అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు: 38 మందికి మరణశిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు
మరో 11 మందికి జీవిత ఖైదు- 2008లో అహ్మదాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్లలో 56 మంది మృతి- 200మందికి పైగా గాయాలు

Published : July 7, 2026 at 12:21 PM IST
Gujarat HC On 2008 Ahmedabad Blasts : 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మంది దోషులకు గతంలో ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును కోర్టు సమర్థించింది. జస్టిస్ ఎ.వై. కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అన్ని అప్పీళ్లను తోసిపుచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ 'ఇండియన్ ముజాహిదీన్' సభ్యులకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. అలాగే, నిందితుల అప్పీళ్లన్నింటినీ హైకోర్టు తిరస్కరించింది. దీనితో పాటు, మృతుల బంధువులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వాలని పేర్కొంది.
అసలేం జరిగింది?
2008 జులై 26వ తేదీ సాయంత్రం, సుమారు 45 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా 21 బాంబులు పేలాయి. మణి నగర్, ఇసాన్‌పుర్, నరోడా, బాపునగర్, సర్ఖేజ్, హత్కేశ్వర్ వంటి రద్దీ ప్రాంతాలను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. నగరంలోని బస్సులు, బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లలో బాంబులు అమర్చారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్, ఎల్.జీ. హాస్పిటల్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మొదటి పేలుడులో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, అక్కడ మరో పేలుడు సంభవించింది. ఈ దాడిలో మొత్తం 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
Gujarat High Court upholds the sentences of all the convicts in the 2008 Ahmedabad serial blasts case https://t.co/cTMl3PeNrX
— ANI (@ANI) July 7, 2026
ఈ ఉగ్రవాద దాడిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2022లో కీలక తీర్పును ప్రకటించింది. భారత న్యాయ చరిత్రలోనే అత్యధికంగా ఒకే కేసులో 38 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మిగిలిన 11 మందికి జీవితకాలం జైలు శిక్ష విధించింది. చట్టప్రకారం దిగువ కోర్టు విధించిన మరణశిక్ష అమలు కావాలంటే హైకోర్టు ధ్రువీకరణ తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్లకు పైగా విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు, తాజాగా ఆ శిక్షలను ఖరారు చేస్తూ తుది తీర్పును వెలువరించింది.
ఈ సందర్భంగా 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసుపై ప్రభుత్వ ప్రాసిక్యూటర్ అమిత్ పటేల్ మాట్లాడారు. "స్పెషల్ కోర్టు 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది. గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీళ్లను కొట్టివేసి, శిక్షల ధ్రువీకరణ పిటిషన్‌ను ఆమోదించింది. అలాగే, పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తీవ్రమైన గాయాలపాలైన వారికి రూ. 5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 1 లక్ష చొప్పున పరిహారం అందించాలని కూడా పేర్కొంది" అని తెలిపారు.
Gujarat Deputy Chief Minister Harsh Sanghavi (@sanghaviharsh) posts: " 38 death sentences. 11 life terms. zero mercy. july 26, 2008 amdavad serial bomb blast. today, the gujarat high court delivered one of india’s strongest and most historic verdicts near-total conviction, maximum… pic.twitter.com/aLRK69tsrl
— Press Trust of India (@PTI_News) July 7, 2026
ఈ కేసులో 77 మందిపై అభియోగాలు
ఈ కేసులో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, గుజరాత్ ఏటీఎస్, ఇతర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహించాయి. గుజరాత్‌తో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనుమానితులను అరెస్టు చేశారు. సాక్షుల ఆధారంగా మొత్తం కుట్రను ఛేదించినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులపై అభియోగాలు మోపారు. సుదీర్ఘ విచారణ అనంతరం, 2022 ఫిబ్రవరి 8న అహ్మదాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం 49 మంది నిందితులను దోషులుగా నిర్ధారించగా, సాక్ష్యాధారాలు లేకపోవడంతో 28 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.
మరోవైపు, న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఎక్స్‌లో స్పందించారు. బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించిందన్నారు. ఈ కేసులో దాదాపు నిందితులందరికి శిక్ష ఖరారైందని చెప్పారు. చివర్లో జై హింద్ అంటూ ముగించారు.
వయనాడ్‌లో మరోసారి విరిగిపడిన కొండచరియలు- శిథిలాల కింద పలువురు!

