిగ్గా అదే సమయంలో ఒక మహా విపత్తు దేశాన్ని అతలాకుతులం చేసింది. 1950 ఆగస్టు 15 రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 8.6 తీవ్రతతో అసోం, టిబెట్ ప్రాంతాలను ఒక భారీ భూకంపం వణికించింది. ఆనాటి గ్రేటర్ అసోం, టిబెట్ సరిహద్దుల్లోని మిష్మి హిల్స్, రిమా ప్రాంతాలు ఈ భూకంపానికి కేంద్రాలుగా ఉన్నాయి. ఇండియన్, యురేషియా టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల సంభవించిన ఈ భూకంపం ఎంత తీవ్రంగా ఉందంటే, భూమిపై పెద్ద పెద్ద పగుళ్లు, రంధ్రాలు ఏర్పడ్డాయి. కొండచరియలు విరిగిపడి బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల్లో పడ్డాయి. అలా ఏర్పడిన సహజసిద్ధమైన మట్టి ఆనకట్టలు (debris dams) నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. కానీ ఆ తర్వాత అవి బద్దలు అయ్యి వినాశకరమైన ఆకస్మిక వరదలకు కారణమయ్యాయి. ఇలా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో నివాస ప్రాంతాలు, వ్యవసాయ భూములను ముంచేశాయి. అంతేకాదు నదుల ప్రవాహ మార్గాలు మారిపోయి, ఆ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా అసోంలోని బ్రహ్మపుత్ర నదీ గర్భంలో భారీగా మట్టి, ఇసుక పేరుకుపోవడంతో, నదిలోని నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. ఇది క్రమంగా ఆ రాష్ట్రంలో దీర్ఘకాలిక వరద సమస్యకు దారితీసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 1950 ఆగస్టు 15న సంభవించిన భూకంపం కంటే, ఆ తర్వాత వచ్చిన ఆకస్మిక వరదల వల్ల కలిగిన నష్టమే చాలా ఎక్కువ.
అది ఎంతో భయంకరం: ప్రత్యక్ష సాక్షి
అసోంలోని లఖింపుర్ జిల్లా సొరైమోరియా హటిగోరియా గ్రామానికి చెందిన 98 ఏళ్ల నీలకంఠ బోరా ఆనాటి భయానక రోజుల గురించి ఈటీవీ భారత్‌తో చెప్పారు. "భూకంపం సంభవించినప్పుడు నా వయస్సు 22 సంవత్సరాలు. ఆ రోజు నేను మా పొలం దగ్గర ఉన్నాను. ఒక్కసారిగా భూమి పదే పదే కంపించడం మొదలైంది. భూమి లోపలి నుంచి నీరు పైకి ఉబికి వచ్చింది. చాలా చోట్ల భూమి కుంగిపోవడం, పైకి లేవడం జరిగింది. భూకంపం ధాటికి పొడి నేలల నుంచి ఇసుక, బురద బయటకు వచ్చాయి. భూమి కంపిస్తూ, నేల కుంగిపోతున్న పరిస్థితుల్లో నేను ఎలాగోలా ఇల్లు చేరాను. అప్పటికే మా పొలంలోని కొంత భాగం కిందకు కుంగిపోయింది. వింత వింత శబ్దాలు, ప్రజల ఆర్తనాదాలు నాకు వినబడ్డాయి. దాంతో నేను బతుకుతానన్న ఆశనే వదిలేశాను" అని ఆనాటి భయానక ఘటనలను నీలకంఠ బోరా కళ్లకు కట్టినట్లు చెప్పారు.
నెల రోజులపాటు భూమి కంపిస్తూనే ఉంది!
"ఈ విధంగా భూమి కంపించడం దాదాపు 7 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగింది. ఆ తర్వాత కూడా తీవ్రత తగ్గినప్పటికీ, దాదాపు ఓ నెల రోజుల పాటు చిన్న చిన్న భూకంపాలు వస్తూనే ఉండేవి. ఎవరూ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. పునర్నిర్మాణం అంతా ప్రజల స్వయం కృషితోనే జరిగింది. భూకంపం వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు మేము చాలీచాలని ఆహారంతోనే బతికాం. వాస్తవానికి భూకంపం కంటే, ఆ తర్వాత వచ్చిన ఆకస్మిక వరదలే మరింత ప్రమాదకరంగా మారాయి" అని నీలకంఠ బోరా ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
"ఈ భారీ భూకంపం కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబన్సిరి నది ప్రవాహానికి పెద్ద అడ్డంకి ఏర్పడింది. దీనితో అసోం వైపు ప్రవహించే నది పూర్తిగా ఎండిపోయింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా వచ్చిన భారీ వరదలు ఆ ప్రాంతాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేశాయి. ఇటీవల నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని నేను వివిధ వార్తా మాధ్యమాల ద్వారా చూస్తుంటే, నా యవ్వనంలో మేము అనుభవించిన పరిస్థితి నా కళ్లముందే కదలాడుతోంది" అని నీలకంఠ బోరా అన్నారు.
ప్రతి విపత్తుకూ వాతావరణ మార్పులే కారణమని చెప్పడం సరైనది కాదు- శాస్త్రవేత్తల హెచ్చరిక

