ఆ ఇళ్లలో అసాంఘిక కలాపాలు- మద్యం, గాంజా మత్తులో బెదిరింపులు - VIJAYAWADA JNNURM HOUSES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 10:35 AM IST
Vijayawada JNNURM Houses Not Given to Poor People: విజయవాడలో గత ప్రభుత్వం కోట్ల రుపాయలు ఖర్చు చేసి సింగ్ నగర్లో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ ప్రాంతాల్లో గృహాలు నిర్మించారు. ఇళ్ల నిర్మాణం జరిగి సంవత్సరాలు గడుస్తున్న అలాగే నిరూపయోగంగా ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం (Jawaharlal Nehru National Urban Renewal Mission) గృహాల దుస్థితిపై మరింత సమాచారం తెలుసుకుందాం.
చీకటి పడితే గంజాయి బ్యాచ్, మందుబాబులు ఈ ప్రాంతంలో రెచ్చిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఇళ్లకు ఉన్న తలుపులను పీకేస్తున్నారని కిటికీలకు ఉన్న అద్దాలను పగులగొడుతున్నారని పేర్కొన్నారు. మద్యం సీసాలతో, పేక ముక్కలతో ఇళ్లు దర్శనమిస్తున్నా పట్టించుకునేవారే లేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో యువత బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. విజయవాడలో ఇళ్లు లేని నిరుపేదలకు గూడును కల్పించేందుకు వీటిని నిర్మించారు. ప్రభుత్వాలు మారిన పేదలకు ఇళ్లు మాత్రం ఇవ్వలేదని స్థానికులు అంటున్నారు. అమరావతి, కొండాపావులూరు, వణుకురు లాంటి దూర ప్రాంతాల్లో ఇంటి స్థలాలను కేటాయిస్తే పనికి ఎలా వెళ్లేదని స్థానికులు చెప్పారు.