ETV Bharat / bharat

225 అంతర్జాతీయ విమానాలు రద్దు- విమాన టిక్కెట్ల ధరలు పెరిగే అవకాశం!

పార్కింగ్ స్థలం కొరత కారణంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విమానాలను అనుమతించకూడదని అధికారులు నిర్ణయం

Flights Cancelled Due to Iran Conflict
Flights Cancelled Due to Iran Conflict (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 8:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

Flights Cancelled Due to Iran Conflict : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో వైమానిక హద్దులు మూసివేయడం వల్ల విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబయి, దిల్లీ విమానాశ్రయాల్లో కలిపి దాదాపు 225 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. పార్కింగ్ స్థలం కొరత కారణంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విమానాలను అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు.

విమాన టిక్కెట్ల ధరలు పెరిగే అవకాశం
దిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో 100 విమానాలు రద్దు అయ్యాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ ఇంటర్​నేషనల్ ఎయిర్​పోర్ట్​లో 125 విమానాలు రద్దు అయ్యాయి. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం, ఆదివారం మరో 200 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విమానాలు గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ఈ కారణంగా ప్రయాణ సమయం పెరగుతోంది. దీని వల్ల విమాన టిక్కెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికుల ఫిర్యాదులను నమోదుకు ఎయిర్‌సేవ
అటు విమానాల రద్దు నేపథ్యంలో విమానాశ్రయాల్లోని టెర్మినల్స్ వద్ద ప్రయాణికులకు సహకారం అందించేందుకు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు పలువురు సీనియర్‌ అధికారులను నియమించినట్లు విమానయాన శాఖ వివరించింది. ప్రయాణికుల ఫిర్యాదులను నమోదు చేయడానికి తాము ఏర్పాటు చేసిన డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వేదిక ఎయిర్‌సేవకు 216 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. వాటిలో ఇప్పటికే 105 ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు.

విమానయాన సంస్థలతో DGCA సమన్వయం
ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (DGCA) వివరించింది. విమానాల మళ్లింపులు, రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పించాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు సూచించినట్లు పేర్కొంది.

మార్చి 2 వరకు విమానాలు రద్దు!
అటు ఎయిర్​ఇండియా ఎక్స్​ప్రెస్​ సైతం కీలక ప్రకటన చేసింది. బహ్రైన్​, కువైట్​, ఒమన్, ఖతార్​, సౌదీ అరేబియా, యూఏఈ వెళ్లే విమానలను మార్చి 2 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఆదివారం సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్​ఇండియా ప్రకటించింది. వీటిలో షికాగో, లండన్, టొరంటో, న్యూయార్క్, పారిస్ వంటి నగరాలు ఉన్నట్లు వివరించింది. ఇంకా దోహా నుంచి వెళ్లాల్సిన అన్ని విమానాలను రద్దు చేసినట్లు ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

విదేశీయులకు హోం మంత్రిత్వ శాఖ అడ్వైజరీ
మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని విదేశీయులకు అడ్వైజరీ జారీ చేసింది. భారీగా విమానాలు రద్దు అవుతోన్న నేపథ్యంలో ప్రయాణాలకు అంతరాయం కలిగిన విదేశీయులు సమీపంలోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి సహాయం తీసుకోవాలని చెప్పింది. భారత్‌లో తమ వీసాలను పొడిగించుకోవడానికి, క్రమబద్ధీకరించుకోవడానికి అవసరమైన సహాయాన్ని అధికారులు అందిస్తారని పేర్కొంది.

ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు
సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలలోని బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా, దోహా, మనామాపై కూడా దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉద్రిక్తతలతో పాటు పలు దేశాలు తమ గగనతాలలు మూసివేయడంతో విమానలు రద్దు అవుతున్నాయి.