క్యాన్సర్‌తో మాట పోయినా కళను వదల్లేదు- పెయింటింగ్, కాలిగ్రఫీతో భావాలకు ప్రాణం
క్యాన్సర్ కారణంగా గొంతును కోల్పోయినా కళను మాత్రం వదల్లేదు- కశ్మీర్ ఆర్టిస్ట్ 65 ఏళ్ల ముష్తాక్ అద్భుత ప్రతిభ- నా పెన్, బ్రష్‌లే ఇప్పుడు తన గొంతు అంటూ భావాలు వ్యక్తం చేస్తున్న కళాకారుడు

Published : September 2, 2026 at 7:13 AM IST
SM Mushtaq Cancer Artist : 'క్యాన్సర్ మహమ్మారి నా గొంతును లాక్కుంది. కానీ నా ఆశను, ఆత్మవిశ్వాసాన్ని కాదు. ఇప్పుడు నా పెన్ను, నా కుంచె మాత్రమే నా అసలైన గొంతుకలుగా మారాయి.!' అని అంటున్నారు కశ్మీర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎస్ఎమ్. ముష్తాక్. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ, ఆస్పత్రి బెడ్‌పై ఉండి కూడా ఆయన సృష్టించిన కళాఖండాలు ప్రస్తుతం శ్రీనగర్‌లోని ఆయన ఆర్ట్ గ్యాలరీలో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 65 ఏళ్ల ముష్తాక్ క్యాన్సర్ కారణంగా గొంతును కోల్పోయారు. అయితే మాట్లాడే శక్తి దూరమైనా, తన పెన్, బ్రష్‌లను ఆయుధాలుగా చేసుకొని తన భావాల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
శ్రీనగర్ బార్జుల్లా ప్రాంతానికి చెందిన ముష్తాక్ చిన్నప్పటి నుంచే చిత్రలేఖనం, కాలిగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నారు. కాలక్రమేణా అదే ఆయనకు ఇష్టమైన కళగా మారడంతో పాటు జీవనోపాధి కూడా అదే అయింది. ప్రత్యేకంగా కశ్మీర్ అందాలను తన పెయింటింగ్స్‌లో అద్భుతంగా చూపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పాత శ్రీనగర్‌లోని ఇరుకైన వీధులు, లాల్ చౌక్, జీలం నది ఒడ్డున ఉన్న ఇళ్లు, చెక్క వంతెనలు, పచ్చని కొండలు వంటి దృశ్యాలను ఆయన తన కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు. వీటితో పాటు అరబిక్, ఖురాన్ కాలిగ్రఫీని కూడా జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.

చిన్నప్పటి నుంచే కళపై ఆసక్తితో
ముష్తాక్ తనకు చిన్నప్పటి నుంచే కళపై ఆసక్తి ఉందని తెలిపారు. ఈ రంగంలో ప్రత్యేకంగా ఎలాంటి గురువు లేకపోయినా, ఎంఎఫ్ హుస్సేన్ వంటి దేశీయ దిగ్గజ కళాకారుల చిత్రాలను నిశితంగా పరిశీలించి ఈ విద్యను వంటబట్టించుకున్నట్లు చెప్పుకొచ్చారు. తన జీవితంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో కూడా కళ తనను విడిచిపెట్టలేదని ముష్తాక్ వివరించారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న సమయంలోనూ, ఇంటి బెడ్‌రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా పెయింటింగ్స్, కాలిగ్రఫీని కొనసాగించినట్లు చెప్పారు.

గొంతు పోయింది- కళ మాత్రం మిగిలింది!
క్యాన్సర్ కారణంగా తన గొంతును కోల్పోవడం ముష్తాక్ జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఆ బాధతో నిరాశలోకి కూరుకుపోకుండా, దానిని కళవైపునకు మళ్లించారు. ఆయన కుమారుడు మిర్ షారిఖ్ మాట్లాడుతూ, క్యాన్సర్ కారణంగా తన తండ్రి గొంతును కోల్పోయిన తర్వాత, పెన్, బ్రష్‌లే ఆయనకు గొంతుగా మారినట్లు చెప్పారు. వాటి ద్వారానే ఆయన తన భావాలు, అనుభవాలను ఇతరులకు తెలియజేస్తున్నారని వివరించారు. ముష్తాక్ కూడా స్వయంగా ఇదే విషయం చెబుతున్నారు. క్యాన్సర్‌తో పోరాడే క్రమంలో విలువైన తన గొంతుతో పాటు ఇంకా ఎన్నో కోల్పోయానని, అయినప్పటికీ నిరాశలో కూరుకుపోలేదని తెలిపారు. 'కాలిగ్రఫీ కోసం పెన్ లేదా కాన్వాస్‌పై చిత్రం గీయడానికి బ్రష్ తీసుకున్నప్పుడు నా సమస్యలన్నీ మర్చిపోతాను' అని ముష్తాక్ వెల్లడించారు.

చికిత్స సమయంలో వేసిన చిత్రాలకు ప్రత్యేక స్థానం
ముష్తాక్ కళా ప్రదర్శనలో (ముష్తాక్ ఆర్ట్ గ్యాలరీ) ఆయన క్యాన్సర్ కోసం చికిత్స పొందుతున్న సమయంలో వేసిన చిత్రాలకు ప్రత్యేక విభాగమే ఉంది. ఆస్పత్రి బెడ్‌పై ఉండగానే ఆయన రూపొందించిన కొన్ని చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. తన జీవితంలోని వివిధ దశల్లో ఎదురైన అనుభవాలు, భావోద్వేగాలను ఈ చిత్రాల్లో ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ముష్తాక్ వాటర్, ఆయిల్ రంగులు (యాక్రిలిక్ కలర్స్) ఉపయోగించేవారు. వైద్యుల సూచనల మేరకు ఇప్పుడు మాత్రం ఎక్కువగా వాటర్ కలర్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఆయన చిత్రాల్లో కశ్మీర్ సహజ అందాలతో పాటుగా తన వ్యక్తిగత భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, బాధ, ఆశ వంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆయన అరబిక్ కాలిగ్రఫీ కళను చూసిన వారు ముష్తాక్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు.

క్యాన్సర్ తన గొంతును తీసుకున్నప్పటికీ- ముష్తాక్ తన సృజనాత్మకతను మాత్రం అసలే కోల్పోలేదు. మాటలతో చెప్పలేని ఎన్నో భావాలను రంగులు, గీతలు, అక్షరాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు కళ అనేది ఒక వృత్తి కానే కాదు. జీవితంలోని బాధలు, సమస్యల్ని ఎదుర్కొనే మార్గం, భావాలను వ్యక్తం చేసే భాష, తనను తాను ప్రపంచానికి దగ్గరకు చేసే, గుర్తింపు తీసుకొచ్చే స్వరంగా మారింది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన కళా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ఇంట్లోని తడి చెత్తతో కంపోస్ట్ తయారీ- 'హోమ్ కంపోస్టింగ్ మెషీన్' అభివృద్ధి- యువకుడి వినూత్న స్టార్టప్
పెరుగుతున్న సముద్ర మట్టాలు- కోల్‌కతా, ముంబయిలో లక్షలాది మందికి ముప్పు- ఐరాస హెచ్చరిక

