ETV Bharat / bharat

24 గంటల్లో 10 మంది నవజాత శిశువుల మృతి- బంగాల్ మెడికల్ కాలేజీలో విషాదం- వివరణ కోరిన ఆరోగ్య శాఖ!

మాల్దా మెడికల్ కాలేజీలో 24 గంటల్లో 10 మంది నవజాత శిశువులు మృతి- ఊపిరి ఆడకపోవడం, కామెర్లు వంటివి కారణాలుగా వెల్లడించిన వైద్యులు- ఘటనపై నివేదిక కోరిన బంగాల్ ఆరోగ్య శాఖ

Matrima Wing of Malda Medical College and Hospital
మాల్డా మెడికల్ కాలేజ్, హాస్పిటల్ (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 26, 2026 at 8:55 PM IST

3 Min Read
Choose ETV Bharat

Newborn Babies Death Case : బంగాల్‌లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 24 గంటల వ్యవధిలో ఏకంగా 10 మంది నవజాత శిశువులు మృతి చెందడం కలకలం రేపింది. ఆగస్టు రెండో వారంలో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. మృత శిశువుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు సంబంధించిన అంశాలతో కూడిన సమగ్ర నివేదిక సమర్పించాలని ఆస్పత్రి అధికారులను కోరింది. మాల్దా మెడికల్ కాలేజీలో మొత్తం 1120 పడకలు ఉన్నాయి. ఇందులోని మదర్ అండ్ చైల్డ్ హబ్ 'మాతృమా'లో ప్రసూతి, నవజాత శిశువులకు చికిత్స అందిస్తున్నారు. ఈ విభాగంలోనే 10 మంది శిశువులు 24 గంటల్లో మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.

సాధారణంగా ఆస్పత్రుల్లో రోజూ జరిగే ప్రసవాలు, మరణాల వివరాలను ప్రభుత్వం నిర్వహించే పోర్టల్స్‌లో నమోదు చేస్తుంటారు. ఈ ప్రక్రియలో భాగంగానే మాల్దా మెడికల్ కాలేజీలో శిశువుల మరణాల సంఖ్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వస్థ్య భవన్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు మాల్దా మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించి, అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని సమర్పించాలని ఆదేశించారు.

10 మందిలో 8 మంది ఇతర ఆస్పత్రుల నుంచి రిఫర్!
ఇక్కడ మృతి చెందిన 10 మంది శిశువుల్లో 8 మందిని ఇతర ఆస్పత్రుల నుంచి లేదా నర్సింగ్ హోమ్స్ నుంచి మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. మిగిలిన ఇద్దరు శిశువులు మాల్దా మెడికల్ కాలేజీలోనే జన్మించారని తెలిసింది. మాల్దా మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొసెంజిత్ బార్ ఈ అంశంపై మాట్లాడారు. శిశువుల మరణాలకు ఒక్క కారణం మాత్రమే లేదని తెలిపారు.

కొందరు శిశువులు అత్యంత తక్కువ బరువుతో జన్మించగా, మరికొందరు బర్త్ అస్ఫిక్సియాతో (సరిగా ఊపిరి ఆడకపోవడం) బాధపడినట్లు చెప్పారు. సెఫ్టీసీమియా, కామెర్లు (జాండీస్) వంటి సమస్యలు కూడా కొన్ని మరణాలకు కారణమయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని తెలిపారు. స్వస్థ్య భవన్ నివేదిక కోరిందని, ఇప్పటికే ప్రాథమిక రిపోర్ట్‌ను సమర్పించినట్లు చెప్పారు. పూర్తి నివేదికను త్వరలోనే పంపనున్నట్లు స్పష్టం చేశారు.

ఆస్పత్రి వర్గాల ప్రకారం, మాల్దా మెడికల్ కాలేజీలో రోజుకు సగటున నలుగురు శిశువుల మరణాలు నమోదవడం సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. అయితే ఒక్కరోజు వ్యవధిలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందడం అసాధారణ పరిణామంగానే అధికారులు భావిస్తున్నారు. మాల్దా మెడికల్ కాలేజీకి వచ్చే అనేక మంది నవజాత శిశువులు ఇప్పటికే తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇతర ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌ల నుంచి పరిస్థితి విషమించిన తర్వాతే రిఫర్ చేయడం వల్ల చికిత్సకు అవకాశాలు తగ్గుతున్నాయని కొందరు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నవజాత శిశువులను అవసరానికి మించి క్రిటికల్ కేర్ యూనిట్లలో ఉంచుతున్నారనే ఆరోపణలు కూడా ఆస్పత్రి వర్గాల నుంచి వినిపించాయి. అయితే ఈ అంశాలపై పూర్తి స్థాయి అధికారిక విచారణ రిపోర్ట్ ఇంకా వెలువడాల్సి ఉంది.

15 ఏళ్ల కిందట కూడా ఇలానే శిశు మరణాలు
మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ గతంలో కూడా ఇలానే ఒకసారి శిశు మరణాల పెరుగుదలతో వార్తల్లో నిలిచింది. దాదాపు 15 ఏళ్ల కిందట ఆస్పత్రిలో శిశు మరణాలు ఎక్కువగా ఉండటంతో అప్పటి పరిస్థితుల్ని పరిశీలించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) బృందం ఆస్పత్రిని సందర్శించింది. ఇక ప్రస్తుత ఘటనలో ఒక్కరోజు వ్యవధిలోనే 10 మంది నవజాత శిశువుల మరణాల నేపథ్యంలో, ఆరోగ్య శాఖకు అందించే రిపోర్ట్ కీలకంగా మారనుంది. అప్పుడే శిశువుల ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలు, మరణాలకు దారితీసిన కారణాల్ని పరిశీలించిన తర్వాతే ఘటనపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అడవి పందితో 14 ఏళ్ల బాలుడి పోరాటం- చివరికి ఏమైందంటే?

ఇకపై మొబైల్ చోరీ అయినా డోంట్ వర్రీ- దొంగ ఫొటో, లొకేషన్ క్షణాల్లో ప్రత్యక్షం- 65ఏళ్ల తాత అద్భుత ఆవిష్కరణ!