60 ఏళ్ల భక్తుడు- ఏడాదిలో 11,000 కి.మీ నడక- 400 దేవాలయాల సందర్శన
దేవుళ్లపై అంచంచలమైన భక్తి కలిగి ఉన్న 60 ఏళ్ల వ్యక్తి- ఏడాది వ్యవధిలో 400 ఆలయాలను సందర్శించిన వృద్ధుడు- దేవాలయాలు, సత్రాల్లో బస

Published : March 3, 2026 at 5:17 PM IST
Devotee Visited 400 Temples : మనం ఏడాదిలో మహా అయితే ఓ 10 లేదా 20 సార్లు గుడికెళ్తాం. వేరే జిల్లా, రాష్ట్రంలోని తీర్థయాత్రలకైతే ఇంకా తక్కువ సార్లే వెళ్తాం. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన 60 ఏళ్ల భక్తుడు ఏడాది వ్యవధిలో 400 గుడులను సందర్శించాడు. అందుకోసం 11,000 కి.మీలు నడిచాడు. అంతలా దైవ భక్తిని చూపించిన వ్యక్తి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆరు పదుల వయసులో చలాకీగా
సుందర్‌లాల్ స్వస్థలం విదిష జిల్లాలోని ఖేర్వా హాత్ గ్రామం. ఆయన దైవ భక్తుడు. ఏడాది వ్యవధిలో ఆయన అయోధ్య రామమందిరం, కాశీ సహా 400 గుడులను సందర్శించాడు. ఈ మతపరమైన తీర్థయాత్రలకు కాలినడకనే వెళ్తున్నాడు. 60 ఏళ్ల వయసులో కాళ్లు, మోకాలు నొప్పులతో చాలా మంది ఇంట్లో కూర్చొంటున్న సమయంలో సుందర్‌లాల్ మాత్రం అందుకు భిన్నం. ఆరు పదులు ఏజ్‌లోనూ యువకుడిలా నడుస్తూ దైవ దర్శనాలు చేసుకుంటున్నాడు.
ఏ సీజన్ అయినా డోంట్ కేర్!
వయసు పైబడినా పర్వతారోహణలు, ఎండ, చలితో సహా వివిధ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సుందర్‌లాల్ తన మతపరమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఉత్తర హిమాలయ ప్రాంతాల కఠినమైన చలి అయినా, దక్షిణ భారతదేశంలోని మండే ఎండలైనా అతని ప్రయాణ వేగం ఎప్పుడూ తగ్గలేదు. అంతటి వయసులోనూ 11,000 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం సుందర్‌లాల్ అజేయమైన సంకల్ప శక్తికి, దేవునిపై ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని చెప్పొచ్చు. సుందర్‌లాల్ భక్తి ప్రయాణం ప్రాథమిక లక్ష్యం దేవాలయాలను సందర్శించడమే కాదు. దేశ ఐక్యత, సాంస్కృతిక వారసత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించడం కూడా.

అక్కడే బస
అయితే ఇన్ని వేల కిలోమీటర్ల మతపరమైన పాదయాత్రలో సుందర్‌లాల్ ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ ఖర్చు చేయలేదు. నడుస్తున్నప్పుడు దారి మధ్యలో భక్తులు, గ్రామస్థులు అందించే అహారాన్ని తింటాడు. అలాగే దేవాలయాలు, ధర్మశాలలు, సత్రాల్లో రాత్రివేళల్లో బస చేస్తాడు. సుందర్‌లాల్ ప్రతి రోజు ఉదయం 3-4 గంటలకు నడకను ప్రారంభిస్తాడు.
'ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఎప్పూడూ ఊహించలేదు'
ఏడాది క్రితం తన మతపరమైన ప్రయాణం ప్రారంభమైందని సుందర్‌లాల్ తెలిపాడు. దేవుడిని ఆరాధించాలనే బలమైన కోరిక తనను ఇంటి నుంచి బయలుదేరడానికి ప్రేరేపించిందని వెల్లడించాడు. తాను ఇంత సుదీర్ఘ ప్రయాణం చేస్తానని ఎప్పుడూ ఊహించలేదన్నాడు. కానీ దేవుని దయ వల్ల అన్నీ సాధ్యమేనని అభిప్రాయపడ్డాడు. తనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారని, వారి నుంచి తాను ఈ ప్రయాణం కోసం ఆర్థిక సహాయం తీసుకోలేదని స్పష్టం చేశాడు. ఈ ప్రయాణాన్ని పూర్తిగా దేవుడి మీద బారం వేసి కొనసాగిస్తున్నానని అన్నాడు.
అయోధ్యలో ఎక్కువ రోజులు ఉన్నాను : సుందర్‌లాల్
"మధ్యప్రదేశ్‌లోని స్థానిక దేవాలయాల సందర్శనతో నా ప్రయాణం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశం వైపునకు ప్రయాణం సాగించాను. అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించడం నాకు కొత్త శక్తి లభించినట్లైంది. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నాను. అక్కడ గంగానదిలో స్నానం చేశాను. చాలా రోజులపాటు అయోధ్యలోనే ఉన్నాను. అక్కడ స్థానిక భక్తులు నాకు ఆహారం పెట్టారు" అని సుందర్‌లాల్ తెలిపాడు.

'దేవుడి దయతో ఆరోగ్యం, శక్తి లభించింది'
సుందర్‌లాల్ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర నుంచి రాజస్థాన్‌లోని ప్రసిద్ధ ఖాతు శ్యామ్ ఆలయం వైపునకు నడుస్తున్నాడు. "ఖాతు శ్యామ్‌జీని సందర్శించిన తర్వాత ఓంకారేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటాను. నాకు ఎటువంటి ప్రణాళికలు లేవు. దేవుడు తీసుకెళ్లినంత దూరం నడుస్తూనే ఉంటాను. రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తున్నాను. ఇంత వయసులో ఈ ప్రయాణం సవాల్‌తో కూడుకున్నదే. దేవుడి దయ నన్ను ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచింది" అని సుందర్‌లాల్ వెల్లడించాడు.
హోలీ రోజు 'రామ్‌లీలా' ప్రదర్శన- 120ఏళ్లుగా ఇదే సంప్రదాయం- ఈ నాటకానికి పాకిస్థాన్‌తో కనెక్షన్!
చదివింది 8th క్లాస్- ఆలూ చిప్స్ బిజినెస్‌లో 'చింతామణి' అదుర్స్- వార్షిక టర్నోవర్ రూ.5కోట్ల పైమాటే!

