ETV Bharat / bharat

భక్తి సాహసం- 450 కి.మీ స్కేటింగ్ చేసి అయోధ్యకు చేరుకున్న 9 ఏళ్ల బాలిక

9 ఏళ్లు అంటే ఆటపాటలకే పరిమితమయ్యే వయసు- అసాధారణ సాహస యాత్ర చేసి అందరినీ అబ్బురపరచిన బాలిక!

Vanshika Skates To Ayodhya Temple
Vanshika Skates To Ayodhya Temple (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 10:53 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vanshika Skates To Ayodhya Temple : ఉత్తర భారతదేశాన్ని గడ్డకట్టే చలి వణికిస్తోంది. సామాన్యులు బయటకు రావడానికే భయపడుతున్న తరుణంలో ఓ తొమ్మిదేళ్ల బాలిక తన భక్తిని చాటుకుంది. అదేంటంటే తన ఆరాధ్య దైవం అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి పెద్ద సాహసమే చేసింది. ఫిరోజాబాద్‌కు చెందిన వంశికా యాదవ్ అనే చిన్నారి రామలల్లాను దర్శించుకోవాలనే పట్టుదలతో ఏకంగా 450 కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు చేరుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్‌కు చెందిన వంశికా యాదవ్ తన జనవరి 3న తన యాత్రను ప్రారంభించింది. ఫిరోజాబాద్ నుంచి అయోధ్య వరకు ఉన్న దాదాపు 450 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 రోజుల్లో స్కేటింగ్ ద్వారా అధిగమించింది. జాతీయ రహదారులు, గ్రామాలు, వీధులు, ఇరుకైన గల్లీల గుండా స్కేటింగ్ చేస్తూ ఎట్టకేలకు శుక్రవారం అయోధ్యకు చేరుకుంది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఎదురైనా, ప్రయాణ దూరం భారమైనా తాను అనుకున్న లక్ష్యం పక్కకు తప్పుకోకుండా తన మిషన్‌ను కొనసాగించింది. ఈ సందర్భంగా తన సాహస యాత్ర గురించి వంశికా యాదవ్ స్పందించారు. "నా భక్తి, దృఢ సంకల్పమే నన్ను ఈ దిశగా నడిపించాయి" అని ఆమె పేర్కొంది.

తండ్రి, బాబాయ్ సహకారం
తనప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు ఆమె తండ్రి శివ శంకర్ యాదవ్, ఆమె బాబాయ్ కారులో వెనుక ఉండి రక్షణగా నిలిచారు. యాత్ర మధ్యలో విరామం తీసుకున్న సమయాల్లో వంశికా రోడ్డు పక్కన ఉన్న మైలురాళ్లపై పేరుకుపోయిన ధూళిని, పిచ్చి మొక్కలను, చెత్తను శుభ్రం చేస్తూ కనిపించింది. ఇలా తన ప్రయాణంలో ఆమె భక్తితో పాటు సామాజిక బాధ్యతను చాటిచెప్పింది.

అయోధ్యలో స్వాగతం
వంశికా అయోధ్యకు చేరుకోగానే 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్' ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె నేరుగా ఆలయానికి వెళ్లి రామలల్లాను దర్శించుకుంది. ఈ సందర్భంగా రామ దర్బార్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆ చిన్నారి చూపిన అచంచలమైన పట్టుదల ధైర్యాన్ని చూసిన భక్తులు ఆమెను మెచ్చుకున్నారు. గడ్డకట్టే చలిలో స్కేటింగ్ చేస్తూ అంత దూరం ప్రయాణించి ఆమె సాధించిన ఈ ఘనతను చూసిన వారంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. ఆమె సాహసానికి ఫిదా అయ్యారు. రామ మందిర ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడారు. వంశికా దృఢ సంకల్పాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. వంశికాకు వెన్నుదన్నుగా నిలిచిన ఆమె తల్లిదండ్రులను కూడా అనిల్ మిశ్రా ప్రత్యేకంగా అభినందించారు.

"ఈ గడ్డకట్టే చలిలో 450 కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ వంశికా ఇక్కడికి చేరుకున్న తీరు చూస్తుంటే ఆమె భక్తిని ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా వీక్షిస్తున్నాడని అనిపిస్తోంది. బలమైన సంకల్పం ఉంటే ఎంతటి కష్టతరమైన సవాలునైనా అధిగమించవచ్చని వంశికా ఈ దేశ యువతకు చాటిచెప్పింది"-- అని రామ మందిర ట్రస్టీ, డాక్టర్ అనిల్ మిశ్రా అన్నారు.

ఈ వయసులో పిల్లలు ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటున్న తరుణంలో వంశికా ఎంచుకున్న ఈ మార్గం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె స్కేట్లు, మనసు రెండూ భక్తితో ఏకమై ఈ కఠినమైన ప్రయాణాన్ని పూర్తి చేశాయి. ఎట్టకేలకు తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడిని మనసారా, కళ్లారా దర్శించుకున్న ఆ చిన్నారి ముఖంలో అంతులేని ఆనందం వెల్లివిరిసింది. స్కేటింగ్ చేయడం అనేది శారీరక శ్రమతో కూడుకున్న పని. ముఖ్యంగా చలికాలంలో కండరాలు త్వరగా బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గంటల తరబడి స్కేటింగ్ చేయడం ఆ చిన్నారి ధృడ సంకల్పానికి నిదర్శనమని చెప్పాలి.