దిల్లీ రామ్‌లీలా మైదాన్ ప్రాంతంలో ఉద్రిక్తత- అధికారులపై రాళ్లదాడి- పోలీసులకు గాయాలు
సయ్యద్ ఫైజ్ ఎలాహి మసీదు సమీపంలో కూల్చివేతలు- మున్సిపల్ అధికారులపై రాళ్లదాడి చేసిన గుంపు- భాష్పవాయు గోళాలు ప్రయోగించిన పోలీసులు

Published : January 7, 2026 at 10:33 AM IST
Delhi Ramlila Maidan Protest : దిల్లీలోని రామ్‌లీలా మైదాన్ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల కూల్చివేత తీవ్ర ఘర్షణలకు దారితీసింది. తుర్క్‌మన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్‌ఫైజ్ ఎలాహి మసీదు, శ్మశానవాటికకు ఆనుకుని ఉన్న భూమిలో కూల్చివేతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రాళ్లురువ్వారు. ఈ దాడుల్లో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 100 నుంచి 150 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది అధికారులు నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. అయితే కొందరు మాత్రం రాళ్ల దాడికి తెగబడ్డారు. ఆ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గాయపడ్డ పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మసీదు సమీపంలోని వంటశాల, డిస్పెన్సరీని ఆక్రమణలుగా న్యాయస్థానం ప్రకటించిందని వివరించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించినట్లు పోలీసులు వెల్లడించారు.
#WATCH | Delhi | Debris being cleared from the area near the Faiz-e-Elahi Masjid, Turkman Gate, where a demolition drive was carried out by the MCD last night. pic.twitter.com/i8Rpf7LVQb
— ANI (@ANI) January 7, 2026
#WATCH | Delhi: On demolition drive and stone pelting in Delhi, Nidhin Valsan, Central District DCP says, " mcd staff came here with bulldozers, and we deployed our force here. we had a discussion with locals here and told them that you should comply with the court's order. when… pic.twitter.com/eqnbSogzqt
— ANI (@ANI) January 7, 2026
"మున్సిపల్ సిబ్బంది బుల్డోజర్లు తీసుకుని ఇక్కడికి రావడంతో మేము భద్రతాబలగాలను పంపించాం. స్థానికులతో మాట్లాడి కోర్టు ఆదేశాలను పాటించాలని వివరించాం. దిల్లీ మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టగానే సుమారు 150 మంది ఇక్కడ గుమికూడారు. అందులో సుమారు 25-30 మంది పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో వెంటనే మేము అప్రమత్తమై వారిని చెదరగొట్టి ఆక్రమణల తొలగింపును ప్రారంభించాం. కానీ, స్థానికులు రాళ్లు రువ్వడం వల్ల ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించాం. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆక్రమణలు తొలగించే అధికారం ఉంటుంది. వారు కోరితే మేము భద్రత కల్పిస్తాం. సీసీటీవీతో పాటు ఇతర కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నాం. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. చాందిని మహాల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న వారే రాళ్లు రువ్వినట్లు తేలితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం."
--నిధిన్ వల్సాన్, సెంట్రల్ జిల్లా డీసీపీ
'కోర్టు ఆదేశాల మేరకు దిల్లీ మున్సిపల్ అధికారులు చర్యలు'
మరోవైపు పోలీసులపై దాడి చేయడంపై దిల్లీ మంత్రి ఆశీశ్ సూద్ తీవ్రంగా ఖండించారు. "మసీద్ ప్రాంగంణంలో వాణిజ్య భవనాలు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు చెప్పింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు దిల్లీ మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ చర్యను అడ్డుకోవడం సరైంది కాదు. ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం." అని చెప్పారు.
#WATCH | Delhi | On anti-encroachment demolition drive carried out by MCD near Faiz-e-Elahi Masjid, Turkman Gate, Delhi Minister Ashish Sood says," this is an unfortunate incident. there was a court order against the commercial establishments that had been built around the… pic.twitter.com/NDanXgi1fv
— ANI (@ANI) January 7, 2026
"తుర్కమన్ గేట్ ఆక్రమణల తొలగింపు హైకోర్టు తీర్పు. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలను అనుసరిస్తూ తొలగింపు చేపట్టారు. కానీ కొంతమంది ఇబ్బందులు సృష్టించడం సరైన పద్ధతి కాదు. దీనికి పాల్పడినవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. హైకోర్టు ఆదేశాలను పాటించడం పోలీసులు, ప్రభుత్వ బాధ్యత."
--మంజీదర్ సింగ్ సిర్సా, దిల్లీ మంత్రి
ఒక మతాన్నే టార్గెట్ చేసిందన్న కాంగ్రెస్
అటు ఆక్రమణల తొలగింపుపై కాంగ్రెస్ స్పందించింది. "ఆక్రమణల తొలగించడం మంచి పద్ధతి. కానీ బీజేపీ ప్రభుత్వం కేవలం ఒక మతాన్నే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే, కోర్టు ఆదేశాలను పాటిస్తున్న అధికారులపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదు." అని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు.

