కేరళలో షిగెల్లా కలకలం- నెలరోజుల్లో 70 కేసులు- ఎన్నికల కోడ్ వల్లే వ్యాప్తి పెరిగిందన్న మంత్రి!
ఈ ఏడాది ఇప్పటివరకు 146 షిగెల్లా కేసులు నమోదు- జూన్‌లోనే 70 కేసులు- వైరల్ వ్యాధుల నివారణకు హైపవర్ కమిటీ ఏర్పాటు- నిపా వైరస్ పరిస్థితి అదుపులోనే ఉందన్న ఆరోగ్య మంత్రి

Published : June 16, 2026 at 4:39 PM IST
Shigella Virus In Kerala : కేరళలో షిగెల్లా వ్యాధి వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జూన్ నెలలోనే 70 కేసులు నమోదవగా, మొత్తం మరణాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో వైరల్, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె. మురళీధరన్ మంగళవారం వెల్లడించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 146 షిగెల్లా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక మరణం మార్చిలో సంభవించగా, మిగిలిన నాలుగు మరణాలు జూన్ నెలలో చోటుచేసుకున్నాయి. ఇటీవల కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. షిగెల్లా వ్యాప్తితో పాటు నిపా వైరస్ ముప్పును కూడా ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కన్సల్టెంట్ డాక్టర్ ఎస్.ఎస్. లాల్ అధ్యక్షతన హైపవర్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై పరిస్థితిని సమీక్షించి, అధికారులకు తగిన సూచనలు అందిస్తుందని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధులను శాశ్వతంగా నివారించే మార్గాలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుందని తెలిపారు.
నిపా వైరస్ పరిస్థితిపై స్పందించిన మంత్రి, ప్రస్తుతం ఒకరికి మాత్రమే పాజిటివ్ నిర్ధరణ అయిందన్నారు. అనుమానితుల నుంచి సేకరించిన 38కుపైగా నమూనాల్లో మిగిలినవన్నీ నెగెటివ్ వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వ్యక్తి వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు. గత అనుభవాల ఆధారంగా ఈ ఏడాది కూడా నిపా వ్యాప్తిని సమర్థంగా అడ్డుకుంటామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, షిగెల్లా కేసులు పెరగడానికి ఎన్నికల కోడ్ కారణంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆలస్యమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కొత్త ప్రజాప్రతినిధులు బాధ్యతలు స్వీకరించారని, వారిలో చాలామంది కొత్తవారేనని చెప్పారు. అనంతరం అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రీ-మాన్సూన్ శుభ్రత కార్యక్రమాలు సక్రమంగా జరగలేదన్నారు. దీనిని ఎవరి వ్యక్తిగత వైఫల్యంగా చూడలేమని, వ్యవస్థాపరమైన జాప్యంగా పరిగణించాలని తెలిపారు.
కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు
అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో చర్యలు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న రోడ్డుపక్క ఆహార కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, తినుబండారాల దుకాణాలను మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ తయారీ సంస్థలపైనా ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కొన్ని చోట్ల సాధారణ నీటిని సిరంజీల సాయంతో బాటిళ్లలోకి నింపుతున్నట్లు సమాచారం అందిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యాధుల నియంత్రణ కోసం శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యాక్షన్ కమిటీతో పాటు జిల్లా స్థాయిలో అవుట్‌బ్రేక్ మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, రాపిడ్ రెస్పాన్స్ బృందాలు కలిసి స్థానిక పరిస్థితులను పర్యవేక్షిస్తాయి. పంచాయతీ స్థాయిలో కూడా అప్రమత్త చర్యలు చేపడతాయి. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్ ఈ వ్యవస్థను సమన్వయం చేయనున్నారు. ఇక కన్నూర్ జిల్లాలోని మొకేరి గ్రామపంచాయతీలో సోమవారం రెండు షిగెల్లా కేసులు నమోదయ్యాయి. నాలుగు, ఎనిమిదేళ్ల వయస్సు గల ఇద్దరు బాలురకు ఈ వ్యాధి నిర్ధరణ అయింది. దీంతో రాపిడ్ రెస్పాన్స్ బృందం అక్కడ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. విరేచనాల కారణంగా పాఠశాలలకు హాజరు కాకుండా ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారా అనే అంశంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం బాధిత చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వ్యాధి లక్షణాలేంటి?
వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించేందుకు ఆరోగ్యశాఖ దర్యాప్తు చేపట్టింది. కలుషితమైన తాగునీరు, అపరిశుభ్రమైన ఆహారం, చేతుల పరిశుభ్రత లేకపోవడం వల్ల షిగెల్లా వ్యాపిస్తుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కేసీ సచిన్ తెలిపారు. షిగెల్లా అనేది మనుషుల్లో పేగు సంబంధిత ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీరు లేదా బాధితులతో సన్నిహిత సంబంధాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అపరిశుభ్ర పరిస్థితుల్లో వ్యాధి వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యాధి లక్షణాల్లో విరేచనాలు, కొన్ని సందర్భాల్లో రక్తం లేదా శ్లేష్మంతో కూడిన మల విసర్జన, కడుపునొప్పి, జ్వరం, వాంతులు, వికారం ప్రధానమైనవి. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన ఒకటి నుంచి మూడు రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మల పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధరిస్తారు.
చికిత్సలో భాగంగా శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. వ్యాధి నివారణకు భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి వినియోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి. ఆహారాన్ని బాగా ఉడికించి తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా షిగెల్లా వంటి అంటువ్యాధులను నివారించవచ్చని ఆరోగ్యశాఖ సూచించింది.
కోరలు చాస్తున్న ఎబోలా వైరస్- 100 దాటిన మృతుల సంఖ్య
ఎబోలా వైరస్ అలర్ట్ - ఆ దేశాలకు ప్రయాణాలు వద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

